Thursday, May 19, 2022

1000 - పరిష్కరింౘ బడినవి - భారతమూ

 1 నిశ ఛందము, ప్రాస కలదు,

 న, న, ర, ర, ర, ర యతి 9

నలుడు నిషధ రాజ్య నాథుండు రాయంచ పల్కంగనే

లలిత సుగుణ శీలి లావణ్య సౌందర్య రత్నంబునై

వెలుగు వనిత యైన భీష్మాచలా ధీశ పుత్రిన్ మదిన్

వలచుచు దమయంతి పై చింతతో నుండ సాగెన్ సదా


2. సింహరేఖ / ర, జ, గ, గ, యతి లేదు

రాజహంస నింగిదారిన్

రాజకన్య చెంత కేగెన్

రాజపుత్ర వీర గాథల్

రోజు తాను దెల్ప సాగెన్


3.తోదకము భ, భ, భ, గ, గ యతి - 7

అంతట నా దమయంతి దలంచెన్

పొంతము నా గుణ భూషణుతోడన్

కంతువ నందున కాంచుచునుండెన్

కాంతునిగా నలు కంజనిభాస్యున్


4. మంగళగీతి, 4 ఇంద్ర గణములు, 3వ గణాద్యక్షరము యతి

సురులను వలదని సుదతియె వలచుచు

నరుఁడగు నరపతి నలునకు వేసెను

వరమాల గొని స్వయం వరమున ముదమున

కరముల పట్టిన కామిని దమయంతి


5. గగనమణి/ న, న, న, భ, న, లగ, యతి - 10

అలిగిన కలి పురుషుడంతట కసిగ మదిన్

బలిగ నలుని చెఱను పట్టగ తలచు కొనెన్

విలువలనెపుడు విడని వీరుడు నలుడగుటన్

కలి యతనిని పడయగందినములు గడిచెన్


6. పృథ్వి జ, స, జ, స, య, వ యతి - 12

ప్రమాదకరమౌ యశౌచమును పట్టె! పాదమ్మునన్!

తమో గుణము నిండె జూదమున దమ్ముతో నోడగన్

సమస్తమగు రాజ్యభోగములు శాంతియున్ కోల్పడెన్

శమించుట యసాధ్యమౌ సరళిఁ సర్వమున్ పోవగా.


7. నాగర / భ, ర, వ - యతి లేదు 

హానెను = విడచెను

కానలకేగె పత్నితో

దీనత నిండగా మదిన్

మేనును గాచు వస్త్రమున్

హానెను భుక్తికై యిటన్


8. మధురాక్కర / 

1 సూ + 3 ఇం + 1 చం, 

యతి - 4వ గణాద్యక్షరము 

కలిపురుషుని ప్రభావమ్ము కలుగంగ తలపునందున్

లలిత సుకుమారియు హృదయ రాణియు నని జూడక

నలుడు దమయంతిని వనమున విడచి యొంటరిగా

వెలుగు కంటె ముందె విడిచి వెడలెను నిస్పృహతో


9. అంతరాక్కఱ / 1 సూ + 2 ఇం + 1 చం, యతి 3వ గణాంత్యక్షరము 

అంత నిదుఱ మేల్కొన్న యా దమయంతియె

చింత పడుచు లేచి నడచి సాగుచుండ

వింత సీదరమొకటి విషాదముగ

అంతమొందింౘ బోయెనపుడు వచ్చిన


10. స్వాగతము / 

ర, న, భ, గగ - యతి 7


వేటగాడొకడు వేటును వేసెన్ 

కాటుకై నిలుచు కర్కటి పైనన్

మాటునుండియును మానిని గాచెన్

చేటొనర్చ తలచెన్ మదిలోనన్



11. అల్పాక్కర / 2ఇం + 1 చం - 3వ గణాద్యక్షరం యతి


వలచి పొందెడి ఆశ పడి ఆతను

నలుని పత్నిని చేర నడచి వచ్చెన్

ఫలితమాతనికి శాపమునిచ్చిన

కలికి! ముందుకు సాగె కాన నుండి


12. మధ్యాక్కఱ /

 2ఇం + 1 సూ + 2 ఇం + 1 సూ 

4వ గణాద్యక్షరం యతి


అనల కీలలచిక్కి నట్టి యహిరాజు కర్కోటకమును

వనమున కావల చేర్చ  పాము నలుని కాటు వేసె

తనకుదంష్ట్రా హతి నీయ తగదను నలునితో పలికె

మనుగడ కొఱకు నయోధ్య క్ష్మాపతి ఋతుపర్ణు జేరు

13.

మహాక్కఱ / 1 సూ + 5 ఇం + 1 చం యతి 5వ గణాద్యక్షరం 

అతని కొలువు నందున జేరి నేర్పునీ వశ్వ హృదయమును! శుభ వేళన 

క్షితిని దరిమి రక్షణనొసగి సతము క్షేమము నిచ్చు నక్ష హృదయము

బ్రతుకునందు పట్టిన శని వదులును భావిలో నెనలేని మేలు కల్గు

సుతులు సతితోడ జేర్చును శీఘ్రము శోభ దక్కును రాజ్యమును దొరుకు


14. మనోరమ / న ర జ గ 7 యతి

అని యొసంగి మాయ వస్త్రమున్

మనుజనాథ నీవు దీక్షతో

తనను దల్చినంత తొల్లిదౌ

తనువు రూపమంద వచ్చనెన్


15. చంద్రవర్త్మ / ర న భ స యతి 7 

యంత = రథ సారథి, కంత = గడుపు

అంత నా నలుడు నా పలుకులతో

చింత వీడి నృపు చెంతకు వెడలెన్

యంతగా నట దయన్ కొలువిడగా

కంత సాగెనిక కాలము వడిగన్

16. మంజు భాషిణి / స జ స జ గ యతి 9

సుమనోహరాంగి కడు శోభనాంగి యౌ

దమయంతి కానలను సాగు వేళ లో

మమకార రక్ష లిడె మాతృమూర్తి యో

కమలాక్షి జీవితము కమ్మగా చనన్


17. హరిహర / భ జ న త యతీ 7

తారి = సూత్రధారి 

చేరెను విదర్భ చెదరె కష్టమ్ము

చారులను పంపె సఖుని కోసమ్ము

తారిగ సమస్త ధరను గాంచంగ

పారె పథకమ్ము పతియె దక్కంగ

18. బంధురము న న న న స భ భ భ గ యతి 16

ఖలత = దుష్టత్వం ప్రాసాక్షర పద కోశము

నలుడు రథము నడుపు విధము గని యానందముగా ఋతుపర్ణుడనెన్

తెలిపెదనిపుడొక ఫలములనిడు విద్దెన్ విను నామము యక్ష హృదియౌ

నలత కలత లలత ఖలత లవి యేనాటికి నింకను రావుదరిన్

మలచుకొనుమమనుగడనిక యని ప్రేమన్నిడె నశ్వ హృదిన్ శుభమై


19. కమల విలసితము / న న న న గ గ యతి 9 59/26


కలిసిరి యిరువురు కరగెను బాధల్

గెలిచెను రణమున కిలకిల మ్రోగెన్

పలుకుల నగవులు పగలును రేయిన్

ఫలశ్రుతి దలచిన ఫలితము దక్కున్


20.  ఫలసదనము న న న న స గ యతి 10 

నలునిచిలునిదలచిన కలిపురుషుండున్

తొలగి తరలి వెడలు దొఱకును ఫలమ్ముల్

కలిమి కలుగు త్వరిత గతిని నను వాక్కున్

పలికిరి సురులు సులభ గతి నరులొందన్

No comments: