Tuesday, February 19, 2019

Telugu Chandassu

ఇంద్రభాను - 2

ఇంద్రభాను వృత్తపు గణముల అమరిక - UIUIU - IU - UIUIU. ఇందులో మొదటి భాగపు చివరి భాగపు అమరికలు ఒక్కటే. అవి లగపు వంతెనచే కలుపబడినది. కావున అక్షరసామ్య యతి, ప్రాసయతి రెండింటితో వ్రాస్తే ఈ వృత్తము శోభాయమానముగా ఉంటుంది. అట్టి ప్రయత్నమునకు ఉదాహరణములు -

ఇంద్రభాను - ర/జ/త/ర UIUIU - IU - UIUIU
12 జగతి 1323

రమ్ము సుందరీ - రతీ - రమ్ము ప్రేమతో
సొమ్ము నీవెగా - సుధల్ - చిమ్మ రా చెలీ
కమ్మ వ్రాసితిన్ - గదా - కమ్మఁగా సకీ
వమ్ము సేయకే - వరం - బిమ్ము శీఘ్రమే

వీణ మీటనా - ప్రియా - వీనులింపవన్
పాన మీయనా - ప్రభూ - తేనె తీపితో
ఆనతీయవా - హరీ - ప్రాణ మిత్తురా
నేను నీకెరా - నిశిన్ - మేను నీకెరా

కాల మయ్యెరా - కథల్ - చాలు నింకరా
పాలు త్రాగరా - పద - మ్మాలకించరా
కాల మయ్యెరా - కనుల్ - వాలిపోయెరా
నీలమోహనా - నిసిన్ - లాలి పాడనా

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు



No comments: