Tuesday, August 31, 2021

ప్రవచనం - 1

 

సాయంత్రం 6 గంటలు కావస్తూంది.  సౌమ్య ఆఫీస్ నుంచి ఇంటికి వెళుతూ దారిలో ఉన్న గుడి లో ఆగింది.  ఆ గుడిలో ఉన్న సుమంగళి గారిని చూడటానికి. ఆమెకి దేవుడిపై భక్తి తక్కువ కానీ ఆ సుమంగళి గారిని చూస్తే ఏదో ఆనందం.  ఎన్నాళ్ళ నుంచీనో ఆవిడని ఒకసారి కలవాలి అనుకుంటుంది.

 ఆవేళ శుక్రవారం కావడంతో  తెల్లవారి ఎటు శనివారం సెలవు కదా అని ఓ సారి ఆగి గుడి లోకి వెళ్ళింది.

 ఇంకా ప్రవచనాలు సమయం కాలేదనేమో. జనాలు పల్చగా ఉన్నారు అదే అదునుగా సౌమ్య గుడి మెట్ల మీద కూర్చుని వున్న సుమంగళి గారిని పలకరించడానికి వెళ్ళింది. వెళ్లి ఆమె కాళ్ళకి దగ్గరగా కూర్చుని నమస్తే బామ్మ గారు అంది.

 కొద్దిగా బామ్మగారు కూడా నవ్వింది దైవ దర్శనం చేసుకున్నావా అమ్మ అని అడిగింది.

 లేదు బామ్మా, మిమ్మల్ని కలుద్దాం అని వచ్చాను అన్నది సౌమ్య.

 మరోసారి చిన్నగా నవ్వింది బామ్మగారు దేవుడంటే పెద్దగా భక్తి ఉండదు మీ తరానికి, అని అన్నది

 దైవం మానుష రూపేణ అన్నారు కదా బామ్మ అందుకని ఒకసారి మీ తోనే మాట్లాడదామని, అని ఆగింది సౌమ్య.

 చెప్పవే మనవరాలా అంది ప్రేమగా బామ్మ.

 ఏమీ లేదు బామ్మా, మీరు ఎప్పుడు చూసినా ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటారు.

నిండా పాతికేళ్ళు కూడా దాటినట్టు లేవు, అప్పుడే

  నిన్ను ముంచితే సమస్యలు ఏమిటే మనవరాలా అన్నది బామ్మ. 

 అబ్బా మామూలు సమస్యలా ఒకటారెండా. ఇంట్లో 

 పని సాగాలి ఆఫీసులో ఎవరూ మాట వినరు.

 మధ్యలో సన్నగిల్లుతుంది శక్తి.

అంటూ నిట్టూర్చింది సౌమ్య.

 అందుకనే మిమ్మల్ని చూసినప్పుడల్లా అనిపిస్తుంటుంది బామ్మ

ఎప్పుడూ చిరునవ్వుతో మీరు ఎలా ఉండగలరు అని

 మీ హ్యాపీనెస్ సీక్రెట్ నాకు కూడా షేర్ చేయరా బామ్మ అంటూ గారాలు పోయింది సౌమ్య

 చెప్తాను సరే, మరి నువ్వు నవ్వ కూడదు అంటూ షరతు విధించింది బామ్మ. సరే పెద్దల మాట చద్దిమూట కదా కాబట్టి మీరు చెప్పిన దాన్ని విని నవ్వను

 నాకు అన్వయించుకుంటూ ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేస్తాను

అంది సౌమ్య 

  అయితే సరే ఇంతకీ చెప్పనేలేదు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు పెళ్లయింది ఎంతకాలమైంది ఉద్యోగం ఏమిటి అంటూ ప్రశ్నలు సంధించింది. బామ్మ పెద్దలకు ఎదురు చెప్పలేదు కాబట్టి సౌమ్య నెమ్మదిగా తన గురించి చెప్పసాగింది పెళ్లయి ఏడాదిన్నర బామ్మా, మూడేళ్లుగా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను హెచ్ఆర్ మేనేజర్గా, ఒక ఆడపడుచు రెండు వీధుల అవతల ఉంటుంది. అత్తా మామా, అమ్మానాన్న ప్రక్క ప్రక్క ఊర్లలో, పల్లెటూర్లలో ఉంటారు.

 వాళ్ళందరూ కలిసి, ఇంకా పిల్లలు లేరు ఏమిటి అంటూ మమ్మల్ని అడుగుతూ ఉంటారు. మా ఆడపడుచు, ఒక్కసారి పిల్లలు పుడితే ఇంక మన కెరియర్ అంతే, ఫుల్ స్టాప్. కాబట్టీ టైం తీసుకో, పర్లేదు అంటుంది. తను చాలా మంచి అమ్మాయి, పాపం ఇంట్లో సహకారం తక్కువే!

 ఆఫీస్ కి వెళ్తే ఎవ్వరూ నా మాట వినరు. కొత్తవారి చేత పని చేయించాలి సీనియరస్కీ నచ్చ చెప్పుకోవాలి.

 అంటూ ఏకరువు పెట్టింది సౌమ్య. మరోసారి నవ్వింది బామ్మ

 అయితే ఇవే సమస్యలు అంటావు, అవునా! అంటూ.

 హ్మ్... సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి లే బావ నీ వయసు, అనుభవములకు నా కష్టాలు చిన్నదేమో కానీ నా పరిస్థితికి మాత్రం పెద్దవే, అంటూ, బుగ్గ కింద చేయి పెట్టుకుని,కళ్ళు పెద్దవి చేసి, నిట్టూర్చింది సౌమ్య.

మళ్ళీ తనే, అవును బామ్మా,

ఇంతకీ నే అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పనే లేదు, అంది. ఏమి ప్రశ్నా? అడిగిందావిడ! అదే, మీ హాపీనెస్ సీక్రెట్! అన్నది సౌమ్య! నువ్వే అన్నావుగా,  సీక్రేట్ అనీ, అంటూ నవ్వారావిడ! ఆ సంధ్య వేళ, 

ఆమె మోములో దరహాసం భలే హాయిగా అనిపించింది సౌమ్యకు. పచ్చని పసిమి మొహమూ, తూరుపు సింధూరంలా కుంకుమ, వెనక చక్కగా ముడిచిన సిగలో తురిమిన చేమంతి పూవు, పసుపు అంటిన అఱచేతికి క్రింద గాజులూ, ఎంత సేపు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఆవిడ నవ్వుతుండగా చూస్తే తెలియని వారికైనా చేతులు జోడించాలనిపిస్తుంది. అందుకే, అంతగా దేవుడిని నమ్మనూ అనుకునే సౌమ్యకు కూడా ఆవిడతో ఇన్నాళ్ళూ అవిడతో ప్రత్యక్షంగా పరిచయం లేకపోయినా ఒకలాంటి అభిమానం ఏర్పడి, ఓ రెండు మూడు సార్లు కలిసింది ఇప్పటి వరకూ. ఇదుగో, ఇప్పుడిలా సమయం తీసుకుని ఆవిడ కౌన్సెలింగ్ అందుకుందామని ప్రయత్నిస్తోంది. ఈ కాలం పిల్లల్లా పెడ పోకడలకు పోకుండా పద్ధతిగా ఉంటుందని ఆవిడకు కూడా అభిమానం సౌమ్యంటే.  పెద్దలను గౌరవిస్తూ, వారి అనుభవ సారం అందుకోవాలని ఈ వేళ ఇలా ఆవిడ దగ్గర కూర్చుంది సౌమ్య. 


అమ్మాయీ, ఈ మధ్యన మీ ఇంటికి ఎవరైనా బంధుగణం రావటం కానీ, నీవు ఎక్కడికైనా వెళ్ళటం కానీ జరిగిందా? నీకు బాగా మనసుకు చేరిక, ఆనందం ఎవరి సమక్షంలో అనిపించిందీ. అడిగింది బామ్మ!

 వచ్చారు బామ్మ మా పిన్నత్తగారు వచ్చారు.  ఆవిడకి నాకు చాలా మంచి అనుబంధం ఉంది ఆవిడ వెళ్లిపోయేటప్పుడు అయితే చాలా బాధగా అనిపించింది కూడా.
ఎందుకంటే నాకు తెలియని ఎన్నో విషయాలు నేర్పిస్తారు పనుల్లో చాలా సహాయం చేస్తారు.
 అలాగే మా ఆడపడుచు వాళ్ళ అత్తగారు ఊరికి వెళ్లాను ఏదో ఫంక్షన్ ఉంది.
 ఎంత బాగుందో.
 చక్కగా పల్లె మల్లెమొగ్గలు గోరింటాకు
జున్ను పాలు ఆవు నెయ్యి పెరుగు,
 తోటలో ఉయ్యాల చాలా ఎంజాయ్ చేశాను.
 ఎగ్జయిటింగ్ గా చెప్పింది సౌమ్య.
అవునా, అప్పుడు మరి ఈ ఆఫీస్ టెన్షన్సూ, కుటుంబ విషయాల ఒత్తిడీ లేవా, దరి చేరలేదా బాలికా! నాటకీయంగా అడిగారు సుమంగళి గారు.
లేకేం, ఉండీ దరి చేరలేదు! హంథే. నవ్వుతూ, బామ్మనే అనుకరిస్తూ చెప్పింది సౌమ్య. 
అంటే మనసుకు నచ్చిన విషయాలు ఉన్నప్పుడు, కనీసం మనం గౌరవించదగ్గ వారు ఉన్నప్పుడూ బాధ పెట్టే మిగతా విషయములను తొక్కి పట్టేస్తామే!

