పద్య తరంగిణి లో వారానికి సరిపడా ఇవాళ
ఆదిగ వారము నడుపుౘు
తా దెసలన్నిటికి పంౘు ధారగ వెల్గుల్
వేదిక గగనము యనగన్
లేదే శూన్యతను మింౘు రేఖ యనుౘున్
ప్రాజ్ఞత గోరెడి భక్తుల
జిజ్ఞాసను గని యొసగుౘు శిక్షణ కపిలా
యజ్ఞానము దొలగింౘుౘు!
యాజ్ఞగ నడిపింౘుమ మము నద్భుత దెసకున్
పండిత! హనుమా! నీవే
యండగ నిలువని క్షణమున యసురులు గెలుౘున్
దండింౘుమ! వారల దయ
నుండుమ మా చెంత! తండ్రి! యుసురుల నిలుపన్
నారాయణ నీ నామము
ధారాళము ౘదువరాదు! తామస గుణముల్
నీ రాక తో నశింౘును
వారిజ లోచన! ప్రణతులు! భద్రతనిమ్మా
గురువులు తరువులు నరులకు
ధరణిన మరుగున పడిన సుధారస గుణముల్
కరుణను వరముగ నొసగుౘు!
దరి చేర్చును ముక్తి పథము దాక్షిణ్యముతో
సిరులకు నెలవట నగవులు
కురిపింౘు వదన! హరిసతి కోమల వల్లీ
పరిణతి నెఱుఁగని జనులను
కరుణను గాౘును విడువక! గారము ౘూపున్
లోకములేలెడి వాడక
యా కన్నుల కరుణ దప్ప యాజ్ఞలు రావే
మా కన్న తండ్రి యితడే
యీ కొండల వెలసెనంట! యేడను సంఖ్యన్
No comments:
Post a Comment