Friday, May 27, 2022

పరిష్కరింౘ బడినవి - 1000 భాగవతము

1 రుచిరము, జ, భ, స, జ, గ యతి 9


హిరణ్య కశ్యపుడు మహేంద్ర వైరి యీ

ధరాతలమ్మునకును దైవమంచు తా

మురారి భక్తులకును ముప్పు తెచ్చుచున్

విరోధి భావము మది పెంచె సూను పై


2.శ్యేని ర జ ర వ 7 

తాను గాక వేరు దైవమెవ్వఱో

భానుడై జ్వలించు వాసుదేవుడా

దానవాంతకుండు దైత్య హారికిన్

హాని జేయపూనె  నాగ్రహమ్ముతో


3. 173 119 మణిభూషణము ర న భ భ ర 10

ఉక్కు కంబమును జేరి మహోజ్వల శూరుపై

నొక్క వేటునట వేయగ నుగ్ర ముఖమ్ముతో

మ్రొక్కు వారలను గాచెడి మూర్తి నృ సింహుడే

దిక్కులన్నియును నింపె సుదీర్ఘ  నఖమ్ములన్


4 అలసగతి న స న భ య 10 

కరయుగళి బట్టె ఘన గర్జనల తోడన్

నరహరి రిపున్ బలమున న్ దితి సుతుండున్

శరము గద నాయుధము శస్త్రములు వీడెన్

నరములను ద్రుంచి యరి నాశమొ నరించెన్


పైది మార్చండి 


5. సుగంధి, ర జ ర జ ర యతి 9


వేఱుమాటలేల ధీరవీరుడైన దేవుడౌ

నాఱసింహ గాథ విన్ననాశమౌను కష్టముల్

తీఱుగాను గొల్చినంత! తీరు దుష్ట పీడలున్

జాఱకుండ పట్టరండి సన్నుతించి స్వామినే 


గజేంద్ర మోక్షము

6. 176 151 రథోద్దతము (శాంతిక) 

ర న ర వ 7

ఆజి = యుద్ధము ఏజనము = కాంతి, చలనము

[ప్రాసాక్షర పద కోశము] 


రాజసాల కరి రాజు దీర్ఘ ఘో

రాజి మేని పస యంత నాశమై

యేజనమ్ముడుగ నేడ్చి నిర్బలుం

డై జగాధిపుని నార్తి వేడె తాన్


7. 45 134 మనోజ్ఞ న జ జ భ ర 10

ప్రాసాక్షర పద కోశము

పరములు = కనుబొమ్మలు, మురి = గర్వము 

శరణము వేడె రమేశుసాయము కోరుచున్ 

కరము పదమ్ములు డయ్యగన్ కడు దీనుడై

చెర విడిపించుమటంచు శీఘ్రమె రమ్మనెన్ 

గరువము దించెను రెండు కన్నుల మూయుచున్

8. 117 108 భూతిలకము 

భ భ ర స జ జ గ 12 

నాదను దంతయు శూన్యమే యని నమ్మినంతనె వచ్చునే

ఖేదము బాపెడి దైవమౌ హరి కీడుఁ ద్రోలును సృష్టిలో

నాదియు నంతము తానె యైన దయాంబుధుండగు ధీరుడున్

వేదము గొల్చెడి విష్ణువీతడుఁ వేగమే చనె చెంతకున్

9. నలిని వృత్తము, 5 స గణములూ, యతి 10వ అక్షరము. 

కరి దుస్థితి గాంచుచు చక్రము వేసెను యా

హరి యే మకరమ్మును తా హతమార్చగనే

చెర వీడినదై తరలెన్ సెరగుల్ కరుగన్

పరమేశుని వాక్కువలన్; పరమంది ౘనెన్ 

10. భూనుతము ర న భ భ గ గ 10 

తుచ్ఛమౌ తలపు లేవియు తోచని వాడౌ

స్వచ్ఛమైన మది గల్గిన బాలుని జూచి తా

నిచ్ఛ తోడ! ధృవుకై కడు హేలగ నిచ్చెన్

గుచ్ఛమై పరగు హస్తము గోరిన రీతిన్

11. 137 95 ప్రహర్షిణి మ న జ ర గ 8

అన్నా యాదుకొనెడునాప్త బంధువా ర

 మ్మ న్నీ నీవెననుచు నార్తి తోడ వేడన్

కన్నీరై కరగిన కంజ నేత్ర గాచన్

కన్నయ్యే కరుణను కాన్క చీరెలిచ్చెన్


12. 99 115 మందర భ న భ న భ న ర యతి 13

పాడి నొసగెడి గోవులను తన బాల్య మందున ను గాచెనే

కీడు సలిపెడి రక్కసులనిట కేళి వలెను జయించెనే

మూడడుగులకు చోటునడుగుచు భూమి గగనము నింపగన్

ఱేడు తదుపరి వంచె శిరమును! శ్రీ హరికిడిన మాటపై

13 కోకనదము భ భ భ స యతి 7

తామస నాశుడు! దైత్యుల దరిమెన్

మామగు కంసుని మత్సరమణచెన్

భామిని కుబ్జకు స్వస్థత నొసగెన్

సోముని పాలను జూచియు గెలిచెన్


14. మదన దర్పణ ఛందము

 భ స జ ర జ గ 11

వేదములను గాచె మత్స్య రూపియైన విష్ణువే

యీది జలము లందునద్రి హాయిగన్ వహించె తా

నాది పురుషుడైన యా వరాహ మూర్తి యొక్క యా

పాదములను కొల్చు వారి పాప రాశి నాశమౌ

15. నారాచ త, ర, వ, 

యతి లేదు

కాళింది లోతు నుండి పా

తాళమ్ము చెంతకంపె నా

వ్యాళున్ భుజంగరాజు నీ

కేళీ వినోది కృష్ణుడే

16. తన్వి  భ త న స భ భ న య 13 

దేవకి పుత్రా యదుకులమునకే దీపమువై వెలిగితివయ కృష్ణా

ఆవుల రక్షించితివి గిరి సునా యాసము గా నిలిచెను నఖమందున్

రేవున స్త్రీలందఱి వలువలఁ లే లేత కరమ్ముల గొనుచును దాచం  

గా వనితల్ చూచి భయమును పొందంగా నిను వేడుచు నడిగిరి! చీరల్

17. సుముఖి న జ జ ల గ 7 

విలవిల లాడు వియోగముతో

వలచిన యింతి వరించుటకై

తెలుపగ శ్రీపతి! వచ్చితివే

కలికిని పొందగ! రుక్మిణికై

18. ఇల స జ న న స 8 

కలశాబ్ధి పుత్రిక! కలికి! యగు సిరి తా

వలచెన్ సుభవ్య విభవములకు నెలవై

యలరారు దేవునిహరిని ముదముగనే

నిలిచెన్ రమాధవుని హృదిని స్థిరముగన్


19. జలోద్ధతగతి, జ, స, జ, స యతి 8

యశోద తనయా! దయార్ద్ర హృదయా

కిశోరుడవు నంద కృష్ణ! మది నీ

వశమ్ము సతతమ్ము! పాండవ సఖా

విశాల నయనా యభీష్ట వరదా


20.   53 సుకేసరము న జ భ జ ర 11

ధనరజతమ్ము స్వర్ణముల దాటు సంపదౌ

మునులు తపించు దృశ్యములు మోదమీయగన్

జనని యశోద గన్గొనెను సర్వ లోకముల్

మనసున మాయ కమ్మగనె మాయమాయెనే

No comments: