Friday, February 7, 2025

వ్యాస సంపుటి


1.  శ్రీ మాత్రే నమః 

మనకి చాలా ఊర్లు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఆయా ఊర్లకు సంబంధించిన, సంస్కృతి సంప్రదాయాల గురించి, విగ్రహ‌ ప్రతిష్టాపనల గురించి. 

మనకున్న ఎన్నో గుళ్ళల్లో చాలా గొప్ప వింతలు విశేషాలు ఉన్నాయి. ఆయా ఊర్లకు సంబంధించి చరిత్ర పుటల్లోనే ఒక గొప్ప వ్యక్తి కానీ, ఓ కళాకారుడో, ఒక నేతనో, ఓ క్రీడాకారుడు, ఓ మేధావి, ఓ ఆవిష్కర్త పుట్టి ఉండవచ్చు. 

వారు దేశానికీ, సమాజానికీ, శాస్త్ర రంగానికీ ఎంతో మేలుల చేసి ఉండవచ్చు.

ఎన్నో కీర్తి ప్రతిష్టలూ, పథకాలూ, అవార్డులూ, రివార్డులూ అందుకుని ఉండవచ్చు. వారు ఏ రంగంలోని వారైనా కావచ్చు. నిష్ణాతులై ఉండవచ్చు. 

అలాగే వారు గతానికి సంబంధించిన వారు కావచ్చు. వర్తమాన కాలానికి సంబంధించిన వారు కావచ్చు. కానీ వాళ్ళ గురించి ఆ ఊరిలోని వాళ్ళకి ఎంతమందికి తెలిసి ఉంటుంది, ముఖ్యంగా, ఈ తరం వాళ్ళకి?

ఒక వేళ ఆ విజేతలు గత కాలానికి చెందిన వారైతే, అలాగే ఈ కాలానికి చెందిన పిల్లలు కూడా చాలా మంది ఉండొచ్చు, మట్టిలో మాణిక్యాలు పేద కుటుంబంలో పుట్టి ఘనంగా ౘదువుకోవటము ఇంకా ఏదైనా శాస్త్రానికి సంబంధించి ఒక ఆవిష్కరణ చేయడం, ఓ గణిత సూత్రాన్ని పరిష్కరించడం వంటివి చేసి ఉండవచ్చు.

కానీ వారి గురించి చాలా తక్కువ మందికి తెలుస్తుంది. ఇక్కడ విషయం వారికి ప్రచారం లభించిందా, లేదా అన్నది కాదు, వారు మిగతా వారికి స్ఫూర్తిదాయకంగా నిలిస్తే, ఇంకా ఎంతో మంది అలా ఎదిగే అవకాశం ఉంటుంది.

లేదా వారు చేసిన ఆవిష్కరణలూ, చూపించిన పరిష్కారాలూ, మిత్రులకు మేలు చేయవచ్చు కదా! పాము కాటుకు గురవకుండా సాయం చేసే యంత్రాలు, రాత్రిపూట రైతులు ఇంటి వద్ద నుండే మోటర్ వేసే యంత్రాలు, నీళ్లు మహిళల కోసం తోడి పెట్టే యంత్రాలు, విద్యుత్ ఆదా చేసే పరికరాలు, వంటివన్నీ సమాజానికి ఉపయోగకరమైనవే కదా!

ఆ రకంగా అందరికీ ఈ గొప్ప వారి గురించి చెప్పే విధంగా మనం కృషి చేస్తూ ఉంటే, అది అవసరంలో ఉన్న వారికి ఉపయోగము, ఆవిష్కర్తలకు మరింత ప్రోత్సాహము ‌కదా!

కాబట్టి అటువంటి వారి గురించి మనం ఆయా ఊర్లలో ఎక్కువగా, విస్తృతంగా ప్రచారం కల్పిస్తూ ఉండాలి. దానికి మనకి ఎన్నో సాధనాలు ఉన్నాయి, ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటిని అవలంబిస్తూ ఉండవచ్చు. 

అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏ ఊర్లో చూసినా, గాంధీ, నెహ్రూల విగ్రహాలు, అంబేద్కర్ విగ్రహాలు ఉంటున్నాయి. అది తప్పు కాదు, కానీ, ఓ కరెంట్ ఆఫీస్ లో పని చేసే వ్యక్తికీ, కేబుల్ టీవీ ఆఫీసులో పనిచేసే వ్యక్తికీ అందఱితో పాటే శలవులు ఉండక పోవచ్చు. ఎందుకంటే, శనీ, ఆదివారాలు, పండగ సెలవులు రోౙుల్లోనే మిగతా ఉద్యోగస్తులు అందరూ వారి వారి ఇళ్ళల్లో మరమ్మత్తులనో, మఱోటనో పనులన్నీ వీళ్ళ చేత చేయించుకుంటారు కనుక.

చివరికి ఆగస్టు 15, జనవరి 26 వ తారీఖు కూడా ఆయా పనిముట్ల రంగాల వాళ్ళకి అధికారికంగా సెలవులు ఉన్నా, పనులు దొరికేది ఆ రోౙులలోనే గనుక, విరామమంటూ ఉండదు కదా మరి!

అటువంటి వారికి, అంబేద్కర్ తెలియకపోయినా వారి ఊరి వాళ్ళు అయితే తెలియాలి కదా! అదే ధర్మం కదా.

అందుకని, ఈ సదరు దేశ నేతలతో పాటు గానో, వారి విగ్రహాలకు బదులు గానో వారి ఊరి వ్యక్తుల లేదా వారి ఊరి పరిసర ప్రాంతాల వ్యక్తుల విగ్రహాలు పెడితే కదా, ప్రయోజనకరం. ముందు చెప్పుకున్న లక్ష్యాన్ని సాధించగలం.

ఆయా ఊర్లకు సంబంధించి పైన ప్రస్తావించుకున్నట్టు వారు ఎవరైతే గొప్పవారు ఉన్నారో వారి విగ్రహాలు లేదా వారికి సంబంధించిన సైన్ బోర్డులు పెట్టాలి. ఉదాహరణకు, కూచిపూడి అనే ఊరిని తీసుకుందాం. ఆ ఊరికి సంబంధించి, నాట్యం అనేది చాలా ప్రఖ్యాతి చెందిన విషయం ఎంతోమంది కళాకారులకు ఉపాధిని చూసేవారికి ఆనందాన్ని కలిగించే ఓ గొప్ప కళ. ఆ కళకి మూలపురుషుడు ఎవరో, వారిని చూడాలి. లేదా ఆ కళని బయటకు తీసుకురావడానికి మూల పురుషుడైన వారెవరో, విదేశాలలో చేత మన ఖ్యాతిని పెంపొందింపజేసిన ఘనులెవరో వారి పేర్లు లేదా వారికి సంబంధించిన విగ్రహాలు, కనీసం ముఖం వరకు పెడితే, ముఖం వరకు పెట్టినందుకు ఖర్చు తక్కువే అయినా, అంత మంచి విగ్రహాలు పెట్టినందుకు చాలా మేలు జరుగుతుంది కదా, జనాలకు వాళ్ళు ఎవరో తెలిసేదీ! గాంధీ గారూ, అంబేద్కర్లు మాత్రమే తెలిస్తే సరిపోదు కదా ప్రజలకి, మన కళలకీ, మన గొప్ప వారికీ మనమే గుర్తింపునీ, గౌరవాన్నీ ఇవ్వకపోతే, వేరే వాళ్ళు ఎలా ఇస్తారు? ఎక్కడో దేశాల్లో ఎవరెవరో సాధకులని, గొప్ప వారిని వారందరూ కీర్తించుకుంటున్నారు, మనకే చేతకాదు అని ఎంత సేపు మనం అనుకుంటూ ఉండటమా, మన వారిని విస్మరించటమా? ఇలాగైతే భవిష్యత్ తరాలకి మార్గదర్శకత్వం ఏమిటి? వారికి ఏంటి మనం ఇస్తున్న స్ఫూర్తి?


https://www.facebook.com/share/p/1JuZqAJFuq/








2.



#వ్యాససంపుటి 


2. శ్రీ రామ శ్రీ మాత్రే నమః 


ఈ వ్యాస సంపుటి ఆస్తికుల కోసం. నాస్తికులని నేను ఇక్కడ తప్పు పట్టట్లేదు దూరం జరపట్లేదు. సృష్టి స్థితిలో ఎవడైతే నడిపిస్తున్నాడో, మనం నిద్రపోతున్నప్పుడో, ఎవరైతే మన శ్వాసని ఆగకుండా కాపాడుతున్నారో, తల్లి గర్భంలో నుండి శిశువుని ఎవరైతే రక్షిస్తూ బయటకు తెస్తున్నారో, ఈ సమస్త సృష్టికి మూలకారమైన వారు ఎవరున్నారో, వారిని నుతిస్తూ చెబుతున్న మాట. 


"కలౌ స్మరణాన్ ముక్తిః" అన్నారు పెద్దలు. 


యుగధర్మం ఒక్క యుగానికి ఒక్కో విధంగా ఉంటుంది. దయ అనీ, దానమనీ, ధర్మమని ఇలా చెప్తూ ఉంటారు పెద్దలు. 


అంటే దేవుని సన్నిధి చేరుకోవడానికి సులువైన మార్గం ఏమిటి? 


ఎందుకు చేరుకోవాలి అనే దానికి ౙవాబు నేడు ఆవిష్కరింపబడుతున్న Quantum Theory అనే శాస్త్రంలో కూడా ఉంది. అందుకని ఆ అంశాన్ని నేను స్పృశింౘటము లేదు.


ఇక సూటిగా ఎలా చేరుకోవాలి అనే అంశంలోకి వచ్చేస్తున్నాను. 


ఇందుకు రెండు మెట్లు. 


1. చేస్తున్న పనిలో లీనం అయిపోతూ, "కర్తను" మాత్రం నేను కాదు అనుకుంటూ, "కర్మఫలం" పై ఆశ వదిలేస్తూ, ముందుకు సాగిపోవాలి. ఈ జీవన విధానంలో భాగంగా, ఎక్కడైనా అన్యాయం, అధర్మం వంటివి ౙరిగితే, చేతినేనంత వరకు నిలబడగలగాలి. అలాగే, రెండు చేతులు అర్థించి ప్రార్థిస్తే ఖచ్చితంగా "తధాత్మానం సృజామ్యహం, సంభవామి యుగేయుగే" అన్నట్లుగా దైవం తప్పకుండా మనల్ని రక్షిస్తుంది. ముందే చెప్పినట్లు, ఇవన్నీ దేవుని నమ్మే వారి కోసమే. ఇందులో "తర్కం ఏమిటీ", అంటారా, that is "Vibration". మన ౘుట్టూ ఉన్న "ఆరా"లో ఈ శక్తి తరంగాలు నిండి, విశ్వంతో మనని అనుసంధానించి, కోరుకున్నది జరిపించేందుకు బాటలు పరుస్తాయి. అది ధర్మబద్ధమైనదై, చిత్తశుద్ధి కలిగి ఉండాలి. అదీ విషయం. 


2. ఇక రెండవ మెట్టు, "నిరంతరము వీడని నామస్మరణ, సాధనమున పనులు సమకూరు ధర లోన". 

కనుక, తెలియని దారులు వెతుక్కుని అందులో నుంచి వెళ్లకుండా, ఇబ్బందులు పడకుండా, సులువైన విధానం నామ స్మరణం. 


ఎలా చేయాలి? ఎంత చేయాలి అంటారా దానికి హద్దులు ఉండవు కదా మరి. మనం ఒక్కసారి పిలిస్తేనే చుట్టూ ఉన్న వివిధ పాత్రధారులు పలుకుతూ ఉన్నప్పుడు అదే పదే పదే పిలిస్తే దైవం పలకదా మరి! 


ఒక చిన్న లెక్కతో మనం ఇది ఎలా చేయాలో తెలుసుకుందాం. 


లెక్క పెట్టుకుంటూనే 10 నిమిషాలకు ఒకసారి 10 సార్లు ఏదైనా నామం చదువుదాం. రామా అనో, శ్రీ మాతా అనో, లలితమ్మా అనో, చంద్రమా అనో, పది నిమిషాలకు ఒకసారి 10 మార్లు అన్నామంటే, రెండు గంటలు తిరిగేసరికి వందసార్లు అవుతుంది. వీలును బట్టి ఇలా 24 గంటలలో మనం మెలకువగా ఉండే 18 గంటలలో అవకాశాన్ని బట్టీ కనీసం అర్థ సహస్రం ఒక్క రోజుకి చేయగలిగితే నెల తిరిగేసరికి 1500 అవుతుంది. మనలా మరో 10 మంది కలిసి ఇలాగే చేస్తే 15000 అవుతుంది. అంటే వంద రోజులు తిరిగేసరికి మనమందరం కలిసి లక్ష పూర్తి చేస్తాం. కేవలం 10 మంది చాలు. మనకున్న వాట్సప్లోనో, మరో విధంగా సమూహంగా ఏర్పడి, counts పెట్టుకుంటూ పోతే, వంద రోజులు తిరిగేసరికి లక్ష సార్లు అవుతుంది. 


ఇలా ప్రతి 10 మంది కలిసి చేస్తూ పోతే ఎంత తొందరగా సంఖ్య కోట్లు దాటుతుంది చెప్పండి! 


భలే సులువుగా ఉంది కదా!


అప్పుడు మనం కోరుకున్న రామరాజ్యం వచ్చి మనందరి జీవితాలు బాగు పడిపోతాయి.


ఎవరో వచ్చి మనని బాగు చేయాలనుకోవడం కంటే మనకు మనమే బాగు చేసుకుంటాం. ఒకవేళ ఆ ఎవరో రావాలంటే, ఆ వచ్చేది, మన లాంటి వాడే అయితే, సామాన్య మానవులమే కదా మనమందరం మనలో ఒకడు వస్తాడా, ఆ వచ్చిన నాయకుడికి మద్దతు ఇద్దాం. లేక దైవమే వస్తుందేమో, పిలిచేద్దాం, ఏమంటారు?


["రామరాజ్యం" వస్తే, సంసారాలలో తగవులూ, విడి పోవటాలూ, అనారోగ్యం తో పడి పోవటాలూ, అధర్మం తో పోరాటాలూ, అందుతాయా లేదా కావలసినవి అంటూ ఆరాటాలూ, తల్లిదండ్రులను పిల్లలు అగౌరవించటాలూ, సరైన విద్య అబ్బక పోవటాలూ, పెద్దల ముందర పిల్లలు పడిపోవటాలూ ఉండవు. అందుకే ఆ ధ్యేయంతో స్మరణ మొదలుపెడదాం ఆ సంకల్ప సిద్ధిని కోరుకుంటూ చేద్దాం].


ప్రార్థన: ఇది నేను మతపరంగా చెప్పట్లేదు. ఆధ్యాత్మికంగా మాత్రమే మాట్లాడుతున్నాను. దయచేసి ఎటువంటి వివాదాలకూ తావీయవద్దు.



https://www.facebook.com/share/p/1E7S8f25XL/



3.


 


No comments: