దత్తుని గొలిచెద దత్తుని గొలిచెద
ఙ్ఞానము నొసగెడి దత్తుని గొలిచెద ||దత్తుని||
పంచభూతములూ అష్టదిక్కులు
నవగ్రహములూ నందీ గరుడులు
అందఱి దయతో అందలమందిన
ఆనందముతో ధన్యత తెలిపెద
విఘ్నము గండము లన్నియు బాపెడి
విమల సుతునకూ వినయము మ్రొక్కెద
భక్త సులభుడగు బాంధవ్యునకూ
భక్తిగ కరములు మోడ్చెద సతతము
ముగురమ్మలకూ మూలపుటమ్మను
ముదమున దలచెద మదినన్ విడువక
మయూర వాహనుడౌ షణ్ముఖునకు
మంగళమంటూ మన్నన చూపెద
పిలచిన పలికెడి వేలుపు తల్లీ
మానస దేవికి మనసర్పించెద
శరణని వేడిన కరుణను పరుగిడు
హరి మాధవునకు హారతినిచ్చెద
వృద్ధికి మూలము శుద్ధికి రూపము
లక్ష్మీ మాతను రక్షణ వేడెద
బుద్ధిని సిద్ధిని పూర్ణము గూర్చెడి
వాణీ మాతకు పలుకుల మాలలనిడెద
తలవ్రాతలకూ మూలము బ్రహ్మను
తలపోయక నా ప్రార్థన ముగియదు
పితృదేవతలకు వినయపు వినతులు
తరతరంబులను తరగనీయవలదని
అక్షర రూపము దోసములున్నను
అర్చన విడుచుట వలదని ఆలాపనగా
అందఱికీ నా స్తుతి ఈ గీతము
అడుగడుగున మము గాౘగ రండో
అవనిని విడువక ఆదరంబుతో
అక్షయమౌ మీ అనురాగముతో
No comments:
Post a Comment