Wednesday, September 22, 2021

On A.S. Rao Gaaru

 1.


అయ్య వారి నింట అణువు బ్రహ్మ జనించె

అచ్చ తెనుఁగు బిడ్డ! అమిత జ్ఞాని

వందనంబు లిడరె ప్రజల కొఱకు పాటు

పడిన నాయకునకు! పౌరులార!


2.



తెనుఁగు జాతి కీర్తి దేశమంతయు చాటి

అణువు శక్తి తోడ నవసరముల

దీర్చి మేలు జేసితివి జనులకు నెల్ల

సాంబశివుడ నీదు శక్తి ఘనము


3.


కాంతి కిరణములను కల్ప తఱువు వోలె

జనులకు నొసగేను శాస్త్ర వేత్త 

మఱువ వలదు వారి మంచి గుణములను!

ప్రణతులిడరె భరత ప్రజలు! మీరు



4.


కనివిని యెఱుఁగని రీతిన

జనులకు హితమగు సరళిన సాంకేతితతో

కనుగొని కాంతిని వెలుగుల

మనముల నింపిన శివుడకు మంగళమనరే


5.


యిలను తఱచి జూడ నెందరో మనుజులు

పరుల హితము కోరు వారు కరవు

వెన్ను పోటు కైన వెఱవకుండ నిలచి!

జనుల గాచెనితడు! సాంబశివుడు


6.


సాంబశివుండు సజ్జనుఁడు! శాస్త్రము లెన్నియొ నేర్చికూడ యే

డంబము లేని యుత్తముడు! డబ్బును డాబును గోఱలేదు తా

నంబరమంటి నేత! తన యక్షర విద్యను సత్యసంధుఁడై

కంబము నూది బంచెనని గౌరవ రీతిన సత్కరించరే


కంబము = శంఖము


7 వ పద్యము


భరత జాతి నందు విరిసిన పద్మము!

జనుల కొఱకు తనదు శాస్త్ర విద్య

ధార పోసి వెలిగె తార వోలె నిలను!

చల్లనయ్య మనకు సాంబశివుడు


Thursday, September 16, 2021

పాట

చక్కనైన వాడనే చందమామను జూడరే

చలూలదనము పంచుతూ నొక్క మాట చెప్పెదన్


వెన్నెల పంచు నేను యెంచను ఏ బేధము నా

కన్నుల కందఱూ సమమే నిరతమూ


కలువల ఱేడు నైనా నేనునూ గగనమున పూచెదన్

చెలిమిన యుండవలదే స్వార్థపు చింతనల్


ఓషధి గుణములిత్తు నేను ఓర్చెద నమాస గ్రహణములన్

ఓరిమి తోడనే గలుగును సతము విజయములే


తిమిరము గల్గెనని నే దిగులు పడబోనుగా

సమరము సేయుచూ సదా ప్రకాశింతునే


భూమికి వెనుకగా దిరిగిన నెపుడునూ

దాగను జూడమా నాకడ సత్యమే యుండునే


తరములు ఎన్ని మారినా పిన్నలకు మామనే నే

బాలలనెప్పుడూ పాడు సేయవలదంటినే


జనులా పాఠము వినుమయా చల్లగ నుండుమయా

జయములు బొందెదరు! నిశ్చయముగా మీరిటన్


కవితలు - లేటెస్ట్

 [16/09, 18:53] Durga Madhuri: ఆమని కోయిలను పాటలనూ

వసంత శోభల వనములనూ

విపంచి రాగాలాపనలూ

విరించి సృష్టి విలాసమునూ


మండే ఎండల తాపమునూ

మామిడి ఫలముల తీయదనమూ

వర్ష ఋతువున బాలల సందడులూ

కాగితపు పడవల అల్లర్లూ


శరత్కాలపు చందురునీ

మంచు బిందువుల చల్లదనమూ

శిశిరమున పుడమిని తాకు పత్రములనూ


నే వచియింపలేను! నా కలమునందించలేను!

పలుకుల రాణీ ఓ వాణీ!

వరములనడిగితి వర్ణన కొఱకై

దయతో నిమ్మా! ధవళ వస్త్ర శోభితా!

పదముల నడిగితి పరిపరి విధముల

సొబగుల కవితలు వ్రాసెడి శక్తిని!



[16/09, 19:00] Durga Madhuri: గణపతి నుదుటన నీవే

శివునికి శిరమున నీవే

జననికి తిలకమున నీవే

రాముని నామముననూ నీవే

సూర్యుని తోడైనావే

భూమికి చుట్టూ నీవే

గ్రహముల నందూ నీవే

గగన కుసుమమువూ నీవే

నిశిరాతిరిన వెలుగువు నీవే

కవుల వస్తువూ నీవే

ప్రతి తరమున బాలల మామవు నీవే

చల్లదనమ్ముల కలువల ఱేడువూ నీవే

చక్కదనాల చందమామ రావే

చిక్కనైన వెన్నెల సతమునీయవే

Tuesday, August 31, 2021

ప్రవచనం - 2

 

రావే మనవరాలా! ఏమిటీ సంగతులూ!

గుమ్మంలోనే సౌమ్యకు ఎదురు వెళ్ళారు సుమంగళి గారు.

ఏమీ లేదు బామ్మా, ఈ వేళ మా ఆడపడుచు శ్రావ్యకి కొన్ని సందేహాలున్నాయంటే తీసుకు వచ్చాను , తీర్చ మనవి! అభ్యర్థనను కూడా నాటకీయంగా చెప్పింది సౌమ్య!

అలాగేనమ్మా, అంటూ వారిని కూర్చోపెట్టి, పలకరింపులూ పరిచయాలూ అయ్యాక ప్రశ్నోత్తరములు మొదలు పెట్టమన్నారావిడ!

ఏమీ లేదు బామ్మా, మీరు సౌమ్యకు చెప్పారు కదా, అమ్మ భావనా మాత్ర సంతుష్ట అన్నారు కదా! అంటే తలచినంతనే కష్టములను తొలగిస్తుందనీ, మరి అటువంటప్పుడూ ఇన్ని స్తోత్రములు ఎందుకూ, ఇన్ని రకముల పూజలూ, నోములూ, వ్రతములూ ఎందుకు బామ్మా. అడిగింది.
చెప్తాను గానీ, ముందు ఇది పట్టుకో, హల్వాలోకి ఉప్పు వేయాలి, అన్నారావిడ చమత్కారంగా.

ఆవిడ ఏదో చమత్కారంతో ఉన్నారని అలవాటైన సౌమ్య మిన్నకుండి పోయింది కానీ, శ్రావ్య మాత్రం ఖంగారుగా, అయ్యో, అదేంటి బామ్మా, హల్వా లో ఉప్పు ఎలా వేస్తామూ అన్నది. అద్గదే మనవరాలా, ఏ వంట వండటమునకయినా పనిని చేయటానికైనా ఓ పద్ధతి ఉంటుంది కదూ! అలాగే, అరిషడ్వర్గ మాయలో పడిన ఈ మానవులు ఇహ, పరములలో తరించటానికీ, ప్రవర్తన చెడకుండా దారిలో పెట్టటానికీ ఈ పూజలూ, పద్ధతులూ ఓ దారమ్మా! చెప్పారావిడ.

నే చెప్పలేదూ, బామ్మ స్టైలే వేరూ అనీ! అంటూ చప్పట్లు కొట్టింది సౌమ్య. 

అంటే ఇప్పుడు ఎవ్వరైనా ఏ పూజైనా చేసేయవచ్చా బామ్మా? అంటే, ఆడవారు అయ్యప్ప పూజ వంటివే కాదు నా సందేహంలో, అసలు మంచి తనమే తెలియని వారు కూడా కోరికలు కోరటమూ పూజలు చేసి పొందేయటమూ అంటే, ఇంక అర్థమేముందీ? అడిగింది శ్రావ్య.  గొప్పగా పూజలూ గట్రా చేయకపోయినా, సౌమ్యకు కూడా ఆసక్తిగా అనిపించి, శ్రద్ధగా వినసాగింది.
ఆమె అమాయకత్వం నవ్వు తెప్పించినా, అందులోని స్వచ్ఛతా, ధర్మ నిరతీ అర్థమై, ఆమెను మెచ్చుకున్నారావిడ.  

పిచ్చి తల్లీ, గొపృప గొప్ప పూజలు చేసి చెడ్డ కోర్కెలు కోరేస్తే తీరవమ్మా! మరలాంటప్పుడూ, ప్రజలకి ఈ చెడు ఎలా జరుగుతోందీ అంటే, అది వారి ప్రస్తుత,  లేదా గత (జన్మ) కర్మల వల్ల జరుగుతుంది. అలాగే, అసలు చెడ్డ వారు కోరిన ఏ కోరికా నెరవేరదా అంటే, మంచిదైతే తప్పక జరుగుతుంది! కాకపోతే ఇక్కడ మనం ఏమి గుర్తించాలీ అంటే, ఆ కోరిన కోర్కె, దాని ఫలమూ, గ్రహీతలెవరన్నదే లెక్క కానీ, కోరుకున్నది ఎవరూ అన్నది కాదమ్మా! ఆ మాటకు వస్తే, అమ్మకై తన బిడ్డలందఱూ ఒక్కటేనన్న భావన ఎలాగయితే ఉంటుందో, నువ్వు ఉన్నాడనుకున్న జగజ్జననీ జనకులకూ అంత కంటే ఎక్కువే ఆ భావన ఉంటుందమ్మా! అందుకే, ధర్మ, కర్మలననుసరించి, ఎవరు కోరినా నెరవేరటం! కొండొకచో, అందఱికంటే తక్కువ లో ఉన్న బిడాడ పట్ల మరింత శ్రద్ధ తల్లిదండ్రులకొ ఎలా ఉంటుందో, అలాగే దేవునికీ ఈ గుణహీనుల పట్ల కాస్తంత దయ ఎక్కువే ఉంటుంది! 
అలాగే ఇప్పుడు మీరందరూ అంటూన్న body shaming అసలు ధర్మబద్ధంగా తప్పన్నది మొదటి నుంచీ ఉన్నదే! భగవంతుడూ లేదా మీ తరం నాస్తిక వాదం ప్రకారం ప్రకృతీ ఇచ్చిన ఒకరి తనువునూ, లేదా శారీరక, మానసిక లోపమునూ చమత్కారమో,   వెటకారమో చేసే హక్కూ, అధికారం మనకెక్కడిదీ?
ఇక విధివంచితల పట్ల చులకన చేయటాన్నీ, అందఱకూ దూరం చేయటాన్నీ ధర్మం ఎలాగ ఒప్పుకుంటుందీ?
నే చెప్పేది ప్రసంగంలా అనిపించవచ్చునేమో తల్లీ, కానీ ఇది అందఱూ గుర్తెరుఁగ వలసిన విషయం! అంటూ ఆగారు బామ్మ!
Spellbound బామ్మా! అన్నారిద్దరూ ఒకేసారి! 
మాకు professional ethics పేరుతో నేర్పిస్తున్నవి అన్నీ మీరు ఇంత బాగా విశదపరిచారు! థాంక్యూ బామ్మా, అన్నది సౌమ్య,  తనకు ఆవిడ వద్ద ఉన్న చనువుతో.
మరేఁవిటనుకున్నావూ మన సంప్రదాయమంటే! అంటూ వారి నవ్వుతో శృతి కలిపారు బామ్మ కూడా.

మరో చర్చతో మళ్ళీ కలుద్దాం. సెలవ్.


ప్రవచనం - 1

 

సాయంత్రం 6 గంటలు కావస్తూంది.  సౌమ్య ఆఫీస్ నుంచి ఇంటికి వెళుతూ దారిలో ఉన్న గుడి లో ఆగింది.  ఆ గుడిలో ఉన్న సుమంగళి గారిని చూడటానికి. ఆమెకి దేవుడిపై భక్తి తక్కువ కానీ ఆ సుమంగళి గారిని చూస్తే ఏదో ఆనందం.  ఎన్నాళ్ళ నుంచీనో ఆవిడని ఒకసారి కలవాలి అనుకుంటుంది.

 ఆవేళ శుక్రవారం కావడంతో  తెల్లవారి ఎటు శనివారం సెలవు కదా అని ఓ సారి ఆగి గుడి లోకి వెళ్ళింది.

 ఇంకా ప్రవచనాలు సమయం కాలేదనేమో. జనాలు పల్చగా ఉన్నారు అదే అదునుగా సౌమ్య గుడి మెట్ల మీద కూర్చుని వున్న సుమంగళి గారిని పలకరించడానికి వెళ్ళింది. వెళ్లి ఆమె కాళ్ళకి దగ్గరగా కూర్చుని నమస్తే బామ్మ గారు అంది.

 కొద్దిగా బామ్మగారు కూడా నవ్వింది దైవ దర్శనం చేసుకున్నావా అమ్మ అని అడిగింది.

 లేదు బామ్మా, మిమ్మల్ని కలుద్దాం అని వచ్చాను అన్నది సౌమ్య.

 మరోసారి చిన్నగా నవ్వింది బామ్మగారు దేవుడంటే పెద్దగా భక్తి ఉండదు మీ తరానికి, అని అన్నది

 దైవం మానుష రూపేణ అన్నారు కదా బామ్మ అందుకని ఒకసారి మీ తోనే మాట్లాడదామని, అని ఆగింది సౌమ్య.

 చెప్పవే మనవరాలా అంది ప్రేమగా బామ్మ.

 ఏమీ లేదు బామ్మా, మీరు ఎప్పుడు చూసినా ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటారు.

నిండా పాతికేళ్ళు కూడా దాటినట్టు లేవు, అప్పుడే

  నిన్ను ముంచితే సమస్యలు ఏమిటే మనవరాలా అన్నది బామ్మ. 

 అబ్బా మామూలు సమస్యలా ఒకటారెండా. ఇంట్లో 

 పని సాగాలి ఆఫీసులో ఎవరూ మాట వినరు.

 మధ్యలో సన్నగిల్లుతుంది శక్తి.

అంటూ నిట్టూర్చింది సౌమ్య.

 అందుకనే మిమ్మల్ని చూసినప్పుడల్లా అనిపిస్తుంటుంది బామ్మ

ఎప్పుడూ చిరునవ్వుతో మీరు ఎలా ఉండగలరు అని

 మీ హ్యాపీనెస్ సీక్రెట్ నాకు కూడా షేర్ చేయరా బామ్మ అంటూ గారాలు పోయింది సౌమ్య

 చెప్తాను సరే, మరి నువ్వు నవ్వ కూడదు అంటూ షరతు విధించింది బామ్మ. సరే పెద్దల మాట చద్దిమూట కదా కాబట్టి మీరు చెప్పిన దాన్ని విని నవ్వను

 నాకు అన్వయించుకుంటూ ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేస్తాను

అంది సౌమ్య 

  అయితే సరే ఇంతకీ చెప్పనేలేదు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు పెళ్లయింది ఎంతకాలమైంది ఉద్యోగం ఏమిటి అంటూ ప్రశ్నలు సంధించింది. బామ్మ పెద్దలకు ఎదురు చెప్పలేదు కాబట్టి సౌమ్య నెమ్మదిగా తన గురించి చెప్పసాగింది పెళ్లయి ఏడాదిన్నర బామ్మా, మూడేళ్లుగా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను హెచ్ఆర్ మేనేజర్గా, ఒక ఆడపడుచు రెండు వీధుల అవతల ఉంటుంది. అత్తా మామా, అమ్మానాన్న ప్రక్క ప్రక్క ఊర్లలో, పల్లెటూర్లలో ఉంటారు.

 వాళ్ళందరూ కలిసి, ఇంకా పిల్లలు లేరు ఏమిటి అంటూ మమ్మల్ని అడుగుతూ ఉంటారు. మా ఆడపడుచు, ఒక్కసారి పిల్లలు పుడితే ఇంక మన కెరియర్ అంతే, ఫుల్ స్టాప్. కాబట్టీ టైం తీసుకో, పర్లేదు అంటుంది. తను చాలా మంచి అమ్మాయి, పాపం ఇంట్లో సహకారం తక్కువే!

 ఆఫీస్ కి వెళ్తే ఎవ్వరూ నా మాట వినరు. కొత్తవారి చేత పని చేయించాలి సీనియరస్కీ నచ్చ చెప్పుకోవాలి.

 అంటూ ఏకరువు పెట్టింది సౌమ్య. మరోసారి నవ్వింది బామ్మ

 అయితే ఇవే సమస్యలు అంటావు, అవునా! అంటూ.

 హ్మ్... సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి లే బావ నీ వయసు, అనుభవములకు నా కష్టాలు చిన్నదేమో కానీ నా పరిస్థితికి మాత్రం పెద్దవే, అంటూ, బుగ్గ కింద చేయి పెట్టుకుని,కళ్ళు పెద్దవి చేసి, నిట్టూర్చింది సౌమ్య.

మళ్ళీ తనే, అవును బామ్మా,

ఇంతకీ నే అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పనే లేదు, అంది. ఏమి ప్రశ్నా? అడిగిందావిడ! అదే, మీ హాపీనెస్ సీక్రెట్! అన్నది సౌమ్య! నువ్వే అన్నావుగా,  సీక్రేట్ అనీ, అంటూ నవ్వారావిడ! ఆ సంధ్య వేళ, 

ఆమె మోములో దరహాసం భలే హాయిగా అనిపించింది సౌమ్యకు. పచ్చని పసిమి మొహమూ, తూరుపు సింధూరంలా కుంకుమ, వెనక చక్కగా ముడిచిన సిగలో తురిమిన చేమంతి పూవు, పసుపు అంటిన అఱచేతికి క్రింద గాజులూ, ఎంత సేపు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఆవిడ నవ్వుతుండగా చూస్తే తెలియని వారికైనా చేతులు జోడించాలనిపిస్తుంది. అందుకే, అంతగా దేవుడిని నమ్మనూ అనుకునే సౌమ్యకు కూడా ఆవిడతో ఇన్నాళ్ళూ అవిడతో ప్రత్యక్షంగా పరిచయం లేకపోయినా ఒకలాంటి అభిమానం ఏర్పడి, ఓ రెండు మూడు సార్లు కలిసింది ఇప్పటి వరకూ. ఇదుగో, ఇప్పుడిలా సమయం తీసుకుని ఆవిడ కౌన్సెలింగ్ అందుకుందామని ప్రయత్నిస్తోంది. ఈ కాలం పిల్లల్లా పెడ పోకడలకు పోకుండా పద్ధతిగా ఉంటుందని ఆవిడకు కూడా అభిమానం సౌమ్యంటే.  పెద్దలను గౌరవిస్తూ, వారి అనుభవ సారం అందుకోవాలని ఈ వేళ ఇలా ఆవిడ దగ్గర కూర్చుంది సౌమ్య. 


అమ్మాయీ, ఈ మధ్యన మీ ఇంటికి ఎవరైనా బంధుగణం రావటం కానీ, నీవు ఎక్కడికైనా వెళ్ళటం కానీ జరిగిందా? నీకు బాగా మనసుకు చేరిక, ఆనందం ఎవరి సమక్షంలో అనిపించిందీ. అడిగింది బామ్మ!

 వచ్చారు బామ్మ మా పిన్నత్తగారు వచ్చారు.  ఆవిడకి నాకు చాలా మంచి అనుబంధం ఉంది ఆవిడ వెళ్లిపోయేటప్పుడు అయితే చాలా బాధగా అనిపించింది కూడా.
ఎందుకంటే నాకు తెలియని ఎన్నో విషయాలు నేర్పిస్తారు పనుల్లో చాలా సహాయం చేస్తారు.
 అలాగే మా ఆడపడుచు వాళ్ళ అత్తగారు ఊరికి వెళ్లాను ఏదో ఫంక్షన్ ఉంది.
 ఎంత బాగుందో.
 చక్కగా పల్లె మల్లెమొగ్గలు గోరింటాకు
జున్ను పాలు ఆవు నెయ్యి పెరుగు,
 తోటలో ఉయ్యాల చాలా ఎంజాయ్ చేశాను.
 ఎగ్జయిటింగ్ గా చెప్పింది సౌమ్య.
అవునా, అప్పుడు మరి ఈ ఆఫీస్ టెన్షన్సూ, కుటుంబ విషయాల ఒత్తిడీ లేవా, దరి చేరలేదా బాలికా! నాటకీయంగా అడిగారు సుమంగళి గారు.
లేకేం, ఉండీ దరి చేరలేదు! హంథే. నవ్వుతూ, బామ్మనే అనుకరిస్తూ చెప్పింది సౌమ్య. 
అంటే మనసుకు నచ్చిన విషయాలు ఉన్నప్పుడు, కనీసం మనం గౌరవించదగ్గ వారు ఉన్నప్పుడూ బాధ పెట్టే మిగతా విషయములను తొక్కి పట్టేస్తామే!

 అలాంటిది, అనునిత్యం మన మనస్సులోనే ఆ జగజ్జనని కొలువై ఉంటుంటే, ఇక వేరే ఆలోచనలూ తద్వారా ఓఇగుళ్ళూ ఏలనే బాలా అన్నారావిడ! 
అంటే, అంది సౌమ్య,  అర్థం అయ్యీ కానట్టూ ఉంది సౌమ్యకు.
అర్థం కాలేదా బుల్లీ, మరేం లేదు, నీవు నీ వారి మధ్య ఉన్నప్పుడు ఎంత ఉల్లాసంగానూ, అలాగే నీ పరధ్యానం వల్ల వారు ఇబ్బంది పడకుండానూ ఎంత జాగరూకతతో ఉంటావో, అలాగే నేనూ అన్నమాట! 
ఒక్కపూట ఉండే ఒకరో ఇద్దరికో మనం అంత విలువ ఇస్తే, మరి ఈ సమస్త జగమునూ సృజించీ, మనని అను నిత్యము కాచే జనని మన చెంత ఉంటుందని తెలిసీ, మనమింకెంత శ్రద్ధతో మసలుకోవాలి! అటువంటప్పుడు మరిక వేరు విషయములకు తావేదీ! అదే నే చేసేది! అన్నారావిడ. మళ్ళీ తనే, ఇవన్నీ నీకు ఒక్క రోజులో అర్థమయ్యేవి కాదే బాలికా, నెమ్మది మీద అవగతమవుతాయి! నీ వయసూ, అనుభవమూ అందుకు చాలవు తల్లీ అన్నారు ప్రేమగా!
అంటే సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్టన్నమాట! అంది సౌమ్య. 
చురుకైన దానివే, మెచ్చుకున్నారావిడ.
నవ్వి, అది సరే, మరి అర్థమయే దాకా ఎలా! అడిగింది సౌమ్య. 
ఎలా, అంటే, ఏమిటి, అన్నారావిడ,  ఆట పట్టిస్తూ.
ఫో బామ్మా, అప్పటి దాకా నా వంటి వాళ్ళకి ఆందోళన పడకుండా నిలదొక్కుకోగలగటం ