గణతంత్ర దినోత్సవ కవితల పోటీకి:
28.01.2024 మంగళవారము
ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి [నాగిని] హైదరాబాద్
ఈ పద్యములు పూర్తిగా నా స్వీయ సృజన, దేనికీ అనుకరణ కాదు, అనుసరణా కాదు, ఎవఱినీ కించపరౘటానికి వ్రాసినది కాదు, ఎక్కడా ప్రచురణకు కానీ, పరిశీలనకు కానీ పంపబడలేదు అని హామీ ఇస్తున్నాను.
*పద్యములు:*
మేదురదన్త వృత్తము, చతుష్పాదము, సప్రాస, 5వ గణాద్యక్షరము యతి స్థానము, 8 భ గణములు.
కాలము చెల్లెను రాౙుల పాలన గానగ రాదిల దేశపు భాగ్యము
మేలును దాగెను చిత్తము శుద్ధిగ మింటి సమమ్ముగ నుండెడి చేతిన
వాలు జయంబులు ముంగిట భావి తరంబుకు స్ఫూర్తి విరాజిలి
బేల తనంబసలుండదు ప్రీతిగ రాజ్యపుటమ్మును నేర్చిన
ఏడు దశాబ్దములైనను
వేడుక మానక నడచిన విజయమదగునా
కీడును దరిమిన నేతల
ౙాడన సాగుట మన విధి! స్వస్థత కలుగున్.
మార్చుచు పాత విధంబులు
నేర్చి వినూత్నపు సరళులు నేతలమైనన్
గూర్చును జయమా విధియే
చేర్చుమ యావిష్కరణలు శిశువుల కొఱకున్.
వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము
19.04.2024 ఆదివారము
సంక్రాంతి పై పద్యముల పోటీకి
ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్
ఈ పద్యములు నా స్వీయ సృజన, ఎక్కడా ప్రచురణకు కానీ, పరిశీలనకు కానీ పంపబడలేదు అని హామీ ఇస్తున్నాను.
*వాణీ: ర న భ భ ర వ యతి 13*
ఆకశాన నడయాడెడి దేవతలార! భూమి పై
మీకు మోదమును పంౘుట కోసము మేము చేయు యీ
సోకులన్ని గని దీవెనలీయరె! జ్యోతులైన మీ
రాకకై యిౘట ౘూచెడి లోకుల రక్ష సేయరే.
*అంబా: భ భ ర వ; యతి 7*
ముంగిట ౘక్కటి ముగ్గు లద్దియా
ఛెంగున యాడెడి యాడపిల్లలే
నింగిని దేవత నిండు రూపమై
పొంగలి పండుగ ముందు నిల్పునే.
*నాగర: భ ర వ, యతి లేదు.*
మంటలు భోగి రోౙునే
వంటలు యన్ని వేళలూ
పంటల పుణ్యమా యనే
యింటన సందడే సదా.
*ధరధన్వితాళ: ర న, యతి లేదు.*
గాలిలోన
తేలుచుండు
బాలలాడు
యాలయాలు
*సీసము:*
గాలిపటాలేగ గగనసీమను చేరి
బ్రతుకు విలువ తెలుపగలవు మఱి
నేల పైనను ముగ్గు నింగిన పటములు
ఉదయము మంటలు హృదిన వేడి
బొమ్మలు వంటన పులుసులు తరువాత
భోగి పండ్లు భళిగ మొదటి రోౙు
పొంగలి కూరలు మురిపెములన్నియు
సంక్రాంతి నాడు ప్రసారములుగ
తేటగీతి:
కనుమ నాడు తర్పణములు మినుములంటు
కాకి కూడ కదలదుగ! గంగిరెద్దు
తోటి హరిదాసులు తిరుగు మేటి కళగ
విరిసి వెలుగు పండుగ గద! సిరులు చిలుకు.
*కర్నూలు జిల్లా కవితా సంకలనం కోసం*
అంశము: *సామాజిక అభ్యుదయము*
28.01.2025 మంగళవారము
ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్
ఈ పద్యములు పూర్తిగా నా స్వీయ సృజన, దేనికీ అనుకరణ కాదు, అనుసరణా కాదు, ఎవఱినీ కించపరౘటానికి వ్రాసినది కాదు, ఎక్కడా ప్రచురణకు కానీ, పరిశీలనకు కానీ పంపబడలేదు అని హామీ ఇస్తున్నాను.
ఉత్సాహము: 7 సూర్య గణముల పై ఓ గురువు, చతుష్పాదము, సప్రాస, 5వ గణాద్యక్షరము యతి స్థానము.
1.
కల్లకపటమెఱుఁగనట్టి కలిమి బాలలమది యే
యెల్లలుండనట్టి పేర్మి యింట పంౘుౘుందురే
ౘల్లదనము గాక కుళ్ళు జ్వాల నింప వలదవే
పల్లమునకు నడిపి ముంౘు భావికాలమందునన్.
2. ఉత్సాహము:
స్వార్థగుణము మొదటనుండు బాగుగానె గాని యే
యర్థమొందబోదు భవితనందు ముంచి మ్రింగునే
వ్యర్థమౌ తలపులు కుట్ర వంచనలు మదముయు యీ
స్పర్థలన్ని దీసి మంచి వర్తనమును నడువుమా
3. ఆట వెలఁది
తుదకు నేమి వెంట తోడ్కొని పోముగా
ధాత్రి నున్న వేళ తగవులేల
కలిమదెంత యున్న కలకాలమందదే
స్వార్థగుణము మేల!? వదులమండి.
*జాతీయ తెలుగు పరిరక్షణ సమితి*
*విశ్వవసు ఉగాది కవితల పోటీ కొరకు*
అంశము: *నేటి తెలుగు భాష స్థితి గతులు*
ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్
ఈ పద్యములు పూర్తిగా నా స్వీయ సృజన అని హామీ ఇస్తున్నాను.
*పద్యములు:*
1. *కందము*
జీవన విధములు తెలిపెడి
నావకు చుక్కాని వంటి నానుడులేవీ
రావయె నేటి తరమునకు
భావము పదమే యెరుగరు భాషయు మరుగే.
*ఆట వెలఁది*:
2.
నాటి సూక్తులన్ని మేటి నడిపి మన
బ్రతుకు బంధములను పట్టు విడుపు
పండుగలన వలయు పద్ధతులన్నియున్
తెలియ జేయు; నేడు పలుకరెవరు.
3.
భుక్తి రుచులు గాని యుక్తికి మూలమౌ
ధాన్యపు సిరి విలువ శూన్యమాయె
భాష నందు గాని బ్రతికెడి రీతిన
గాని తెలుగు వెలుగు కానరాదు.
4.
భావ గర్భితములు పద్యములన్ని యా
నవరసముల నిధులు కవనములును
స్ఫూర్తినొసగు గాని ప్రోత్సహింౘవు యిలన్
దుష్ట బుద్ధి; వలదు ద్రోహమనును.
5.
యుద్ధ కాంక్ష గాక నుర్వి హితము గూర్చు
చర్యలన్ని నేర్పి జైత్ర యాత్ర
వైపు గమన విధము పాఠముగ దెలుపు
శ్లోకశనిధులు గలవు! చూడరండి.
6.
గీత భాగవతము కృష్ణ రాయల వారి
భక్తి గాథలన్ని పద్యములుగ
రక్షనొసగు గాని రారు నేటి యువత
వాని నేర్చుకొనగ! పాతశయనుచు.
7.
పశ్చిమాద్రి గాంచి భానోదయములన్ని
విడచి వ్యథల పడుచు కడకు బ్రతుకు
దుఃఖభరితమవగ దోసిలిన ముఖము
దాచుకొనుచు యేడ్చు తరము నిదియె.
8.
గొప్ప కవుల సేవ గుర్తించు కనులేవి
భరత జాతి దాటి బయటనున్న
వారు నయము సేవ బాగ సేయుచునుండె
తెలిసి తెనుఁగు భాషతీయదనము.
సాహితీ చైతన్య కిరణాలు సమూహము కొఱకు
అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామికి ప్రణతులిడుతూ...
30.01.2025 గురువారము
ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి [నాగిని] హైదరాబాద్.
9963998955.
1.
తేటగీతి
నీలి మేఘమాలికలేమొ నిండె రంగు
తెల్ల దనము కారణము యాదిత్యుడుండె
తల్లి తాటంకముగ గాన ధగధగలను
గగన సీమ గాంచెను చిరు నగవుతోడ.
2.
సూర్య మండల సంస్థిత శోభనాంగి
లక్ష్మి భాను మండల వాసి భ్రమర పూజ్య
వీరి సఖియ వాణి రథము బృందమవగ
కాంతివంత యాదిత్య నీ కళలు మెండు.
3.
భువిని మేలు చేయు పుణ్య నదుల నీరు
త్రావకుండ వదలి లవణమున్న
యబ్ధి గణన మాకు నంద జేసిన ౘాలు
కృపను ౘూపుమయ్య నృపుల పూజ్య
4.
కర్మసాక్షి వైన కాచి మా దోషముల్
మంచి బుద్ధి నొసగి మలినములను
తొలగ చేసినంత తూర్పున యున్న నీ
దయను యెఱిగి జనులు ధైర్యమందు.
ఈ పద్యములు పూర్తిగా నా స్వీయ సృజన, దేనికీ అనుకరణ కాదు, అనుసరణా కాదు, ఎక్కడా ప్రచురణకు కానీ, పరిశీలనకు కానీ పంపబడలేదు అని హామీ ఇస్తున్నాను.
#######################################
విజయభావన సాహితీ మిత్ర సమాఖ్య, విజయనగరము వారి
శ్రీ విశ్వావసు నామ ఉగాది పండుగ రాష్ట్ర స్థాయి పద్య రచనల పోటీకి:
ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్
ఈ పద్యములు పూర్తిగా నా స్వీయ సృజన. దేనికీ అనుకరణ కాదు, అనుసరణా కాదు, ఎవఱినీ కించపరౘటానికి వ్రాసినది కాదు, ఎక్కడా ప్రచురణకు కానీ, పరిశీలనకు కానీ పంపబడలేదు అని హామీ ఇస్తున్నాను.
1. స్వాగత వృత్తము, ర న భ గ గ గణములు, యతి 3 వ గణాద్యక్షరము
స్ఫూర్తివంతులుగ ముందుకు రారే
కర్తలై నడిపి కార్యములన్నీ
యార్తి చేయుచు ప్రయాస లేకన్
పూర్తిగా సలిపి మోదమునీరే
2. ద్రుత విలంబితము:-- న, భ, భ, ర. యతి 7వ అక్షరము.
మనసు పెట్టుటె మంత్రము బాటనన్
తనువు శక్తికి ధామము నిల్పి భూ
వనము నింపరె పూవులు పండ్లతో
కనుల నిండుగ గర్వము పొంగగా.
3. ద్రుత విలంబితము:-- న, భ, భ, ర. యతి 7వ అక్షరము.
పణము వద్దని ప్రాణము నెప్పుడున్
రణము మాన్పరె రక్షణ సేయరే
తృణముయున్నను తృప్తిగ సాగినన్
మణులు దక్కును మంగళమే ధరన్.
4. అంబురుహ:--భ భ, భ భ, ర స వ .యతి మైత్రి 13
విద్య వివేకము నేర్చుచు నందు ప్రవీణ్యమందిన మేలగున్
సేద్యము వీడక పంటల మెండుగ సృష్టి చేసిన దండి నై
వేద్యము వేరుగ పెట్టగనేల సుభిక్షమవ్వగ నేల యే
వాద్యము చెప్పగ లేదు వసంతపు పాటలన్ తమ నోటితో.
5.
వంశస్థ:-- జ, త, జ, ర . యతి 8వ అక్షరము.
ప్రమాణమున్ చేయరె! బాట నందు యే
ప్రమాదమున్నన్ తగు భద్రతందియే
ప్రమోదమౌ గమ్యము వైపు యానమున్
ప్రమత్తతన్ సాగిన భాగ్యమౌననిన్.
6. ఇంద్ర వంశ:-- త,త, జ, ర యతి 8వ అక్షరము.
మద్యంబు త్రావంగ ప్రమాదమేగదా
యుద్యోగమే యున్న ప్రయోజనంబగున్
విద్యార్థి యైశ్వర్యము విత్తు మూలమే
పద్యాన సందేశము పట్టి మారుమా.
7. పాదప వృత్తము(తోవక):-- భ భ భ గ గ యతి 7వ అక్షరము.
మాదక ద్రవ్యము మత్తు విపత్తే
వాదనలేలన వద్దనరండీ
చేదుగ నున్నను శ్రేయము గూర్చే
వేదము వంటిది విద్యయె చాలున్.
8. సుగంధి వృత్తము 7 హ గణములు పైన గురువు యతి స్థానము 9వ అక్షరము.
మత్సరంబు స్థానమందు మంచి యన్న మాటనే
కుత్సితంబు లేక తీపి గుర్తుగాను ధాత్రితో
వత్సయన్న మేటిదైన బంధమున్న చాలుగా
వత్సరంబు మారినట్లు వార్ధి మారదెన్నడున్.
9. రతోద్ధత:--ర, న, ర, వ. యతి 7వ అక్షరము.
ఆకలన్న యపుడారగించుమా
లేకి యాశ మది రెక్క ద్రుంౘునే
నాకమన్న యది న్యాయ బుద్ధియే
ప్రాకబోకు యతి పైకమందగన్.
10. ఉపేంద్ర వృత్తము - జ, త, జ, గ, గ గణములు యతి 8వ అక్షరము.
ప్రయోగశాలల్ మన వాసమై
ప్రయోజనాలే తగు లక్ష్యమై
ప్రయత్నమే చేసిన పండునే
ప్రయాణమందున్ మరి పంటలే.
11. తరలి వృత్తము:-- భ న న జ న ర యతి11
పెద్దల పలుకులె మనకు పెన్నిధి తగు రీతినన్
హద్దుగ మసలుచు ననునయంబుగ మరి సాగుచూ
యొద్దికగ నడచిన భవితోన్నతమగు నేర్చినన్
విద్దెను యనుభవము గల వీరి సరసనన్ భళా.
12. పంచచామరము: జ ర జ ర జ గ యతి 10వ అక్షరము.
నిరాశవీడి సాగనట్టి నింద యున్న వేదనన్
నిరంతరమ్ము మోయనేల నిత్య మల్లి మీరెగా
నిరీక్షణంటు చేసినంత నిప్పు గూడ యారునే
నిరామయంబగున్ ధరన్ ప్రణీతమౌను యానమే.
##############################££££#####£
మహా కుంభమేళా పోటీలకు:
ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్
ఈ పద్యములు పూర్తిగా నా స్వీయ సృజన, దేనికీ అనుకరణ కాదు, అనుసరణా కాదు, ఎవఱినీ కించపరౘటానికి వ్రాసినది కాదు, ఎక్కడా ప్రచురణకు కానీ, పరిశీలనకు కానీ పంపబడలేదు అని హామీ ఇస్తున్నాను.
శంభుని దయకై సాగుౘు
కుంభము నందున మునుగుట కొరకై యేగెన్
డంభము నెరుగని జనులే
గంభీరముతో నదులు సగౌరవమందెన్.
నూరేండ్లకు పైబడెనే
యీ రీతిగ కుంభము మన యిల చేరుటకై
ధారగ నీరే పారగ
తారకలే గాంచె దృశ్య ధామము ప్రియమున్.
మూడు నదులలోన మునక యొక్క పరియె
ౙరుగ జలధి కరుణ యుర్వి చేరె
వేరు వరములేల ప్రియమార యంజలి
దెలుపుకున్న ౘాలు! తీరు ఋణము.
వాగ్దేవి సాహితీ వేదిక కొఱకు
నానీల పోటీలకు
06.02.2025 గురువారము
1.
శలవుల కోసం
ౘూడదు పడతి
విరామమెరుగని
భూమే ఆమె కద
2.
తూరుపు
గడియారము
గంట కొట్టె
పడతి మెలకువ చూసి
3.
ధనము నవ్వింది
బిడ్డను కాదని
డబ్బును కొలిచే
మగడిని ౘూసి
4.
అంతరిక్షమే
తిరిగి పంపినా
అతివను
రానీయరేలా
5.
కూడును పెట్టిన
చేయి నరికే
నరులకె రోౙులు
పాపం పండే వరకే.
సాహితీ చైతన్య కిరణాలు సమూహము కొరక
18.02.2025 మంగళవారము
అంశము: తెలుగు భాష
[అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా]
ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి [నాగిని] హైదరాబాద్
సీసము:
ఇతర భాషలలోకి యిముడుౘూ మార్పులన్
సుళువుగ నందెడి జ్యోతి తెనుఁగు
యిలను మురిపెముతో యింపుగా తిరుగాడు
మువ్వల సవ్వడి ముగ్ధ పరుగు
విడువ వలదు మాతృగడపను పలుకును
వృద్ధికదియె చెట్టు 🌲 వేరు నరుడ!
అందరు మెచ్చిన సుందరమైనది
వర్ణింౘనలవియ! పదములందు
ఆట వెలది:
పాలరాయి వంటి ప్రసన్నత గలిగి
వసుధ యంత ఖ్యాతి పట్టినట్టి
యందమైన భాష యాంధ్రులకే దక్కె!
అౘ్చు
తోడి ముగియు యద్భుతంబు.
Murthy Garu WhatsApp 9704867867
నమస్కారం అండీ, ద్విపదల సంకలానికి నా సమర్పణము:
28.02.2025 శుక్రవారము
ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి [నాగిని] హైదరాబాద్
ఈ ద్విపదలు నా స్వీయ సృజన, దేనికీ అనుకరణ కాదు, అనుసరణా కాదు, ఎవఱినీ కించపరౘటానికి వ్రాసినది కాదు, ఎక్కడా ప్రచురణకు కానీ, పరిశీలనకు కానీ పంపబడలేదు అని హామీ ఇస్తున్నాను.
*ద్విపదలు:*
1.
సత్యసంధత గాని స్వచ్ఛత యైన
నిత్యముంచరు మది నిజమే యెరుగరు
2.
ముసుగుతో సులువుగా మోసమే చేసి
యసలు రూపంబు ప్రయాసతో దాచి
3.
మనసను సాక్షిని మరుగున వేసి
మనుగడ సాగించు మనిషియె విషము
4.
పక్షపాతము ద్వంద్వ వైఖరి వంటి
లక్షణములతో విరాజిల్లుచుండు
5.
స్వార్థపరులతోడ సంసారమైన
వ్యర్థమే యైననూ వదలగలేము
6.
నదులను మార్చక నరకముగ పలు
చెదల పూరితమగు చెత్త పేర్చకుమ
7.
తరువులు నిధులు స్వార్థ పరుల వలన
కరుగుచు నుంటివి కాపాడ వలెను
8.
స్వస్థత కోసము స్వచ్ఛమౌ తలపు
దుస్థితి బాపు వ్యవస్థను మార్చు
9.
మంచితనంబును మనుజులలోన
యెంచిన గనమే సహించుటె దారి.
10.
తపములెన్నియు నున్న దాటగ వశమె
అపమృత్యువును విధి యాట యిది గద!
No comments:
Post a Comment