Sunday, March 10, 2019

శ్రీ చీర్యాల లక్ష్మి నరసింహ స్వామి

శ్రీ చీర్యాల లక్ష్మీ నృసింహ స్వామిని దర్శించుకున్నప్పుడు కలిగిన అనుభూతి తో అంతా "చ" గుణింతం తో మొదలయ్యే పదాలతో వ్రాశాను.

చేతగాని ఉత్తానపాదుని తనయుడినీ
చెడ్డవాడైన హిరణ్యకశిపుని శిశువును
చలనం లేని మరెందరో ఆర్తులనూ
చేరదీసి ఆదరించిన శ్రీ హరీ

చిమ్మ చీకటిని పారద్రోలి
చిన్న వారిమైన మమ్ములను
చలనం కోల్పోయిన మా వంటి వారందరినీ
చేతులు చాచి నిను పిలుచు నీ అర్ధులనూ

చావు కోరుకునే స్థితి నించి
చెమ్మగిల్లిన కన్నీటి బొట్లను తుడిచీ
చుక్కానివై వచ్చి నావ దాటించవేమి
చైతన్యమ్మును ఇచ్చి కాపాడవేమి

చెర యందు బుట్టినా గెలిచిన వాడవూ
చెన్నకేశవ నామధేయుడవూ
చెంచులందూ వెలసీన వాడవూ
చేపగానూ తిలగీన వాడవూ

చేవలేక నీరుగారిన మమ్మూ
చతికిల బడి నీరసమొందిన మమ్మూ
చిత్తశుద్ధితో మాత్రమే నిలబడిన మమ్మృ
చిరునవ్వుతో రక్షించవె ఇకనైనా

చేదు నీటి నూతిన మునిగిన మమ్మూ
చేద వేసి ఒడ్డుకు చేర్చేందుకు రమ్మూ
చిరిగిన బ్రతుకు‌ల నున్న మమ్మూ
చిగురింప చేసేందుకు నింక లెమ్మూ

ఛాయవోలె మాకు వెంటనుండీ
చెలిమి చేసి మాకు పేర్మి పంచీ
చిత్తరువులందు సదా నీవె నిలచీ
చిత్ర విచిత్రాలను మాకు చూపవే

చివరిదాకా కదలక‌ తోడు నిలచీ
చిన్న బుచ్చు కోకుండా మమ్ము కనికరించీ
చిక్కటి కష్టాలను పలుచన చేసీ
చివాలున వాటిని దరిమేయవె

చిత్రగుప్తుని వోలె లెక్కలనూ దేలిచీ
చిక్కని దుష్టులకు శిక్షలు వేయవా
చిలుక వోలె తీయని పలుకులూ చెప్పీ
చక్కనీ ఆనందాల నీయవే

చెంపపై నుండీ క్రిందకూ జారీ
చెక్కిళ్ళ వద్ద వెక్కిళ్ళతో ఆగీ
చైత్రమును కోల్పోయిన మోములను నీవూ
చందురుని వోలె వెలిగించవా నీవూ

చిన్మయానంద మూర్తీ చిద్విలాస రూపీ
చిన్ముద్ర ధారీ చిద్విలాసమును లాల్చీ
చిరుదరహాసమును మాకొసగవే
చిన్నారులనెన్నడున్నూ చెదరనీయకుమా

చంచల లక్ష్మిని హృదయమందు నిలిపీ
చరాచర జగత్తునకు నాథునవై నిలచీ
చెరపలేనంత ప్రేమనూ రాశిగా పోసి
చెప్పలేనంత అనురాగమునీయుమా

కలం పేరు:  నాగిని

Wednesday, March 6, 2019

On Sri Nrisimha Swamy

ప్రణవమ్ము సేయవలదు నేను నీకు ప్రణామమ్మె యొనర్చగలను
పరిణతిని పొందలేదు నేను పద్ధతిని తలుచుచుంటి
పాపమ్ము సేయనీకు నీ పాదమ్మె శరణు అంటి
నన్ను ఉద్ధరించు నారసింహ నన్నేలు నా తండ్రి


ప్రహ్లాద బ్రోచిన వాడవీవు ప్రతి ఒక్కరిని గావుమయ్య
పోతన భాగవమంతటా నిలిచిన వాడవీవు ఈ పుడమి నెల్ల జూచుమయ్య
ప్రజలెల్ల కొలుతురు నిన్నె పసిబిడ్డల వోలె సాకుమయ్య
నన్ను ఉద్ధరించు నారసింహ నన్నేలు నా తండ్రి

జగములెల్ల పాలించు వాడవు జయములెల్ల నొసగువాడవూ
జనులను జూచుటకు జలములెత్తేటీ వాడవూ
జీర్ణమై పోయేటి స్థితిన జీవమ్ము నిస్తావు
నన్ను ఉద్ధరించు నారసింహ నన్నేలు నా తండ్రి

నిను గొల్చిననూ నీ నామమ్ము తలచినంతటి యెడల
నిజం రూపము ననొచ్చీ నిలిచేటీ నా తండ్రి
నీరెండలోనైన నిశి రాతిరి నాడైనా నీ నీడ జాలునూ నిక్కమ్ము నిదియె గదా!!
నన్ను ఉద్ధరించు నారసింహ నన్నేలు నా తండ్రి

కైవల్యమ్మునడుగజాల నేను నిన్ను కారుణ్యమెయొనర్చమంటి
కనకమడుగ నిను నేను కరుణ చాలంటీ
కష్టమ్ము తీసేయవె కలిగినా తీర్చేయవె
నన్ను ఉద్ధరించు నారసింహ నన్నేలు నా తండ్రి

కనుల నిండుగ నీ రూపమె నిలుపు కొని యుంటీ
కృప జూపమని అడిగితె కృష్ణవై నిలబడవె
కుచేలుని వోలె మముకూడ సూడవె
నన్ను ఉద్ధరించు నారసింహ నన్నేలు నా తండ్రి


నీ పథముచేరిన పిదప నిను గొలువ నింక ఒద్దు అంటె
నిను పొందినాకా ఇక పిలువ వలదులే అంటే
మోక్షమ్ము కోరనే నా తండ్రి నీ పైన మనసునే చాలంటి
నన్ను ఉద్ధరించు నారసింహ నన్నేలు నా తండ్రి

-- కలం పేరు నాగిని


ప్రహ్లాద వరదా నరసింహ
ఫలములనొసగే నీ దీవెన
వైకుంఠమున నీవు నిలిచిన నూ
భక్తుల మదిలోకే ఒరిగితివా

స్వామిని చూడగానే కలిగింది ఈ భావన
వెంటనే చేశాను అక్షరీకరణ