Monday, September 30, 2019

బతుకమ్మ మీద పాట


కదిలించేశారు....

In Facebook, I have composed and posted on Sharada Madam's wall in continuation to her song:


మా మంచి మైసమ్మా ఉయ్యాలో మగువలెల్లా నువ్వూ ఉయ్యాలో...
మల్లేపూవల్లే ఉయ్యాలో చూసుకో తల్లిగా ఉయ్యాలో...
రక్షగా నిలిచీ నువ్వూ ఉయ్యాలో రెక్కలే ఈయమ్మా ఉయ్యాలో
లెక్కలే అడుగకా ఉయ్యాలో ఎగరనీ సక్కంగ ఉయ్యాలో
కలలెన్నో ఉన్నాయి ఉయ్యాలో కలతల్ని చేరనీక ఉయ్యాలో
కలప చాటున మావి ఉయ్యాలో కాలీన బ్రతుకూలు ఉయ్యాలో
కాలినీ నోటినీ ఉయ్యాలో మెదపలేని గతుకూలె ఉయ్యాలో
కలవనీ లోకంతో ఉయ్యాలో కననీ బిడ్డల్ని ఉయ్యాలో
కళలనీ నేరువనీ ఉయ్యాలో మరువనీకు పుట్టింటినీ ఉయ్యాలో
ఎదగనీ మమ్మల్ని ఉయ్యాలో ఏమార్చనీక ఉయ్యాలో
పొసగనీ పదుగురితొ ఉయ్యాలో పోరు పొక్కూ లేక ఉయ్యాలో
తగవులన్నవె లేక ఉయ్యాలో తెమలనీ తరుణులని ఉయ్యాలో
తిరిగిరానిదే తరుణము ఉయ్యాలో గడిచినదెపుడూనూ ఉయ్యాలో
తెమలనీ బతుకులనీ ఉయ్యాలో తేలికగా సాగాక ఉయ్యాలో
తీపి గురుతులను మాకు ఉయ్యాలో చెయ్యమ్మ ప్రతిక్షణము ఉయ్యాలో
పండుగా మారనీ ఉయ్యాలో పసిగుడ్డుగ ప్రతి కణము ఉయ్యాలో

Thursday, September 26, 2019

సజల నేత్రి - సంద్రమునకు ధాత్రి

నయనమను నీల మేఘము వర్షించి సంద్రము కాగా

నీలవర్ణమున ఉబికే నయనపు నీటి మాటున
అలలుగ‌ తేలిన బాధను బిగిసిన పంటి చాటున
కరిగిన కలలకు సాక్ష్యముగ కాటుక కన్నుల నుంచి
జారిపోయిన మత్యమంటి మనసును నేను

చోర లంచగొండిగ ధనము కూడబెట్టిన
గోల్పోయిననేమినది కొంతయె నిష్ట జీవితమ్మున
అతిగ నితరులపైన తన పనులకు సైతం ఆధారపడి
పిమ్మట ఆరోగ్యమ్ము గోల్పోయిననదియు అంత చేటుగాదు
మరి చెప్పుడు మాటలు విని తప్పుడు గుణముల నింపుకొని
ఆదరించు ఆలిని గోల్పోయిననది తనను తాను
మొత్తము గోల్పోవుటయె గాద
గ్రహియింపుమా ఓ పురుషా!

కన్యాశుల్కం - వరవిక్రయం
ప్రక్రియ ఏదైనా ప్రశ్నార్థకం మగువ జీవితమే
ప్రవర మగవానిది ప్రహేళిక ప్రతి ముదితది
ప్రగతి కారకుండు పురుషుండుట
పడతి బానిసలకు ప్రతినిధట
పురుడు మాత్రమే పుడమి రూపుదట
పుణ్యమైతె అది ఆతనిదట
ప్రముఖుడెప్పడు వరుడేనట
ప్రదోషవేళ మనకతని స్మరణమట
ప్రస్థానమ్మున అగ్రపదవతనికట
ప్రతి విషయమందు మనమనుచరులమట
ప్రయోగశాలలం మనమేనట
ప్రయోజనాలెపుడు వారికెనట
ప్రయత్నమ్ము సేయవలదెపుడట
పతిదేవులను మార్చుటకట
పత్ని బ్రతుకుకునెప్పుడు కటకటే
పదములనెప్పటికీ వెనకేనట
పాపమైతేనే మనము ముందట
అక్కటా అన్ని దశ, దిశలయందునూ ఇదే అవస్థట
యుగ, తరములు గడిచినా ఇది మారదట





Saturday, September 21, 2019

ఆదిత్యుడు

🙏🙏🙏 ఆదిత్యుడు ఈయన ఆద్యుడీ లోకమునకే
ఆరంభం ఈతడే అదితి సుతుండు
అందరి చే వందితుండు ఆర్క నామధేయుండు
ఆవిరి చేయగలడు కడలిని కానీ
ఆంతరంగమున దయామయుండు
ఆదిదంపతులకు అతను నేత్రుండు
ఆనందాలకు మూలకారకుండు
ఆశ్రిత వత్సలుండు అటులే గాద కర్ణుడిని మరి కాచుకుంది
అశ్విని దేవతల పతి ఈతండు ఆరోగ్య దాయకుండు


ఆది దేవుడే ఆగమనము సేయగా
అపూర్వ దిశ నుండి ఆగని గమనము సేయించగా
అనునిత్యము జ్వలించు అగ్ని గుండము సేవించగా
అడుగడుగునా మా అవసరాలను తీర్చుచుండగా
అనంతలోకాలకి అందని దూరమున ఉంటూ
అంబరమున నిలిచి మాకు పగలును అందించుమా
ఆయురారోగ్య ఆనందాలతో మము దీవించుమా
ఆదిత్యునివైన నిన్ను మేము సదా కొలుతుముమా

జగదంబిక జయనేత్రానివైన ఘనుడవు నీవు
జలజాక్షి కొలువైన రథమండలము నడుపు సారథివీవు
జంగమయ్య రుద్రుడై నిలుచు అశ్వవాహనుడవీవు
జానకీపతి కదనరంగాన కొలిచిన ప్రత్యక్ష దైవానివీవూ



వెలుగు ను పంచడం లో అద్వితీయుడవు  వేకువ జాము కు ఆదిముడవు
వెన్నెల మామకు సైతం ఆదర్శ ప్రాయుడవు వేల్పుగా కొలువబడే ఆదిత్యుడవు
సృష్టికి ఆనంద కారకుడవు సకల జీవ కోటి కీ ఆరాధ్యుడవు
సుకుమారమైన పుష్పాలకు సైతం ఆశ్రితుడవు
కర్మ సాక్షీ కాంతి నిలయా కారుణ్య మూర్తి అందుకో మా వందనాలు
భాస్కరా భానుదయా ద్వాదశ రూపా దినకర తేజా దీవించు మమ్ము విజయాలతో



ఆదిత్యుడు అగ్ర స్థానుడు
ఆరంభ కారకుడు ఆరోగ్య దాయకుడు
ఆవిరి చేయగలడు అంబుధిని
అందించనూగలడు అమృతమును

"""""""""""""""""""""""""""""
హే కమలముల‌ రేడా కిరణముల గూడా
నీ వలననే ఏర్పడునులే ప్రతి నీడా
కలువల చెలిమికి నీవే తోడా
తూరుపుపై నీదెపుడు చెదిరి పోని జాడ

నిను కోరే వారికి నీపై కోపమున్నవారికీ
నిందలు బేధములెన్నడు సేయక
సమముగ వెలుగును పంచీ ఇచ్చే
దయగల మమతల సూరీడా

ప్రత్యక్ష సాక్షివీవు ప్రతి కర్మకూ
పలుకవు అయినా ఎటువంటి ప్రశ్నకూ
పయనము మౌనముగ చేస్తూ నీవూ
పూర్వము నుంచి పశ్చిమాద్రి కేగేవూ

ప్రతి నిత్యం పరుగిడుతున్నా
పదిలమే నీలో అంతే శక్తి
ప్రాభవమింతైనా కరగదు; దిన
ప్రచోదనం నీతోనే ప్రారంభం

వామాంకులకూ నేత్రముగా
వాసుదేవునితోనూ వర్ధిల్లుతూ
ద్వాదశాశ్వములతో అలుపెరగక
నడుస్తూ యుగయూగాలనూ దాటిన

ప్రాజ్ఞుడవీవూ ప్రాచీనుడవూ
పసిడీ సైతం నీలో ఒదిగే
ప్రాణాలు సమస్తం నీ వల్లే ఎదిగే
ప్రావీణ్యత అంతా నీదేలే

గగనమున సింధూరంలా భువిపై
పంటలలోనా పచ్చదనంతో వాయువు
లోనాగ్నిలోని ఆత్మవుగా నీటికీ మూలంగా

పంచభూతాలలో ఉనికిగానూ
ప్రకృతి మాతకు మూలంగానూ
విలసిల్లుతూ దీపముగా భాసిల్లుతూ
జ్యోతిర్గణాధిపతిగా సమస్తమునూ నడిపెవూ

నిందలు వేసినా నిన్నేమన్నా
చెదరక మెదలక నీ దారినేగేవూ
నిజమును నిత్యం చూస్తూండెదవూ

నీ స్థానం నుంచి ఎన్నడూ దిగజారవూ

Wednesday, September 18, 2019

Sri Bhramaraambika

శ్రీ గిరీ శిఖరమందూ శంకరుని సతిగ వెలసినావూ
శీతలమ్ము నీదు గుణమే నా తల్లి నీదు నిలయము కూడా అంతే ||శ్రీ గిరీ||

దక్షునీ పుత్రివయ్యీ నీవు ఆ శివుని చేరినావూ
హిమవంత తనయవయ్యీ హాలహలమ్మునూ తరమినావూ
తపమెల్ల ఒనర్చినావూ త్రినేత్రుడిని పొందినావూ
కళ్యాణ రూపిణిగనూ కామితారథములనిచ్చినావూ || శ్రీ గిరీ ||

షష్ఠేచ కాత్యాయనిగనూ పునఃపూజ నొనర్చినీవూ
ఫాలనేత్రుని అందీ అందరికి మార్గమును చూపినావూ
వధియించు వ్యాఘ్రం సైతం నిను చూసి తాను మారే
వాతసల్యమొనర్చుకుంటూ నీ చెంతనేగ నిలిచే ||శ్రీ గిరీ||

భ్రమరమ్ములూ భ్రమరమొందే బంధమూ పెంచినావూ
భద్రమును ఒనర్చు నీవూ బ్రహ్మమును పంచినావూ
భార్గవి రూపముననూ సిరులెల్ల గూర్చినావూ
భారతీ దేవివయ్యీ ఓ జనని విద్య వినయములొసగినావూ ||శ్రీ గిరీ||

శివుని పతివమ్మ‌ నీవూ శుభములూ సేయుచుండూ
స్మరణ మాతరముననే‌ శీఘ్రముగ స్పందించెదవుగా
శ్రీకరీ నామావళీ శ్రేయమే మాకెపుడునూ
సహస్రమూ నీ పేరులే సదా మాకవియు ముదములే ||శ్రీ గిరీ||

మాతృకలు నిను గొలువగా ముదముతో నుండు దేవీ
మాతవై నిలచి మాకూ మత్సరములెల్ల దీసెయ్యవే
మా తప్పులూ గాయమ్మవే మా తల్లి మాకు గుణములు నేర్పవే
మోక్షముకూ మార్గమీయవే ఓయమ్మ ముక్తి మాకొనరించవే ||శ్రీ గిరీ||

Sunday, September 8, 2019

శ్రీ అయ్యప్ప

కరిమల వాసా కరుణావరదా శబరిగిరీశా అయ్యప్పా
కామిత ప్రధాతా కాంచన వదనా శరణమనేశా అయ్యప్పా || కరిమల||

కళ్యాణ కారకా కావ్యముల వందిత శ్రీ గిరివాసుని తనయుడవే
కృపా సాగరా కార్య సాధకా శ్రీ దేవీ పతి పుత్రుడవే || కరిమల ||

కీర్తనమను ఓ భక్తి విధమున స్తుతియింతుము మిము అయ్యప్పా
కదనరంగమున సదా గెలుచు నిను కొలుతుము విడువక అయ్యప్పా || కరిమల||

Sunday, September 1, 2019

శ్రీ గణపతి మీద కవిత శ్రీ వినాయక చవితి వికారి నామ సంవత్సరమున

గృహములెల్ల గోవిందుని ప్రభలు నిండగా
ప్రతీ తల్లి తండ్రి పార్వతీ పరమేశ్వరుల కాగా
పుత్రుల రూపమున వెలసిన పళని వాసుని సోదరా
మహాభారతమును వ్రాసినావు వ్యాసుని తోడ నీవుగా

గణపతి నామ ధేయా గజేంద్ర వదనా
గౌరీ పతి ప్రియ సుతా కరుణా వరదా
గోవింద తనయ పతి సహోదరా
గరికను అందుకుని మము దీవించుమా



వినుమా వినాయకా మా విన్నపములను
విమలా సుత మా సంకల్పాలకు
విఘ్నములే నీవు తొలగించుమా
విజయములను సదా చేకూర్చుమా


పేరు మాధురి
కలం పేరు శేషు