Wednesday, July 14, 2021

పద్య భారతి

 * ఉత్సాహము: 7 సూర్య గణములు, 1 గురువు, ప్రాస కలదు, యతి 5వ గణము మొదటి అక్షరము*


అరుణ కాంతి వేళ నతఁడు నామె చేయి పట్టి నీ

బరువు బాధ్యతలను మోయుఁ బంధమౌదు ననుచు తా

విరహ మింక తాళలేక వేడుచుంటి నిన్నిటన్

సరస మాడుకుంటు తెలిపె సఖుడు మదిని వలపు తోన్


*తొలకరి వర్షం*


*కందము*


తొలకరి చినుకుల్ కుఱియగ

నిలపై  నిండెను చెరువులు నింపుగ జూడన్

పొలముల పంటలు పండెన్

బలిమిగ; హాలికులకెల్ల ఫలములుఁ బంచెన్


*చంపకమాల*

*న, జ, భ, జ, జ, ర 11వ అక్షరము యతి,  ప్రాస యుండును, ప్రాసయతి చెల్లదు*


సురమునిపూజ్య! మాగృహముఁ శోభల నింపె మడి భాగ్యదాయివే!

సరసిరుహాక్షి! లోకముల చల్లగ జూచెడి నీకు మ్రొక్కినన్

త్వరిత ఫలంబు లందునని భక్తుల నమ్మిక; కల్పవల్లివై

వరములనిచ్చు వేల్పువని వందనమిచ్చెద తల్లి! నీకివే


*మత్తకోకిల*


*ర, స, జ, జ, భ, ర 11వ అక్షరము యతి,  ప్రాస యుండును, ప్రాసయతి చెల్లదు*


శౌరివై రణమం దునిల్చె డిశక్తి వేయసు రాంతకీ

వేరు మాటలెఱుంగనమ్మిట వేల్పు వైనను గావుమా

గోరినంతనె భక్తులందరి గోర్కెలన్నియు దీర్పుమా

వారిజాక్షి! కపర్థిపత్ని! దవాగ్ని నేత్ర! ప్రణామముల్

*చిత్రము*

*మంగళ గీతి: 4 ఇంద్రగణములు, 4 పాదములు, ప్రాస ఐచ్ఛికము, యతి 3వ గణము మొదటి అక్షరము*

రక్తముఁ బీల్చెడి రక్కసి జూడరే

రసము వోలె దలచి ద్రాగుచుండె మదమున్

జీవుల బాధించి చిరునగవులు చిందు

గుణమెటుల హితమగునిలన్ దెలియదాయె


*పంచ చామరము*


4 పాదములు, ప్రాస గలదు,


జ, ర, జ, ర, జ, గ గణములు, లేదా 8 వ గణములు, యతి 10వ అక్షరము


*బాల్య జ్ఞాపకములు*

*పంచ చామరము*


సదా భయంబు తోడ నేను సాగినాను ముందుగా

మదిన్ భయమ్ము మెండుగాగ మాటరాక యుండగా

గదాధరుండుఁ నాంజనేయుఁ గాయు దైవముండగా

కుదేలు గావుటింక మాను కొమ్మటంచు మాతయే


వచించి ధైర్యమిచ్చు పల్కె బాగుగాను ప్రేమగన్

రచించు మమ్మ రామ బంటు లక్షణంబులన్నియున్

కచేరి చేసి నంత భక్తిగాను దేవదేవునిన్

కుచింతలన్ని పారిపోవు; గోర్కెలెల్ల దీరునే

No comments: