Tuesday, June 22, 2021

కంద పద్యములు

 

కలువ నివాసిని జననీ
ఫలముల నొసగుమ హిమసుత! భయనాశనివే
చలిమల పట్టియని మదిని
దలచిన పలికెడి వరప్రదాయిని! ప్రణతుల్


పతినే దైవమనెడి భా
రత నారిని దుఃఖ పెట్టు రాక్షస గుణముల్
సతతము యుండిన భర్తకు
సతతము సంతసమొసంగు సతితో గొడవల్

కన్నకు బెట్టెద కమ్మగ

యన్నము చంద్రుని గగనము నందున గనుచున్
యన్నుల మిన్నగు సుతునకు
యున్నతి నొసగును జననిడు యోరిమి! గనగన్
కందం
దండమిడుదునయ యండయు
దండయు నీవైన రామ! దాశరథీ! కో
దండము కరాబ్జ సొబగుల
దండనలంకరణ సేతు తాటకి నాశా

కందం
వినడుగ మొఱలను శుంభుఁడు
ఘనకీర్తి కొఱకు కపర్థి గరళము మ్రింగెన్
జన సేమముకై కాదట
మన రక్షణ సేయడెపుడు మహితాత్మ

సప్త స్వరాలతో క్రింది కందము

కందం
నీనామమునే గానము
పానము సేసెదను నేను పామరుఁ నైనన్
మానని పాపము నాదని
రానని మారామమొద్దు! రామా రామా

పసివాని జేసి యందరు

కసిగా నాపై బలికిరి కల్పనలు కధల్

యుసిగొలిపిరి నిను నాపై

మసి పూసిరి జనని! నే యమాయకుని గదా

కందం
విద్యలనొసగే దేవా
పద్యమ్మిదియే గణేశ! ప్రమథా నాథా
హృద్యమగు నీదు గాధలు
నుద్యమముగ సదువుచునిను నుడివెద! ప్రాజ్ఞా
గ,ణ,ప,తి నిషిద్థాక్షరి, గణపతి స్తుతి

కందం
హిమజ కుమారుడ! నందీ
ప్రమథ గణములు గొలిచిన శివానందకరా
నమములు విద్యకు యొజ్జవు
దమనుల దరుముట కొఱకును దయ సేయుమయా

విద్యలనొసగే దేవా
పద్యమ్మిదియే గణేశ! పార్వతి తనయా
హృద్యమగు నీదు గాథల
నుద్యమముగ జదివెద! గృప నున్నతి నిమ్మా
తోడొకరుండిన బ్రతుకులు
వేడుక యౌనని తనయకు ప్రియముగ దెల్పెన్
వాడన పెద్దలు వారికి
కోడలివని పల్కెనొకఁడు గూతురితోడన్
--------
కాలికి వేలికి తెలివిగ
గాలము వేయుచు సవాలుగ విషపు జీవిన్
హేలగ బట్టుచు బొమ్మగు
తేలును ముద్దాదెడి బడతిన్ మెచ్చదగున్
-------
కందం
చీకట్లను వదలకనే
నీకన్నులు మూసికున్న నిజయోగివయా
నీకరుణకై తపిస్తిమి
యీ కాష్ఠముదరమవేల యీశుని తనయా
కందం
క్షీరాబ్ధి తనయ! లక్ష్మీ
నారాయణ మన విహారి! నా మనమందున్
ధారగ నుతింతు సతతము
నారద వంద్యా మధుర వననిలయ! జననీ

కందం
శిరమున నెమలిక ధారీ
వరమ్ము లొసగుమిట లోక బాంధవ! క్రీడీ!
గిరధర! కొలువ తరమ నిను
కరమున శరములు తొడగని గడసరి దేవా

సరసిజ లోచని సన్నిధి
పరిపరి వేడుచు తపమున బడసెద వేరౌ
వరముల నేమియు మనమున
హరిసతి పెన్నిధి దొఱకిన యానందమదే

సరసిజ లోచని సన్నిధి
కొరకునుఁ జేసెద తపమునుఁ! గోరను వేరౌ
వరముల నేమియు మనమున
హరిసతి పెన్నిధి దొఱకిన యానందమదే

కంద పద్యము


కందం
రామా రామా యనుమా
నామమె రక్ష యనెఱిఁగి ప్రణతుల నొసగుమా
వామాంకమ్మున జానకి
నీ మొర తెలుపుచు నభయము నిచ్చును గనుమా
కందం
కరుణించుమయా మమ్ముల
కరోన రక్కసిని దరిమి కాపాడుమయా
సురముని వందిత దేవర
పరమదయాకర! నృసింహ! పన్నగ శయనా

No comments: