విష్ణు పుత్రిగ ఉద్భవించితివమ్మ
విశ్వమంతయు ప్రాకితివమ్మా
వేణియగ అంతటా జేరితివమ్మా
వందనమ్ములు నీకు పాపవినాశినీ
వన్నె తరగని చరిత కలదానివిగా
విరాజిల్లుతున్నావు యుగయుగాలుగా
వర్ధిల్లుతున్నావు ఎన్నో రూపాలుగా
వందనమ్ములు నీకు పాపవినశినీ
వేలనామాలు నీకు వుండగా
విడిపాయలుగా ప్రవహించుచూ
వివిధ రూపాల సంతరించుచున్నావు
వందనమ్ములు నీకు పాపవినాశినీ
వీణాధారిణి నిన్ను కీర్థించగా
వనజాక్షి సైతము నిన్ను కొలువగా
విమలా దేవికి సహోదరివైనావూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ
విశ్వేశ్వరుని పాదాల చెంత
విశాలాక్షి కన్నుల ముందర
వారణాసి లో వెలసినావు
వందనమ్ములు నీకు పాపవినాశినీ
మణికర్ణిక ఒక ఒడ్డున
మహాదేవ నిలయం మరో వైపున
మహనీయ స్థలాలు మహిని అంతటా నీ నీడన
వందనమ్ములు నీకు పాపవినాశినీ
ఇంద్రుడు వృత్రుడిని సమ్హరించగా
సకల దేవతలూ దీవించగా
సుధగా వసుధను జేరినావుటా
వందనమ్ములు నీకు పాపవినాశినీ
అక్షయ తదియ నాడూ అవతరించినావూ
అవని అంతటా విస్తరించినావూ
అందరికీ శుభములను జేకూర్చినావు
వందనమ్ములు నీకు పాపవినాశినీ
ఆకశమున మందాకినిగా అవదరించినావూ
సునాయాసమ్ముగా ఇరావతమ్మును నిలువరించీనావూ
గగనసీమన ఘనముగా ఎగసినావూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ
భగీరథుని మొరను ఆలకించినావు
భువిని తాక నిశ్చయించినావు
భూజనుల పాపాలను రూపుమాపుతున్నావు
వందనమ్ములు నీకు పాపవినాశినీ
ధ్రువ నక్షత్రమ్మున దిగినావూ
సమస్త తారక మండలాన్నీ తాకినావూ
సత్యలోకం మీదుగా సాగినావూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ
చంద్రశేఖరుని ఝటాఝూటమ్మున నిలిచినావూ
ఆశ్రమములనిండా నీవెయయినావూ
జహ్ను ముని కర్ణమ్మునుండీ ఉబికినావూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ
ఇటుల సాగిస్తూ నీ ప్రయానమ్మునూ
ఇక్కట్లననెన్నో దాటుకుని ఇలను దాకినావూ
ఇక్ష్వాకుల వంశమ్మును దరింపజేసినావూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ
గోలోకమ్మున కృష్ణునితోడ గొలువుతీరినావూ
గంగమ్మగా జగమంతా పేరుగాంచినావూ
గ్రహమంతా(భూ గ్రహం) గృహసీమ విరాజిల్లెను నీ వలననే
వందనమ్ములు నీకు పాపవినాశినీ
విష్ణు పాదోద్భవిగా మొదలయిన పయనం
శివుని శిరస్సునీ జేరెనూ
బ్రహ్మ లోకమునూ నీవు స్పృశ్చినావూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ
త్రిమూర్తుల నిటుల కలిపితివీ
త్రిదేవతలూ నిన్ను తలిచితిరీ
త్రిలోక్యపూజితవు నీవీవిధమున
వందనమ్ములు నీకు పాపవినాశినీ
పశ్చిమమ్మున నుండీ బుట్టీనావూ
పన్నగశయనుడి పుత్రివైనావూ
పాండురంగడి నివాసమందు మిళితమైనావూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ
హిమాలయములనుండీ మొదలైనావూ
సముద్రమ్ముతో సంగమించినావూ
ఎత్తుపల్లముల నిటుల గలిపినావూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ
కైలాస పర్వతవాసుని తలను తాకినావూ
మేరు పర్వతము మీదుగా మరలినావూ
హిమగిరి తనయగా నిలిచినావూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ
మూడు పర్వతముల నిటుల గలుపుతూ
ముచ్చటగా ముందడుగు వేసినావూ
మురిపెముగా మమ్మూ గాంచినావూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ
పుడమి జనుల పాపభారములు మ్రోయుచున్నావు
ప్రక్షాళన చేయుచూ మమ్ము ఆదరించుచున్నావూ
పుణ్యమూర్తిగ నీవూ వాసికెక్కినావు
వందనమ్ములు నీకు పాపవినాశినీ
దక్షిణ దిశ నుండీ యముననీ
వామ భాగమునుండీ సరస్వత్నీ
కలుపుకుని ప్రయాగని సృష్టించినావూ ప్రయాగని
వందనమ్ములు నీకు పాపవినాశినీ
వసువుల శాపవిమోచనం గావించినావూ
గాంగేయుడకూ మాతవైనావూ
కురువంశమును కాపాడినావూ
వందనములు నీకు పాపనాశినీ
త్రివేణి సంగమమూ తో మూడు నదులనూ
పంచ ప్రయాగతో ఐదు నదులనీ
తద్వారా నీ సోదరీ మణులనీ నీలో లీనం చేసుకుంటివమ్మా
వందనమ్ములు నీకు పాపవినాశినీ
బ్రహ్మపుత్ర, పద్మల రూపమున బంగ్లాదేశ్ లోనూ,
గండకీ, కోసి ల నామాలతో నేపాల్ని చుట్టి
పవిత్ర భారత దేశం తో త్రిదేశాలనూ చుట్టిన ఘనత నీదమ్మా
వందనమ్ములు నీకు పాపవినాశినీ
హరప్ప, మౌర్య, మొఘల్, మెగస్థనీస్,
ఎన్నో రాజ్యాలూ, ఎన్నో సంస్కృతులూ
నీ నించే ప్రారంభం నీ వద్దే నిలవడం
వందనమ్ములు నీకు పాపవినాశినీ
వ్యాసముని పూజితవు నీవూ
భాగవతమ్మును నీ ఒడ్డున వ్రాయించినావూ
జగములనెల్లనిటుల నుద్ధరించినావూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ
వేల యుగముల నాటి నుండీ
వేల మైళ్ళ ప్రయాణమ్ము జేసి
వేల నదుల నీలో జేర్చికొని అందరికీ మాతవైనావూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ
పాలపుంతలను నీవూ దాటినావూ
పాలనురగల తెల్లదనమూ నీదీ
పాప పంకిలము జేసే గుణము నీది
వందనమ్ములు నీకు పాపవినాశినీ
నరుని నరము నీదు నీటియందు మునిగినంతనే
నరకమును దప్పించి నిల్పినావు స్వర్గమ్మునే
గొల్వతరమ నీదు మహిమ గంగమ్మా
వందనమ్ములు నీకు పాపవినాశినీ
పుణ్యమూర్తులకెల్ల నీవు ఉపమానమమ్మ
పుడమివాసుల కెల్ల చేసితివిటుల ఉపమానమమ్మ
పుష్కళమ్ము కాదె నీదు సుగుణమ్ములు టల్లి
వందనమ్ములు నీకు పాపవినాశినీ
అనంత గిరి వాసినీ ఆనందదాయినీ
మార్కండేయ పూజితా ముచికుంద సన్నిహితా
వెలసితివమ్మ విష్ణువు సన్నిధానమున
వందనమ్ములు నీకు పాపవినాశినీ
ఎన్నెన్ని చోట్లకని చేరేవు నీవు
ఎందరెందరు దేవతలకని అభిషేకించేరు నిన్నున్
ఎందరెందరో మునులు వదలక కోరితిరి కదా నిన్నిటులన్
వందనమ్ములు నీకు పాపవినాశినీ
నీ యందు మునిగిన చాలు
అస్థికలనిన్ దెచ్చి కలిపిన చాలు
సకల జన్మల పాపాలూ వెంటనే వ్రాలూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ
స్వర్గము నుండీ దిగి వచ్చిన గంగ
సర్గలు నీ పై నే వ్రాయంగా వి
సర్గలు ఆ ప్రవాహంలో మునగంగా నవ
సర్గలు అందులో నే దాయంగా
బహు నామములతో నీరు ఉరకంగా
బ్రహ్మ కమండలము నుండి నీవు జారంగా
విష్ణు పదమును విమల పతి శిరమునూ తాకంగా
సకల లోకములూ మీకు మ్రొక్కెనుగా