Wednesday, February 19, 2025

శైలి - భలభద్ర పాత్రుని రమణి

 శైలి ని ఆడపిల్ల నడక తో పోల్చారు వీరేంద్రనాధ్ గారు..ఒక్కొక్కరి నడక ఒక్కొక్కలా వుంటుంది..ఎలా వున్నా అందంగా సౌకుమార్యంగానే వుండాలి తప్ప మాయా శశిరేఖ లా వుండకూడదు..నేను ఎవరు పుస్తకం ఇచ్చినా వెంటనే చదవడం మొదలు పెడతా..కొత్త రచయితలూ పాత రచయితలూ ప్రసిద్ధులూ అని లేదు..మొదలు పెడతా..చదివించడం రచయిత చెయ్యాలి..ఆ నడక రుచించక బోర్ గా నస గా మందకొడిగా లేదా వెకిలిగా అసభ్యంగా లేదా వారి ఇంట్లో ఊళ్లో మాట్లాడతారు కాబట్టి బాగా లేని, అర్ధం కాని పదాలు వాడుతూ వుంటే చదవబుద్ధి కాక వదిలేస్తా ..

    పేరు వచ్చి అసంఖ్యాకం గా పుస్తకాలు వేసుకున్న కొందరికి కుడా శైలి డెవలప్ అయి వుండక పోడం విచారకరం..అందుకే వారి రచనలు కొని చదవాలని అనుకోము..సింపుల్.

  కొమ్మూరి సాంబశివరావు గారి డిటెక్టీవ్ నవల ల లో సైతం ఒక వరవడీ శైలీ వుండబట్టే అవి ఇప్పటికీ విషయ ప్రధానమైన నవల లు అయినా మళ్లీ మళ్లీ చదువుతాం..

  శైలి అంటే అక్షరాల వెంట కళ్లు పరుగులు పెడ్తుంటే ఆపలేక పోవాలి..అన్నానికి కుడా పో బుద్ధి కాక పుస్తకం పట్టుకునే వుండేట్లు రాయగలగడం..అందులో ఓ లయ,శృతి,జతి ,ఒరవడి ఇవన్నీ వుండాలి..అందరికీ రాదు కొందరికే భారతీ దేవి ఆ వరం ఇస్తుంది..కానీ అందరికీ రావలసింది నిజాయితీ..చెప్పే విషయం పట్ల అవగాహనా సూటిగా మన మనసుకి తాకేట్లు చెప్పి మనని అంటే, పాఠకులని కన్వీన్స్ చెయ్యగలడం..ఇది కుడా లేకుండా తెలీని విషయాల గురించి అసహజం గా రాస్తుంటారు..సిన్సియారిటీ లోపిస్తే పాఠకులకి ఇంట్రెస్ట్ వుండదు..

  చాలా మంది విమర్శించే రచయిత్రి రంగనాయకమ్మ గారికి శైలి ఆవడకి దేవుడిచ్చిన వరం.. ఆవిడ ఆయన్ని నమ్మకపోయినా!..స్వీట్ హోం జానకి విముక్తీ ఎన్ని సార్లు అయినా చదవగలను..శైలి కోసం..

  యద్దనపూడి సులోచనా రాణి గారి ఆయుధం అందమైన శైలి..ఊపేసారు మధ్యతరగతి పాఠకులను.😍.వీరేంద్రనాధ్ గారు శైలి గురించి చాలా జాగ్రత్త తీసుకుంటారు..ఆయన ఏం రాసినా నమ్ముతాం..మల్లాది గారు సూటిగా నిక్కచ్చిగా సిన్సియారిటీ తో రాస్తారు..కధనం ఎంత వేగంగా వుంటుందీ అంటే మనం పేజీలు తిప్పడం బుక్ అయ్యేదాకా మానలేం..అనువాదాల లో కుడా ఆ జడి అందం గమకం మనం చక్రపాణి గారు అనువదించిన శరత్ నవల లో భిభూతి భూషణ్ గారి నవలలు అనువదించిన సూరంపూడి విశ్వం గారూ కాత్యాయిని గారిల నవల లో చూస్తాం..వారు అనువాదం లా కాక స్వంత అనుభూతుల లా అవి వుంటాయి.

  అక్షరాలు విసర్జించ కూడదు..సృజించాలి..

  మంచి శైలి కి ఉదాహరణ గా చలం గారిని చెప్పుకోవాలి..ఆయన భావజాలం, స్వీయ జీవితం నాకు నచ్చకపోయినా..ఆయన నాలుగు వాక్యాలు తో కట్టేస్తారు..కొబ్బరి నీళ్ల లాంటి స్వచ్ఛత తీపిదనం మనని మెస్మరైజ్ చేసి చివరంటా చదివిస్తాయి..ముళ్లపూడి వెంకట రమణ గారు తెలుగు సాహిత్యం లో శైలి మీద వేసిన ముద్ర ఎవరూ మరిచిపోలేనిది..🙏

  విశ్వనాధ గారిని అర్ధం చేసుకున్న పాఠకులకి ఆయన శైలిలో వేగం తెలుస్తుంది..ఆయన చూడని లండన్ నగరం వర్ణన ఎంత మనోహరంగా చేసి మనని ఒప్పించారో అని ఆశ్చర్యం వేస్తుంది..గ్రాంధికం గా వుండటం వల్ల ఈ తరం పాఠకులకు దూరం అయ్యారేమో🙏🙏..రావి శాస్త్రి గారూ నామినీ సుభ్రమణ్యం గార్ల లా మాండలీకం రాయగలిగితే పసందుగా వుంటుంది..కానీ పట్టు లేనిదే మాండలీకం ముట్టుకోరాదు🤫 

  ఇంకా గొప్ప గొప్ప వారు అనేకులున్నా కొంతమంది గురించే ప్ర స్తావించాను..లేకపోతే వంద పేర్లకి తక్కువ రాయలేను..

  మా నవలలూ కధలూ ఎందుకు పాత రచయితల పుస్తకాల లా మలి ముద్రణ లు అయి అమ్ముడు పోవడం లేదూ అన్న సందేహాలకు జవాబు ..విషయం బాగున్నా పాఠకుడిని ఆకట్టుకో లేక పోవడం..బారిస్టర్ పార్వతీశం..వేయి పడగలూ స్వీట్ హోం హౌస్ సర్జన్ శరత్ సాహిత్యం మళ్లీ మళ్లీ వేస్తూనే వున్నారు..మీరు చూస్తున్నారు..కొనండి అనే ప్రచారం ప్రాధేయ పడడం అక్కరలేదు..

   శైలి గురించి డెఫినెషన్ చెప్పలేం..its abstract..అయినా కొంత ప్రయత్నించాను చెప్పడానికి..నేను రాసేవి గొప్ప రచనలు కాక పోవచ్చు కానీ నా అభిమానులు కాలం దాటని కబుర్ల లో హాస్యం చదివినా ఆలింగనం..సడి సేయకో గాలి లో తీవ్రత కి స్పందించినా రేపల్లె లో రాధ లో ప్రేమ ని మెచ్చుకున్నా నా శైలి గురించే మాట్లాడతారు..మా గురువులు అలాంటివారు..మేము సాహిత్యం బాగా  విరివిగా చదవడం..వర్క్ షాప్స్ కి కుడా వెళ్లడం సాటి రచయితలతో పెద్దలతో గంటల తరబడి సాహితీ గోష్ఠి లు చేయడం ఇవన్నీ పనికొచ్చాయి..నవల 6 వెర్షన్లు కుడా రాసిన రోజులున్నాయి మొదట్లో..

  రాసేకా నాలుగు సార్లు చదివి నగిషీలు దిద్ద లేని వారు టయిం లేని వారు ఓపిక లేని వారు తప్పులు దిద్దుకోలేని వారు రాయకండి..అంతే!

  ఓ రచయిత్రి మొదటి పేజీలో పెట్టిన కథానాయిక పేరు చివరి పేజీలో మారిపోయింది..చెప్తే చదవడానికి టైంలేకపోయింది పంపేసా అంది..ఇంకో సీనియర్ రచయిత్రి తల్లి పేరు అలేఖ్య కూతురి పేరు మంగతాయారు అని పెట్టింది..చదువుతుంటే ఊహకి రాక అడిగితే మా ఊళ్లో వుండేవారు అంది..ఇంకొకావిడ శృంగారం అనుకుని సున్నితత్వం లేని అశ్లీలం రాసేది..ఎక్కువగా స్వాతి మధ్య పేజీల లో..ఇలాంటి కధలు వచ్చేవి..నవలంతా చదవడం ఇబ్బంది..ప్రధమ పురుషలో మొదలు పెట్టి తృతిీయ పురుషలో ముగించిన రచయిత్రిని ఆ వెబ్ మాగ్జైన్ సంపాదకుడు కుడా వెనకేసుకొచ్చాడు..కొత్త రకం రచనలు అని!!!అంటే నా పేరు లత అని మొదలు పెట్టి సడెన్ గా లత సముద్రం కేసి నడవసాగింది..అని ముగించడం.

 శైలి మీద కృషి చెయ్యండి.ఎవరినీ అడగాల్సిన పని వుండదు మా పుస్తకం కొనండి చదవండి అని..

  ముందు మాటలు నేను రాయను..బుక్ అవిష్కార్ లకి వెళ్లను..నచ్చని పుస్తకం బలవంతంగా పొగడను..అందులో తప్పులు చెప్తే కొందరు  శతృవులయ్యారు కుడా..

  అడగకపోయినా నచ్చిన పుస్తకం గురించి మంచి రెవ్యూలు రాస్తాను..ఆ రచయితలు ఎవరో తెలీక పోయినా..ఉదాహరణ ఇటీవల శ్రీదేవీ మురళీధర్ గారు రాసిన స్వయంసిద్ధ..ఆటో బయోగ్రఫీలూ నాన్ ఫిక్షన్ లూ రాసేవాళ్లు విషయ సేకరణ మాత్రమే కాదు శైలి మీద దృష్టి పెట్టాలి..నేను శైలి గురించి ఇప్పటికీ కృషి చేస్తాను.

 ..  సెలవు ఇప్పటికి🙏

   బలభద్రపాత్రుని రమణి.

No comments: