Thursday, October 24, 2019

అందం - భౌతికం కాదు, భావుకత్వం.

వినీల గగనాన విరిసిన కుసుమమా!
విరుల‌ రేడువైన మా చందమామ!
విహరించుచూన్న నీ పయనమొక లిప్త ఆపుమా!!
విషాదమయమైన మా గాధనిటు వినుమా!
వివరించుచున్న నా గాయాల బాధ కనుమా!
విచారించుచున్న నన్ను ఒక్క మారు ఓదార్చుమా!!

అంటూ నైరాశ్యంతో  నేలకొరిగిన నీరజ చరవాణి "నిన్న లేని అందమేదో... నిదుర లేచెనెందుకో" అంటూ మ్రోగింది. ఉమ్.... ఎదురింటి పంకజం ఆంటీ ఎప్పుడూ ఇంతేగా! కొత్తగా ప్రయత్నం చేసిన వంటలూ తనమీదే ప్రయోగిస్తుంది, పిల్లల దగ్గర సెల్ ఫోన్లో నేర్చుకున్న "ఫీచర్సూ" తన మొబైల్ మీదే చూపిస్తుంది. ఇంకా నయం, ఆవిడ కూడా తనలాగా టెస్ట్ ఇంజనీర్ కాదు, అయ్యుంటే "డిస్ట్రక్షన్ టెస్టింగ్" పేరుతో దానిని మరింత... ఎందుకులే, మళ్లీ ఇప్పుడు అదంతా, అనుకుంటూ ఇంకా మ్రోగుతున్న ఫోన్ వంక చూసింది. తీయకపోతే ఇలాగే‌ ఆగకుండా మళ్లీ మళ్లీ చేసేట్టుగా ఉంది, అసలెవరో చూస్తే పోలా, అనుకుంటూ ఫోన్ తీసింది. చురుకైన తన చక్షువులు అంత నిర్వేదం లోనూ ఫోన్ ఆన్ చేస్తూనే కొత్త నంబరయినా ట్రూ కాలర్ యాప్ ద్వారా ఆ నెంబర్ ఎవరిదో పేరు చూసి మెదడుకు సంకేతాలు ఇచ్చినయి, చమత్కార మైన పేరు, "నెలవంక". భలే ఉందే అనుకుంటూ, ఫోన్ కాల్ ఆన్ చేసి తన తీయటి స్వరంతో, "ఉభయకుశలోపరి"అంటూ సంభాషణ మొదలు పెట్టింది.
అవును, మన భాషలో ఉన్న సౌకర్యాన్ని సౌందర్యాన్ని వదులుకోకుండా వాడుకుంటే బాగుంటుంది కదా! అందుకే ఈ అలవాటు.  అవతలి నుంచి ఒక్క లిప్త పాటు మౌనం, ఆ తర్వాత గాఢంగా ఊపిరి తీసుకుని వదిలిన సవ్వడి. ఇంకా ఎవరూ మాట్లాడకపోవడంతో ఫోన్ కట్ చేయబోయేసరికి‌ ఒక చిన్న చిరునవ్వు వినిపించింది. దాంతో ఎవరూ అంటూ మళ్లీ అడిగింది. ఆ ఒక్క చిరునవ్వు తప్ప ఎంత సేపటికీ ఏమీ వినపడట్లేదు. అందరిలాంటిదైతే ఫోన్ కట్ చేసేసేదే. కానీ ఆమె అలా కాదు, అలా వింటూండిపోయింది. అవును మరి, ఇంతవరకూ ఆమెతో అలా నవ్వినవారే లేరే! కారణం, ఆమె అందవికారం! అవును, సంపన్నుల ఇంట్లో పుట్టిన ఆమె, నిజానికి ఎంతో ఆనందంగా ఉండవలసిన ఆమె, ప్రమాదవశాత్తూ తన మోము, చేతులూ, కాలిపోవడంతో, చూడటానికి ఇబ్బందిగా ఉండేలా తయారయ్యింది.  ఉదాసీనత అనేది దరి చేరనివ్వని నీరజ లాంటి వారికి అది సమస్య కాదు, ఉన్నతంగా ఆలోచించే ఆమెకది ఎదుగుదలకసలు ఏ మాత్రమూ అడ్డూ కాదు, నిజానికి అది కూడా ఒక అవకాశం, ఎదగటానికి, శక్తిగా కాదు, వ్యక్తిగా. అవును, మెడిసిన్ చదివే రోజుల్లో హౌస్ సర్జెన్సీ చేస్తుండగా కలిగిన ఆపద వల్ల తనో అనాకారిగా మారితే, ప్రశంస వస్తే స్వీకరించి, విమర్శలు వస్తే వదిలేసినంత సులభంగా, ప్రమోదం వచ్చినప్పుడు భుజాలు ఎగురవేస్తారు, ప్రమాదం వస్తే మాత్రం బంధాలని మనుష్యులని బయటకు ఎగురవేస్తాం, అన్నారు ఆమె కుటుంబ సభ్యులు. అందుకే, ఆమె ‌‌‌‌అటు జరుగుబాటూ, ఇటు తన ఆసక్తి రెండు కలగలిపి ఉండేలా నర్సు వృత్తి చేపట్టి, బ్రతుకు వెళ్ళదీస్తోంది. దురదృష్టం ఏంటంటే, ఆమె ఎంతో ఔదార్యంతో సేవ చేద్దామని వెళ్ళినా, సగం కాలిన ఆమె మోమును చూసి, పేషెంట్లు భయపడేవారు. చివరికి మొహం అంతా చున్నీ కప్పుకుని చేతులు సాచి పని ప్రారంభిస్తున్నా పసి వాళ్ళు కూడా భయపడి ఏడుస్తున్నారు. దాంతో ఆమె మంచితనం పట్ల గుర్తింపు, గౌరవము తోనూ, ఆమె పరిస్థితి పట్ల జాలి తోనూ హాస్పిటల్ వారు ఆమెకు ఇచ్చిన అవకాశాన్ని ఉంచటమా, ఉపసంసరించటమా అన్న సందిగ్ధంలో పడ్డారు. చేతులు చాచి అడగడం ఇష్టపడని ఆమె, తన ఆసక్తి కారణంగా అటు పేషెంట్లు, తన అవసరం దృష్ట్యా ఇటు హాస్పిటల్ సిబ్బంది బాధ పడటం ఇష్టం లేక, తాను ఉంటున్న హాస్పిటల్ దగ్గరలోని తన గదికి వచ్చి ఇలా చతికిలపడింది. అదుగో, అప్పుడు మ్రోగింది ఈ ఫోన్ కాల్, తీస్తే ఇదుగో, ఈ చిరునవ్వు. ఆ నవ్వులో ఎటువంటి ఎగతాళి, జాలీ కానరాలేదు ఆమెకు, ఆ స్థానే ఒక భరోసా, ఒక ప్రేమ పూరిత పలకరింపు కానవచ్చాయి. 

Gangamma English Telugu

విష్ణు పుత్రిగ ఉద్భవించితివమ్మ
విశ్వమంతయు ప్రాకితివమ్మా
వేణియగ అంతటా జేరితివమ్మా
వందనమ్ములు నీకు పాపవినాశినీ

వన్నె తరగని చరిత కలదానివిగా
విరాజిల్లుతున్నావు యుగయుగాలుగా
వర్ధిల్లుతున్నావు ఎన్నో రూపాలుగా
వందనమ్ములు నీకు పాపవినశినీ

వేలనామాలు నీకు వుండగా
విడిపాయలుగా ప్రవహించుచూ
వివిధ రూపాల సంతరించుచున్నావు
వందనమ్ములు నీకు పాపవినాశినీ

వీణాధారిణి నిన్ను కీర్థించగా
వనజాక్షి సైతము నిన్ను కొలువగా
విమలా దేవికి సహోదరివైనావూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ

విశ్వేశ్వరుని పాదాల చెంత
విశాలాక్షి కన్నుల ముందర
వారణాసి లో వెలసినావు
వందనమ్ములు నీకు పాపవినాశినీ

మణికర్ణిక ఒక ఒడ్డున
మహాదేవ నిలయం మరో వైపున
మహనీయ స్థలాలు మహిని అంతటా నీ నీడన
వందనమ్ములు నీకు పాపవినాశినీ

ఇంద్రుడు వృత్రుడిని సమ్హరించగా
సకల దేవతలూ దీవించగా
సుధగా వసుధను జేరినావుటా
వందనమ్ములు నీకు పాపవినాశినీ

అక్షయ తదియ నాడూ అవతరించినావూ
అవని అంతటా విస్తరించినావూ
అందరికీ శుభములను జేకూర్చినావు
వందనమ్ములు నీకు పాపవినాశినీ

ఆకశమున మందాకినిగా అవదరించినావూ
సునాయాసమ్ముగా ఇరావతమ్మును నిలువరించీనావూ
గగనసీమన ఘనముగా ఎగసినావూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ

భగీరథుని మొరను ఆలకించినావు
భువిని తాక నిశ్చయించినావు
భూజనుల పాపాలను రూపుమాపుతున్నావు
వందనమ్ములు నీకు పాపవినాశినీ

ధ్రువ నక్షత్రమ్మున దిగినావూ
సమస్త తారక మండలాన్నీ తాకినావూ
సత్యలోకం మీదుగా సాగినావూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ

చంద్రశేఖరుని ఝటాఝూటమ్మున నిలిచినావూ
ఆశ్రమములనిండా నీవెయయినావూ
జహ్ను ముని కర్ణమ్మునుండీ ఉబికినావూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ

ఇటుల సాగిస్తూ నీ ప్రయానమ్మునూ
ఇక్కట్లననెన్నో దాటుకుని ఇలను దాకినావూ
ఇక్ష్వాకుల వంశమ్మును దరింపజేసినావూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ

గోలోకమ్మున కృష్ణునితోడ గొలువుతీరినావూ
గంగమ్మగా జగమంతా పేరుగాంచినావూ
గ్రహమంతా(భూ గ్రహం) గృహసీమ విరాజిల్లెను నీ వలననే
వందనమ్ములు నీకు పాపవినాశినీ

విష్ణు పాదోద్భవిగా మొదలయిన పయనం
శివుని శిరస్సునీ జేరెనూ
బ్రహ్మ లోకమునూ నీవు స్పృశ్చినావూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ

త్రిమూర్తుల నిటుల కలిపితివీ
త్రిదేవతలూ నిన్ను తలిచితిరీ
త్రిలోక్యపూజితవు నీవీవిధమున
వందనమ్ములు నీకు పాపవినాశినీ

పశ్చిమమ్మున నుండీ బుట్టీనావూ
పన్నగశయనుడి పుత్రివైనావూ
పాండురంగడి నివాసమందు మిళితమైనావూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ

హిమాలయములనుండీ మొదలైనావూ
సముద్రమ్ముతో సంగమించినావూ
ఎత్తుపల్లముల నిటుల గలిపినావూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ

కైలాస పర్వతవాసుని తలను తాకినావూ
మేరు పర్వతము మీదుగా మరలినావూ
హిమగిరి తనయగా నిలిచినావూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ

మూడు పర్వతముల నిటుల గలుపుతూ
ముచ్చటగా ముందడుగు వేసినావూ
మురిపెముగా మమ్మూ గాంచినావూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ

పుడమి జనుల పాపభారములు మ్రోయుచున్నావు
ప్రక్షాళన చేయుచూ మమ్ము ఆదరించుచున్నావూ
పుణ్యమూర్తిగ నీవూ వాసికెక్కినావు
వందనమ్ములు నీకు పాపవినాశినీ

దక్షిణ దిశ నుండీ యముననీ
వామ భాగమునుండీ సరస్వత్నీ
కలుపుకుని ప్రయాగని సృష్టించినావూ ప్రయాగని
వందనమ్ములు నీకు పాపవినాశినీ

వసువుల శాపవిమోచనం గావించినావూ
గాంగేయుడకూ మాతవైనావూ
కురువంశమును కాపాడినావూ
వందనములు నీకు పాపనాశినీ

త్రివేణి సంగమమూ తో మూడు నదులనూ
పంచ ప్రయాగతో ఐదు నదులనీ
తద్వారా నీ సోదరీ మణులనీ నీలో లీనం చేసుకుంటివమ్మా
వందనమ్ములు నీకు పాపవినాశినీ

బ్రహ్మపుత్ర, పద్మల రూపమున బంగ్లాదేశ్ లోనూ,
గండకీ, కోసి ల నామాలతో నేపాల్ని చుట్టి
పవిత్ర భారత దేశం తో త్రిదేశాలనూ చుట్టిన ఘనత నీదమ్మా
వందనమ్ములు నీకు పాపవినాశినీ

హరప్ప, మౌర్య, మొఘల్, మెగస్థనీస్,
ఎన్నో రాజ్యాలూ, ఎన్నో సంస్కృతులూ
నీ నించే ప్రారంభం నీ వద్దే నిలవడం
వందనమ్ములు నీకు పాపవినాశినీ

వ్యాసముని పూజితవు నీవూ
భాగవతమ్మును నీ ఒడ్డున వ్రాయించినావూ
జగములనెల్లనిటుల నుద్ధరించినావూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ

వేల యుగముల నాటి నుండీ
వేల మైళ్ళ ప్రయాణమ్ము జేసి
వేల నదుల నీలో జేర్చికొని అందరికీ మాతవైనావూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ

పాలపుంతలను నీవూ దాటినావూ
పాలనురగల తెల్లదనమూ నీదీ
పాప పంకిలము జేసే గుణము నీది
వందనమ్ములు నీకు పాపవినాశినీ

నరుని నరము నీదు నీటియందు మునిగినంతనే
నరకమును దప్పించి నిల్పినావు స్వర్గమ్మునే
గొల్వతరమ నీదు మహిమ గంగమ్మా
వందనమ్ములు నీకు పాపవినాశినీ

పుణ్యమూర్తులకెల్ల నీవు ఉపమానమమ్మ
పుడమివాసుల కెల్ల చేసితివిటుల ఉపమానమమ్మ
పుష్కళమ్ము కాదె నీదు సుగుణమ్ములు టల్లి
వందనమ్ములు నీకు పాపవినాశినీ

అనంత గిరి వాసినీ ఆనందదాయినీ
మార్కండేయ పూజితా ముచికుంద సన్నిహితా
వెలసితివమ్మ విష్ణువు సన్నిధానమున
వందనమ్ములు నీకు పాపవినాశినీ

ఎన్నెన్ని చోట్లకని చేరేవు నీవు
ఎందరెందరు దేవతలకని అభిషేకించేరు నిన్నున్
ఎందరెందరో మునులు వదలక కోరితిరి కదా నిన్నిటులన్
వందనమ్ములు నీకు పాపవినాశినీ

నీ యందు మునిగిన చాలు
అస్థికలనిన్ దెచ్చి కలిపిన చాలు
సకల జన్మల పాపాలూ వెంటనే వ్రాలూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ
స్వర్గము నుండీ దిగి వచ్చిన గంగ సర్గలు నీ పై నే వ్రాయంగా వి సర్గలు ఆ ప్రవాహంలో మునగంగా నవ సర్గలు అందులో నే దాయంగా బహు నామములతో నీరు ఉరకంగా బ్రహ్మ కమండలము నుండి నీవు జారంగా విష్ణు పదమును విమల పతి శిరమునూ తాకంగా సకల లోకములూ మీకు మ్రొక్కెనుగా

విఘ్నేశ్వరుడు, సుదర్శన చక్రం మీద ఒకే రాగంలో పాట

శ్రీ గణపతి మీద పాట

ఇట్టి ముద్దులాడేటీ బాలుడెవ్వడే
ఇట్టి ముద్దులాడేటీ బాలుడెవ్వడే
పట్టుకొచ్చి ఉండ్రాళ్ళు కుడుములెట్టరే
వాణ్ణి పట్టుకొచ్చి ఉండ్రాళ్ళు కుడుములెట్టరే ||ఇట్టి||

ఇంతులెల్లా ఇలయందూ తల్లులందునే
ఇంతులెల్లా ఇలయందూ తల్లులందునే
ఇంత మాత్రం గరిక ఇస్తే ఇచ్చగించునే
వాడు ఇంత మాత్రం గరిక ఇస్తే ఇచ్చగించునే ||ఇట్టి||

ఇక్కట్లను తలచినంతనే తీసివేయునే
ఇక్కట్లను తలచినంతనే తీసివేయునే
ఈర్ష్య వంటివాటినన్నీ తరిమివేయునే
వాడు వల్లమాలిన దుర్గుణములు నిర్మూలించునే ||ఇట్టి||

ఇహపరములన్నియూ స్వామి దయేనే
ఇహపరములన్నియూ స్వామి దయేనే
మోక్షమార్గములెల్ల తానే చూపునే మనకూ
ఈశ్వర తనయుడూ శుభములు గూర్చునే || ఇట్టి ||

******************************************
శ్రీ సుదర్శన చక్రం మీద పాట
******************************************

సుదర్శనమంటేనే శీఘ్ర ఫలమే
స్వామి చెంతకు మనను తానె చేర్చునే
స్వామి చెంతకు మనను తానె చేర్చునే || సుదర్శన ||

వైకుంఠ వాసుడూ వరద హస్తుడే
వైకుంఠ వాసుడూ వరద హస్తుడే
అట్టి చేతితోటీ ఆ దేవుడు తినను దాల్చునే
అట్టి చేతితోటీ ఆ దేవుడు తినను దాల్చునే || సుదర్శన ||

మంచివారిని తానెప్పుడూ కాచుచుండునే
మంచివారిని తానెప్పుడూ కాచుచుండునే
వంచించిన వారినీ క్షమియింపడే
వరములిచ్చు ఆ దైవమె చెప్పేవరకునూ || సుదర్శన ||

Friday, October 4, 2019

5 Poets

శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు

కళా ప్రపూర్ణ బిరుదాంకితులు  మీరు
కవి పుంగవుల బృందావనములోన
కలముతోడ నిలిచిన ఘనులు గాద
కాలము తోటి మనుజులు మారవలెనని
కాలిన బతుకుల గాయములు మానాలని
కాలికి పరుగులు అర్థవంతమవ్వాలని
కాంచనమంటె మంచి మనసేనని
కవితాత్మకంగా చెప్పినారు గద
కందుకూరి వారి సిద్ధాంతాలను మా
కందుకోవాలనే తలపును సృజియించి మా
కందుకోసమని మీ రచనల తోడిచ్చిన మీ
కందుకే మా ఈ నీరాజనం ఓ చిలకమర్తీ
ఉత్తమ ఆలోచనల దీప్తీ మీ పలుకులె మాకు స్ఫూర్తి
చిరకాలము నిలుచును మీ కీర్తీ ఓ మానవతా మూర్తి

******************************************
శ్రీ గురజాడ అప్పారావు గారు

గురజాడ వారి వాక్కు గురి గల వాక్కు
పుత్తడి బొమ్మ పూర్ణమ్మ పసి పడుచుల ప్రతినిధమ్మా
మధురవాణి సైతం మగువల మనిషమ్మా
కష్టాలను పడు వారిని చూసి కరిగిపోవునమ్మా
కన్యక, కన్యాశుల్కం రచన చేసెనమ్మా
కడలి లోతు గల తీరు వాటిదోయమ్మా
గిరీశం గారు ప్రతి హృదిలో చిరకాలం నిలిచుపోవునమ్మా
గారడీ చూపుతూనె కార్యములొనర్చు నేర్పు కదుటమ్మా
మలినమనగానేమమ్మా మన మదిలో మూలలే ననెనమ్మా
మురికి సిద్ధాంతాలనే ఊరికవతలకు తర'మాల'నెనమ్మా
ఎంతని చెప్పెద నేనైనా ఇంతటి ఘన సంస్కర్త గూర్చి నింకా
ఎంచగల వారెవ్వరమ్మా శ్రీశ్రీ వంటి వారే ఈయనని గొలిచిరమ్మా
మళ్ళీ మళ్ళీ మీరే రావాలి మాటల తూటాలు వ్రాయాలీ
మనుష్యులనెంతో మార్చాలీ మనుగడకు దారీ చూపాలీ
నవ్యత్వమ్మునూ నింపాలీ నవ్వుల దివ్వెలు వెలిగించాలీ
నరనరానా ఉత్తేజమ్మును అనునిత్యం రగల్చాలీ
నా దేశమ్మను భావమునూ నేనే దేశమను బాధ్యతనూ
నరులా నరముల పాతాలీ నీ పదమే‌ అందరు పాడాలీ
నీరుగారక స్థిరముగ నిలిచేట్టూ మీరే మమ్ముల నడపాలీ
నిలకడగా ఆ విజయములుండాలీ నిద్దురలోనైన ఈ స్వప్నమె పండాలీ
మిమ్మిక మరువక మేమంతా ముందుకు సాగాలీ
మన దేశపు కేతనం రెపరెపలాడాలీ

******************************************
శ్రీ గుర్రం జాషువా గారు

జాషువా యన్న జాగృతమొనర్చు వారు
జాతులనెల్ల ఏకము చేయగలుగు వారు
జగతియు అంత ఎంతొ చదివినారు
జయములనెల్ల గోరువారు
జననిని గూర్చి ఎంతో వ్రాసినారు
జనులకునెల్ల గుణములు నేర్పినారు
జెండాకెపుడు విలువను ఇచ్చినారు
జీవుల బాధల గూర్చి కలత చెందినారు
గబ్బిలం, ఫిరదౌసి లను మనకు ఇచ్చినారు
గాయకులకెల్ల పదములు పేర్చినారు
గానముకు తగ్గ పల్లవులందించినారు
గుర్రము అను పేరు చిరకాలము నిలిపినారు
పరమేశ్వరుడెల్ల సరసమాడిరంటిరి
పిల్లల వద్దకు తాను జేరి
పసిపాపలపైన పద్యములల్లిరిటుల
పాండిత్యపు నేర్పు గలవారు మీరు
పౌరుషమె ఆభరణమని తెలిపినారు
పిరికితనమును మనములనుంచి తరిమినారు
ప్రజలను చక్కగ ముందుండి నడిపినారు
ప్రగతి బాట వైపు తోడుకొని సాగినారు

******************************************
శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు

వేయి పడగలు గొప్ప రచనయ
వేరు ఉపమానము లేదు దీనికి
విద్య నేర్చిన వారు ఎవ్వరూ
వాదన చేయరిందు మాటపై
విషయ జ్ఞానం నందు శిఖరుడవు
విషపు వృక్షములు చీల్చి వేసినా
వినయ విధేయత వదలనివాడవు
వాక్కుల రాణీ పలుకుల మూలకారిణీ
వాణికి సోదర నామధేయుడవు
విశ్వనాథ పలుకు విశ్వమంత వెలిగే
విరుల తేనె చిలికీ వినోదము సైతం పంచే
విజయము నీదు వాకిట నిలువక నిక నేమి సేయున్
వృత్తి ప్రవృత్తి నీకు ఈ కవిత్వమేగా
వీరుడు అంటే ఆ రాముడేనని
వాల్మీకి రచనను వచీయించినావు
కలముతోనే కల్పవృక్షమును సృజియించినావూ
క్షీర సాగర మధనమును పునః సృష్టించినావూ
కీడు మాత్రం అందు లేకుండా చేసి గొప్పవాడవైనావు

*****************************************
శ్రీ బోయి భీమన్న గారు

ఓయి బోయి భీమన్న భారతమునెరిగినావు గదన్నా
బాగు కోరి అందరికీ బంధువైతివి గదరన్నా
బంగరమును పండించితివి బంజరమంటి మనసుల్లో
బహు చక్కగ‌ తట్టితివీ తలపుల పంజరపు తలుపులనూ

బహుమతి నొందితివి సాహిత్యమునందున
బహు ముఖ ప్రజ్ఞాశాలివి నీవన్న
భవితవ్యపు నవ నిర్మాణమ్మును చేసితివన్న
బాపితివీ అంటరాని తనమూ సమాజమునందున

బి. ఆర్. గారీ దారీలోనా నడచీనారూ మీరూ
ప్రజలానెల్లా అవ్విధముగా తోడ్కొని పోయీనారూ
భావగీతములు వ్రాసీనారూ బ్రహ్మాండంగా అవి వెలిగీనాయీ
బీజములనూ నాటినారూ మా అందరి మనములలోనా

మనుజులంతా ఒకటేనంటూ మమతా సమతా ఉండాలంటూ
భాయీ భాయిగా తిరగాలంటూ అటులే హాయిగా ఉండును అంటూ

*****************************************
శ్రీ కాళోజీ నారాయణరావు గారు

వరవిక్రయం అంటూ రచన చేసినారూ
వధువు తరఫున పెద్దగ ఇటుల నిలిచినారూ
విలువలనెన్నింటినో మీరు విడమర్చినారు
విశ్వాసాన్ని మీ రచనలలోని పాత్రల ద్వారా
విగతులమవుతున్న మాకు నేర్పినారూ
వేకువ మనమే కావాలని అభివృద్ధి తలుపులు తెరిచేందుకు
వేచి చూడక్కరలేదని బాధలు తరిమేందుకు అని
వేగు చుక్క అయి మీరు వెల్గినారూ
వెలితిలన్నవి లేకుండా మమ్ము నడిపినారూ

ఉద్యమమే ఊపిరిగా జీవించిన మహనీయులు
అన్యాయాన్నెదిరించిన అకుంఠిత దీక్షా పరలు
మలినాన్ని కడిగివేయడమే సిసలైన ముక్తి అనినారూ
అధర్మాన్ని శుద్ది చేయుటలొ ఆద్యులైనారూ

బహుభాషా కోవిదులు బ్రహ్మ సృష్టిని శుద్ధి చేసినారు
అసమాన ప్రజ్ఞాశాలి అస్తమించని కీర్తమంతులు
బృహత్తరముగ కార్యమొనర్చగలరు
బృహస్పతి వోలె మము నడిపించగలరు


అణాకధలూ ఇదీ నా గొడవ అంటూ ఎన్నెన్నో వ్రాశారూ
విజయం తుదకూ మనదేనంటూ ధైర్యం మాకు పంచీనారూ
కారాగారమైనా పోరుబాటనెపుడూ వీడలేదూ
బహిష్కరణను సైతం పద్ధతిగనే గెలిచీనారూ

మహనీయుల సరసన నిలువగలిగినారూ
మహోరాష్ట్రులయుండీ దేశమంతా మీదన్నారూ
విదేశీయులనీ నైజాములకూ పీచమణిచినారూ
బిరుదులు నెన్నో గెలిచీనారూ బాధ్యత మాదీ మోసీనారూ


మాతృ భాష ఆడలేని వాడె మర్త్యుడు -
తెలుగు ఉచ్ఛారణకు తెగువ చేయలేని తెగులేమిటీ
భాష పలుకుబడులది కాక పలుకు బడిలోనిది కావాలని
కవితాత్మకంగా సెలవిచ్చినారూ మము మేల్కొల్పినారూ

వందనమిదె మా అందరిదీ ముందర నిలిచిన మార్గదర్శకులకు
వ్రాయగలమా మేము మీ అంత చతురంగా...

*****************************************

శ్రీ త్రిపురనేని గోపీచంద్ గారు

అరువది దశకములన్న ఆడలేదు నీవు అవనిపై
అకుంఠిత దీక్ష చేసినారు అసమర్థతను తరముటకై
ఆద్యులు మీరు వ్యక్తుల ఆలంబనకూ
సుసాధ్యమ్ము చేయ చూపినారు స్వావలంబననూ

మొట్టమొదటి వారు మనోవైజ్ఞానిక శాస్త్రమ్మును
మనుజులెల్లరకు పరిచయము చేసి తెలుగువారి
మనములందు తిరుగాడినారూ
సంధించి నారు తిరుగులేని ప్రశ్నలను
సంధి కాలమందు శృతి సేరవలయు తలపులను
చీకటి మాటున దాగిన తెరవవలసిన తలుపులను
తొలి వేకువై వచ్చినారూ తెర తీయించి మము నడిపినారూ


మీ రచనలతో యణపాశపు ముందు వెనుకలు
మర్త్య లోకపు వింత పోకడలు విశదీకరించినారూ
పరివర్తనమ్ము చూపించినారూ సొగతాలు చదివించినారూ

శిధిలాలయమ్ములు లయబద్ధంగా నిలబెట్టినారూ
శిక్ష వేయకుండా మాకు శిక్షణను అందించినారూ
శిలాఫలకమువోలె చరితలో నిలిచిపోయినారూ
శరత్ వెన్నెలంటి భవిత అందం చవిచూపినారూ

వందనాలందుకోండి మా మార్గదర్శీ
వేనవేల ధన్యవాదాలు మీకు మనోదర్జీ













Monday, September 30, 2019

బతుకమ్మ మీద పాట


కదిలించేశారు....

In Facebook, I have composed and posted on Sharada Madam's wall in continuation to her song:


మా మంచి మైసమ్మా ఉయ్యాలో మగువలెల్లా నువ్వూ ఉయ్యాలో...
మల్లేపూవల్లే ఉయ్యాలో చూసుకో తల్లిగా ఉయ్యాలో...
రక్షగా నిలిచీ నువ్వూ ఉయ్యాలో రెక్కలే ఈయమ్మా ఉయ్యాలో
లెక్కలే అడుగకా ఉయ్యాలో ఎగరనీ సక్కంగ ఉయ్యాలో
కలలెన్నో ఉన్నాయి ఉయ్యాలో కలతల్ని చేరనీక ఉయ్యాలో
కలప చాటున మావి ఉయ్యాలో కాలీన బ్రతుకూలు ఉయ్యాలో
కాలినీ నోటినీ ఉయ్యాలో మెదపలేని గతుకూలె ఉయ్యాలో
కలవనీ లోకంతో ఉయ్యాలో కననీ బిడ్డల్ని ఉయ్యాలో
కళలనీ నేరువనీ ఉయ్యాలో మరువనీకు పుట్టింటినీ ఉయ్యాలో
ఎదగనీ మమ్మల్ని ఉయ్యాలో ఏమార్చనీక ఉయ్యాలో
పొసగనీ పదుగురితొ ఉయ్యాలో పోరు పొక్కూ లేక ఉయ్యాలో
తగవులన్నవె లేక ఉయ్యాలో తెమలనీ తరుణులని ఉయ్యాలో
తిరిగిరానిదే తరుణము ఉయ్యాలో గడిచినదెపుడూనూ ఉయ్యాలో
తెమలనీ బతుకులనీ ఉయ్యాలో తేలికగా సాగాక ఉయ్యాలో
తీపి గురుతులను మాకు ఉయ్యాలో చెయ్యమ్మ ప్రతిక్షణము ఉయ్యాలో
పండుగా మారనీ ఉయ్యాలో పసిగుడ్డుగ ప్రతి కణము ఉయ్యాలో

Thursday, September 26, 2019

సజల నేత్రి - సంద్రమునకు ధాత్రి

నయనమను నీల మేఘము వర్షించి సంద్రము కాగా

నీలవర్ణమున ఉబికే నయనపు నీటి మాటున
అలలుగ‌ తేలిన బాధను బిగిసిన పంటి చాటున
కరిగిన కలలకు సాక్ష్యముగ కాటుక కన్నుల నుంచి
జారిపోయిన మత్యమంటి మనసును నేను

చోర లంచగొండిగ ధనము కూడబెట్టిన
గోల్పోయిననేమినది కొంతయె నిష్ట జీవితమ్మున
అతిగ నితరులపైన తన పనులకు సైతం ఆధారపడి
పిమ్మట ఆరోగ్యమ్ము గోల్పోయిననదియు అంత చేటుగాదు
మరి చెప్పుడు మాటలు విని తప్పుడు గుణముల నింపుకొని
ఆదరించు ఆలిని గోల్పోయిననది తనను తాను
మొత్తము గోల్పోవుటయె గాద
గ్రహియింపుమా ఓ పురుషా!

కన్యాశుల్కం - వరవిక్రయం
ప్రక్రియ ఏదైనా ప్రశ్నార్థకం మగువ జీవితమే
ప్రవర మగవానిది ప్రహేళిక ప్రతి ముదితది
ప్రగతి కారకుండు పురుషుండుట
పడతి బానిసలకు ప్రతినిధట
పురుడు మాత్రమే పుడమి రూపుదట
పుణ్యమైతె అది ఆతనిదట
ప్రముఖుడెప్పడు వరుడేనట
ప్రదోషవేళ మనకతని స్మరణమట
ప్రస్థానమ్మున అగ్రపదవతనికట
ప్రతి విషయమందు మనమనుచరులమట
ప్రయోగశాలలం మనమేనట
ప్రయోజనాలెపుడు వారికెనట
ప్రయత్నమ్ము సేయవలదెపుడట
పతిదేవులను మార్చుటకట
పత్ని బ్రతుకుకునెప్పుడు కటకటే
పదములనెప్పటికీ వెనకేనట
పాపమైతేనే మనము ముందట
అక్కటా అన్ని దశ, దిశలయందునూ ఇదే అవస్థట
యుగ, తరములు గడిచినా ఇది మారదట





Saturday, September 21, 2019

ఆదిత్యుడు

🙏🙏🙏 ఆదిత్యుడు ఈయన ఆద్యుడీ లోకమునకే
ఆరంభం ఈతడే అదితి సుతుండు
అందరి చే వందితుండు ఆర్క నామధేయుండు
ఆవిరి చేయగలడు కడలిని కానీ
ఆంతరంగమున దయామయుండు
ఆదిదంపతులకు అతను నేత్రుండు
ఆనందాలకు మూలకారకుండు
ఆశ్రిత వత్సలుండు అటులే గాద కర్ణుడిని మరి కాచుకుంది
అశ్విని దేవతల పతి ఈతండు ఆరోగ్య దాయకుండు


ఆది దేవుడే ఆగమనము సేయగా
అపూర్వ దిశ నుండి ఆగని గమనము సేయించగా
అనునిత్యము జ్వలించు అగ్ని గుండము సేవించగా
అడుగడుగునా మా అవసరాలను తీర్చుచుండగా
అనంతలోకాలకి అందని దూరమున ఉంటూ
అంబరమున నిలిచి మాకు పగలును అందించుమా
ఆయురారోగ్య ఆనందాలతో మము దీవించుమా
ఆదిత్యునివైన నిన్ను మేము సదా కొలుతుముమా

జగదంబిక జయనేత్రానివైన ఘనుడవు నీవు
జలజాక్షి కొలువైన రథమండలము నడుపు సారథివీవు
జంగమయ్య రుద్రుడై నిలుచు అశ్వవాహనుడవీవు
జానకీపతి కదనరంగాన కొలిచిన ప్రత్యక్ష దైవానివీవూ



వెలుగు ను పంచడం లో అద్వితీయుడవు  వేకువ జాము కు ఆదిముడవు
వెన్నెల మామకు సైతం ఆదర్శ ప్రాయుడవు వేల్పుగా కొలువబడే ఆదిత్యుడవు
సృష్టికి ఆనంద కారకుడవు సకల జీవ కోటి కీ ఆరాధ్యుడవు
సుకుమారమైన పుష్పాలకు సైతం ఆశ్రితుడవు
కర్మ సాక్షీ కాంతి నిలయా కారుణ్య మూర్తి అందుకో మా వందనాలు
భాస్కరా భానుదయా ద్వాదశ రూపా దినకర తేజా దీవించు మమ్ము విజయాలతో



ఆదిత్యుడు అగ్ర స్థానుడు
ఆరంభ కారకుడు ఆరోగ్య దాయకుడు
ఆవిరి చేయగలడు అంబుధిని
అందించనూగలడు అమృతమును

"""""""""""""""""""""""""""""
హే కమలముల‌ రేడా కిరణముల గూడా
నీ వలననే ఏర్పడునులే ప్రతి నీడా
కలువల చెలిమికి నీవే తోడా
తూరుపుపై నీదెపుడు చెదిరి పోని జాడ

నిను కోరే వారికి నీపై కోపమున్నవారికీ
నిందలు బేధములెన్నడు సేయక
సమముగ వెలుగును పంచీ ఇచ్చే
దయగల మమతల సూరీడా

ప్రత్యక్ష సాక్షివీవు ప్రతి కర్మకూ
పలుకవు అయినా ఎటువంటి ప్రశ్నకూ
పయనము మౌనముగ చేస్తూ నీవూ
పూర్వము నుంచి పశ్చిమాద్రి కేగేవూ

ప్రతి నిత్యం పరుగిడుతున్నా
పదిలమే నీలో అంతే శక్తి
ప్రాభవమింతైనా కరగదు; దిన
ప్రచోదనం నీతోనే ప్రారంభం

వామాంకులకూ నేత్రముగా
వాసుదేవునితోనూ వర్ధిల్లుతూ
ద్వాదశాశ్వములతో అలుపెరగక
నడుస్తూ యుగయూగాలనూ దాటిన

ప్రాజ్ఞుడవీవూ ప్రాచీనుడవూ
పసిడీ సైతం నీలో ఒదిగే
ప్రాణాలు సమస్తం నీ వల్లే ఎదిగే
ప్రావీణ్యత అంతా నీదేలే

గగనమున సింధూరంలా భువిపై
పంటలలోనా పచ్చదనంతో వాయువు
లోనాగ్నిలోని ఆత్మవుగా నీటికీ మూలంగా

పంచభూతాలలో ఉనికిగానూ
ప్రకృతి మాతకు మూలంగానూ
విలసిల్లుతూ దీపముగా భాసిల్లుతూ
జ్యోతిర్గణాధిపతిగా సమస్తమునూ నడిపెవూ

నిందలు వేసినా నిన్నేమన్నా
చెదరక మెదలక నీ దారినేగేవూ
నిజమును నిత్యం చూస్తూండెదవూ

నీ స్థానం నుంచి ఎన్నడూ దిగజారవూ

Wednesday, September 18, 2019

Sri Bhramaraambika

శ్రీ గిరీ శిఖరమందూ శంకరుని సతిగ వెలసినావూ
శీతలమ్ము నీదు గుణమే నా తల్లి నీదు నిలయము కూడా అంతే ||శ్రీ గిరీ||

దక్షునీ పుత్రివయ్యీ నీవు ఆ శివుని చేరినావూ
హిమవంత తనయవయ్యీ హాలహలమ్మునూ తరమినావూ
తపమెల్ల ఒనర్చినావూ త్రినేత్రుడిని పొందినావూ
కళ్యాణ రూపిణిగనూ కామితారథములనిచ్చినావూ || శ్రీ గిరీ ||

షష్ఠేచ కాత్యాయనిగనూ పునఃపూజ నొనర్చినీవూ
ఫాలనేత్రుని అందీ అందరికి మార్గమును చూపినావూ
వధియించు వ్యాఘ్రం సైతం నిను చూసి తాను మారే
వాతసల్యమొనర్చుకుంటూ నీ చెంతనేగ నిలిచే ||శ్రీ గిరీ||

భ్రమరమ్ములూ భ్రమరమొందే బంధమూ పెంచినావూ
భద్రమును ఒనర్చు నీవూ బ్రహ్మమును పంచినావూ
భార్గవి రూపముననూ సిరులెల్ల గూర్చినావూ
భారతీ దేవివయ్యీ ఓ జనని విద్య వినయములొసగినావూ ||శ్రీ గిరీ||

శివుని పతివమ్మ‌ నీవూ శుభములూ సేయుచుండూ
స్మరణ మాతరముననే‌ శీఘ్రముగ స్పందించెదవుగా
శ్రీకరీ నామావళీ శ్రేయమే మాకెపుడునూ
సహస్రమూ నీ పేరులే సదా మాకవియు ముదములే ||శ్రీ గిరీ||

మాతృకలు నిను గొలువగా ముదముతో నుండు దేవీ
మాతవై నిలచి మాకూ మత్సరములెల్ల దీసెయ్యవే
మా తప్పులూ గాయమ్మవే మా తల్లి మాకు గుణములు నేర్పవే
మోక్షముకూ మార్గమీయవే ఓయమ్మ ముక్తి మాకొనరించవే ||శ్రీ గిరీ||

Sunday, September 8, 2019

శ్రీ అయ్యప్ప

కరిమల వాసా కరుణావరదా శబరిగిరీశా అయ్యప్పా
కామిత ప్రధాతా కాంచన వదనా శరణమనేశా అయ్యప్పా || కరిమల||

కళ్యాణ కారకా కావ్యముల వందిత శ్రీ గిరివాసుని తనయుడవే
కృపా సాగరా కార్య సాధకా శ్రీ దేవీ పతి పుత్రుడవే || కరిమల ||

కీర్తనమను ఓ భక్తి విధమున స్తుతియింతుము మిము అయ్యప్పా
కదనరంగమున సదా గెలుచు నిను కొలుతుము విడువక అయ్యప్పా || కరిమల||

Sunday, September 1, 2019

శ్రీ గణపతి మీద కవిత శ్రీ వినాయక చవితి వికారి నామ సంవత్సరమున

గృహములెల్ల గోవిందుని ప్రభలు నిండగా
ప్రతీ తల్లి తండ్రి పార్వతీ పరమేశ్వరుల కాగా
పుత్రుల రూపమున వెలసిన పళని వాసుని సోదరా
మహాభారతమును వ్రాసినావు వ్యాసుని తోడ నీవుగా

గణపతి నామ ధేయా గజేంద్ర వదనా
గౌరీ పతి ప్రియ సుతా కరుణా వరదా
గోవింద తనయ పతి సహోదరా
గరికను అందుకుని మము దీవించుమా



వినుమా వినాయకా మా విన్నపములను
విమలా సుత మా సంకల్పాలకు
విఘ్నములే నీవు తొలగించుమా
విజయములను సదా చేకూర్చుమా


పేరు మాధురి
కలం పేరు శేషు