 అలాంటిది, అనునిత్యం మన మనస్సులోనే ఆ జగజ్జనని కొలువై ఉంటుంటే, ఇక వేరే ఆలోచనలూ తద్వారా ఓఇగుళ్ళూ ఏలనే బాలా అన్నారావిడ! 
అంటే, అంది సౌమ్య,  అర్థం అయ్యీ కానట్టూ ఉంది సౌమ్యకు.
అర్థం కాలేదా బుల్లీ, మరేం లేదు, నీవు నీ వారి మధ్య ఉన్నప్పుడు ఎంత ఉల్లాసంగానూ, అలాగే నీ పరధ్యానం వల్ల వారు ఇబ్బంది పడకుండానూ ఎంత జాగరూకతతో ఉంటావో, అలాగే నేనూ అన్నమాట! 
ఒక్కపూట ఉండే ఒకరో ఇద్దరికో మనం అంత విలువ ఇస్తే, మరి ఈ సమస్త జగమునూ సృజించీ, మనని అను నిత్యము కాచే జనని మన చెంత ఉంటుందని తెలిసీ, మనమింకెంత శ్రద్ధతో మసలుకోవాలి! అటువంటప్పుడు మరిక వేరు విషయములకు తావేదీ! అదే నే చేసేది! అన్నారావిడ. మళ్ళీ తనే, ఇవన్నీ నీకు ఒక్క రోజులో అర్థమయ్యేవి కాదే బాలికా, నెమ్మది మీద అవగతమవుతాయి! నీ వయసూ, అనుభవమూ అందుకు చాలవు తల్లీ అన్నారు ప్రేమగా!
అంటే సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్టన్నమాట! అంది సౌమ్య. 
చురుకైన దానివే, మెచ్చుకున్నారావిడ.
నవ్వి, అది సరే, మరి అర్థమయే దాకా ఎలా! అడిగింది సౌమ్య. 
ఎలా, అంటే, ఏమిటి, అన్నారావిడ,  ఆట పట్టిస్తూ.
ఫో బామ్మా, అప్పటి దాకా నా వంటి వాళ్ళకి ఆందోళన పడకుండా నిలదొక్కుకోగలగటం ఎలా? అంది సౌమ్య .
నువ్వే అన్నావు కదా, సాధనమునా అనీ... సాధన చేసేయి, అన్నారు, తన మార్కు సన్నని నవ్వుతో.
అంటే తల్చుకుంటూ ఉంటే పనులు జరిగిపోతాయా, కష్టాలు తీరిపోతాయా, అంది కినుకగా.
నేనేమి చెప్పానూ, తల్చుకుంటే, తల్చుకుంటూ ఉంటే, కష్టాలు తీరతాయని కాదూ! మనం మన మనసులకి తీసుకోవటం మాని వేస్తామని! అందుకు సాధన! అంతే కానీ గాలిలో దీపాలెట్టమని కాదు! 
కాబట్టీ గీతలో పరమాత్ముడు చెప్పినట్టూ పనులు చేయటం మానవద్దు, కానీ దైవ స్మరణ మరువకు! ఏమో, అయినా మన అమ్మ మనకెప్పుడూ అడగకుండానే అన్నీ అమర్చి పెడుతుందే, అందరం ఒకే ఊరిలో లేకున్నా తనకు అందినంత మేర మనను కాస్తుందే! మరి అలాంటప్పుడు ముల్లోకములకూ మాత ఆ పరమేశ్వరి మన కష్టం తీర్చదని ఎందుకనుకుంటున్నావూ! కాకపోతే, అంతటి సామ్రాజ్ఞిని తలుచుకోగలిగే భాగ్యం వచ్చాక ఇక మిగతావి చిన్నవి అయిపోతాయి, ఎందుకంటే, అవన్నీ అంతు లేని కోర్కెలూ, కానీ ఈ తల్లి మన అంతరంగం! అందుకే అంతలా మమేకమైపోతాం! ఈ సారి సన్నని నవ్వు కాదు ఆమె మోములో, ఓ తన్మయత్వము! సౌమ్య మరింత ముగ్ధురాలయి మరి మాట్లాడలేదు!
థాంక్యూ బామ్మా, అంటూ బండి వద్దకు వెళుతూ, ఆవిడని దింపాలేమోనని వెనకకు చూసేసరికి, చక్కగా అడుగులు వేసుకుంటూ నడుస్తున్నారావిడ, చెప్పుల స్టాండ్ దగ్గర నుంచీ. ఆవిడ దగ్గరకు వెళ్ళి, దింపనా బామ్మా అని అడిగితే, ఇల్లు దగ్గరేగా! ఓ నాలుగడుగులు వేస్తే మంచిదే, నడుస్తానన్నారావిడ. ఆవిడకు కంపెనీ ఇస్తూ, అది సరే బామ్మా, నే దేవుణ్ణి నమ్మినా నమ్మకున్నా నాకు మీ కాన్సెప్ట్ నచ్ఛింది కాబట్టీ ఓకే, మరి పూర్తి నాస్తికులకయితే ఎలా చెప్తాం, అడిగింది, అమాయకంగా.
ఎవరికైనా వర్తించే సూత్రమొకటేనమ్మా, అయినా నీ భాషలో చెబుతా విను, ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, మొన్న ఆఫీసులో తిన్న తిట్లే కానీ, నిన్న స్నేహితులతో జరుపుకున్న సంబరాలే కానీ, అటువంటప్పుడూ, మనసులో చింతలేలా? రేపనేది మన చేతుల్లోది కానప్పుడు అతి చింతన ఏలా? అది మన ఆరోగ్యానికే చేటన్నప్పుడు వదిలేస్తే పోలా? అంతేనా కాదా? అన్నారావిడ. 
You're awesome బామ్మా అనకుండా ఉండలేకపోయింది సౌమ్య. 

కంద పద్యము:

జననిని దలిచిన సతతము
మనసును జేరదు విషమగు మలినము జనులా
వనరుహ లోచని నిత్యము
మనలను గాచును! శరణము స్మరణయె! వినుమా


మరొక బోధతో మళ్ళీ కలుద్దాం, సెలవు.

No comments: