ఉత్పలమాల
అమ్మల గన్న యమ్మ మది హ్లాదము వేళ దలంచుకొందునే
గ్రమ్మిన కారు చీకటిని గాల్చు హరిన్ శరణంబు వేడెదన్
కొమ్మ! విరించి పత్నియగు కోమలి గాంచు వరంబు ౘాలు యీ
నమ్మిక గాౘు గాద నను నావ మునింగెడి భీతి గల్గదే.
అశ్వగతి పద్మముఖి వృత్తము భ భ భ భ భ గ యతి 10వ అక్షరము
దూరపుతీరములైనను తోడు ప్రయాణములో
భారము దీర్చు సుధారస పాఠము వేదములే
యారని మంటలపాలిట యంబుధియై నిలచే
ప్రేరణ గావున వ్రాసి కవిత్వము నిల్పు సిరుల్
భ భ భ భ భ గ యతి 10 (అశ్వగతి / పద్మముఖి)
భాషను భక్తిగ గాచిన పండును జీవితమే
ఘోషయు గల్గిన సూక్తులు గూర్చుగ దారులనే
తోషమె తప్పక దక్కును తోడు ప్రయోజనమై
శేషము నిండు జయంబులు జీవితమంత సదా
*మణిభూషణము / ఉత్సర:* - యతి 10, ర, న, భ, భ, ర
మాతృభాష మన పెన్నిధి మంగళదాయకంబయా
నీతి వాక్యములు సూక్తులు నిండుగ నేర్పు తల్లియై
భీతి గల్గు తరుణంబున వేదన తీర్చు తండ్రియై
జాతి వృద్ధియును వొంది ప్రజాళికి మేలు గల్గునే.
*అశ్వగతి / పద్మముఖి - భ భ భ భ భ గ యతి 10వ అక్షరము:*
ఖండములన్నియు దాటిన కాలము మారినతా
నండగ నుండి ప్రయాణము నంబుధి చేయునటుల్
నిండుగ భాండము నున్న ప్రణీతము తోడుగదా
మెండుగ గాౘుచుమ జ్ఞానము మేదిని పైన సిరిన్.
6. *కందము:*
తరములు యుగములు గడిచిన
పరదేశంబున నడచిన పయనము తోడౌ
సిరులీ సాహిత్యము మన
తరగని గని యని నిలుపుమ ధరపై సతమున్.
బ్రహ్మ పత్ని! హే భారతి పలుకు నతులు
నీరజాక్షి శ్రీ భార్గవి నెనరులివియె
నాదు రక్షణ భారము నీదె యనుౘు
వేడెద మృదు భాషిణి! వేగ రావ.
సిరులు వెన్నెలగాను చెంగున పరిమళ
మల్లెలుగా మన మధ్య నిలిపి
బ్రతుకు విధంబును పాటన నేర్పిన
గురువుకు లఘువును! గొల్వలేను
పదములలో! నింగి స్వర్ణకమలమును
పూయించె మాలియై బోధకుడయి!
కష్టములను దాటి కలలను సరి ౘూసి
తోషము నొందెడి త్రోవ ౘూపె
అమ్మ తనము యొక్క యద్భుతమును దెల్ప
తల్లియవ్వవలెనె ధాతకైన
యని వచింౘు ఘనునికర్చన యీ కైత
పలుకు లోన యాట వెలఁది నందు.
కానల శోభల కైతలు వల్లింౘు
యడవి రాముడి బల్కు యద్భుతంబు
నావను నడిపింౘు నాయకుడను దెల్పు
డ్రైవరు రాముడు రక్షకుడని
ఎన్ని సవాళ్ళైన యెదిరింౘు ఛాలెంజ్
రాముని పొగుడునే వ్రాతలోన
సర్కసు రాముడు సంతోషము బంౘు
బాలలకు యనుౘు వ్రాయు వాడు
పాటకారుడతడు బ్రహ్మ వోలె సృజియింౘు
పదములెల్ల సులువు పథము తనకు
సుందర దరహాసమందునే శ్రోతలు
వినిన తనదు గీత! ప్రీతి గలుగు.
(*నాయకుడే రక్షకుడని భావన*)
No comments:
Post a Comment