నగవుల తల్లి పార్వతి! సనాతని! వందనమో ఉమా!
ఖగపతి విష్ణు సోదరి! ప్రకంపనలన్నియు దీయ నీవెగా
జగములనేలు నాయకివి! శౌర్యము ౘూపి కపర్థినీ సదా
గగనము దాటి మా దరిని కాంతిగ నిల్వుమ యద్రి వాసినీ
అనురాధమ్మ గారి ఇంట్లో ఊంజల సేవ, దసరాలలో, క్రోధి, 2024, October 4
రావమ్మా జననీ మా
భావము గమ్యము సురనుత! భ్రమరీ నీవే
పావని! యూయలనూగుౘు
దీవింౘుమ మము! శుభగుణ! ధీరా! హిమజా
కీర్తన వాళ్ళ గుడి లో, క్రోధి సంవత్సరం దసరాకు మూలా నక్షత్రం రోజున సరస్వతి దేవికి
వాణీ శర్వాణీ యో
వీణాపాణీ గొలుౘును వేదములన్నీ
శ్రేణిన నిలౘుౘు నిన్నే
రాణీ ౘదువులనొసగుమ లక్ష్యము కొఱకున్
జ్ఞానము నీవే ధరణికి
రాననబోకుమ! శుభాంగి! బ్రహ్మ కళత్రా!
ధ్యానము నిలిపెడి కరుణను
మానవులకొసంగవలె సుమధుర వచనా!
ఉత్పలమాల
తెల్లని వస్త్రధారణయు తీయని పల్కుల తల్లి వాణి తా
ౘల్లదనమ్ముతో మనకు జ్ఞానమొసంగుౘు సంస్కరింౘగా
తల్లిని గొల్చుకుందుమని ధాత్రి నివాసులు పూజ సల్పుౘున్
పల్లవి పాడుకుందురట భారతి నామము తోడ నిత్యమున్
బంగరు రంగున వెలసిన
రంగము నాయకి! సురనుత! లక్షణముగ యే
భంగము నొందని జ్ఞానము
చెంగున నిమ్మా యని యిట చెప్పెద వినతుల్
వీణయు నక్షమాలను ప్రవీణ! ధరించెడి వాణి దీర్ఘమౌ
బాణిన రాగమాలికలు పాడుౘు వేడెద జ్ఞానమీయుమా
పాణి కలమ్ము కావ్యములు వ్రాసెడి భాగ్యమున్నౘో
శ్రేణి తలంబున జీవులిక చేరును నీ దరి! మాయ దాటుౘున్
దుర్గమ మార్గము నడిపెడి
భర్గుని పత్నీ! ప్రణవపు పంజర వాసీ
అర్గళ దేవీ మనవిది
నిర్గుణ రూపా! బ్రతుకున నింపుమ వెలుగుల్
ధాన్యము ధనమది యేలన
దైన్యము సరసన నిలువదు ధైర్యము నీవై
మాన్యత గాచిన చేరదు
శూన్యత బ్రతుకున! మనసున! శుభగుణ! తల్లీ!
ధాన్యము ధనమది యేలన
శూన్యము గాదైనను మది ౘూచిన నిన్నే!
దైన్యము దరిమెడి శక్తివి!
మాన్యత గాచెడి సురనుత! మంగళదాయీ
చంద్రవంక ధారి! మంద్ర స్వరమ్మున
కీర్తనలను పాడి కేళి యాడి
శిశువులమగు మేము! యశమును ముదమును
వొందెదమిల! జనని! ఉమ! సురనుత
నవదుర్గలుగా వెలసెనె
శివసతి ముౘ్చట గొలుపుౘు చిరునవ్వులతో
భవభయ హారిణికివియే
నవనీతముతో ప్రణతులు! నగజకు భక్తిన్
తెలుగు లోగిలి లో నళినీ ఎఱ్ఱా గారి టపా
దీపపు కాంతుల నడుమన
శ్రీ పద్మావతి! వెలసెను సిరులను చిలికెన్
పాపపు రాశిని చీల్చుౘు
నాపదలెల్లను దరుముౘు నండై యుండున్
కొలువరె కాచెడి తల్లిని
నిలుపరె మనమున సుగుణపు నిధియౌ సిరినే
తలచిన ౘాలును జయములు
కలిగింౘును లక్ష్మి! విష్ణు కళత్ర! పేర్మిన్
ఇంట్లో పెరట్లో ఱోలు వద్ద దీపం పెట్టినపుడు కనిపించిన అమ్మ కనులకు ఈ పద్యమూ, పాట
[04/11, 22:09] Durga Madhuri Devi Nagini: వేంచేసితివా జననీ
కంచీ పురవాసిని మము కరుణింౘుౘు నీ
పంచన చేర్చుట కొఱకని!
కంచెల తెరతీయుమిక వికాసమొసగుమా
[04/11, 22:09] Durga Madhuri Devi Nagini: నీ కనులే మము గాంౘగ భువికి జేరెలే
శ్రీకరి శుభగుణ సుధాబ్దిజ ధన్యవాదమే ,|| నీ కనులే ||
తిమిరము హరియింౘుటకని దివి వీడిన జ్యోతీ
సమరములను బాపుౘు నడిపించే తల్లీ ||తిమిరము||
సతతము నీ స్మరణే నిరతము నీ భజనే ||సతతము||
మా యిల వేలుపు నీవేనే మంగళదాయని సురనుత || నీ కనులే||
అందఱి బంధువు నీవయి ఆడే లోకమాతవే
సుందర వదనా నిగమాగమమే మాకు నీయవే
నవ్వుల పువ్వుల కొమ్మకు పడతుల వందనంబులే
సకల కళల రాణి శాశ్వతి పరమేశ్వరి మంగళ దాయిని
|| నీ కనులే||
పురివిప్పిన నెమలిక తో
సరసుకు చెంతన నిలచిన జననీ ప్రణతుల్
సురనుత భారతి పద్యము
సరి యగు విధముగ రచించు జ్ఞానము నిమ్మా
అనురాధమ్మ గారి ఇంట్లో ఊంజల సేవ చిత్రానికి: 08/11/2024
అమ్మా నీవే దిక్కని
నమ్మిన భక్తుల గృహముకు నడిచెడి కరుణే
మమ్ముల నిలుపును! వేగమె
రమ్మా యనగానె చేరి రక్షింౘు సదా
కన్న భుజమ్ము నందు గని గారము చేసెను మాతృమూర్తి యే
యన్నుల మిన్నకై మనసు నాతృత నిండును నిత్యమున్ గదా
వెన్నెల వంటి ౘల్లనగు పేర్మి ప్రతీకయె సృష్టిలో సదా
వెన్నను జిల్కు నామె సమ వేలుపు లేరుగ ౘూడగన్ ధరన్
క్షీరాబ్ధి ద్వాదశి, క్రోధి వత్సరము
క్షీర సాగర కన్యక చేర రావె
మాదు గృహములకు హరిని చేదుకొనుౘు
తులసి ధాత్రి సహితముగ వెలసి మమ్ము
కనికరింౘవమ్మ! సిరి! యవనిని నీవు
తులసీ మాతకు ప్రణతులు
తొలితొలి ఝామున సుమముల తోరణ మాలల్
తిలకము పసుపూ గంధము
తలమానికమౌ నుతులును తల్లీ గొనుమా
"త" గుణింత కంద పుష్పము
త్రిజగన్నుత! శరణము నీ
నిజ రూపము గాంౘలేని నీరసమున నే
భజనలు సహితము విడచితి
గజ రాజ సుపూజిత! నను కరుణింౘుమికన్
మౌనము ౘాలునంటిని రమాధవ! భౌతికలోక బాధలో
నీ నను ముంౘనేల హరి! నే కను పాపను కాన! దేవరా
ధ్యానము సేయకుంటినని దైన్యత లో పడవైచి నవ్వుౘున్
పానము లాగి నావుగ! సబాంధవ! ౘాలయ శిక్షలాపుమా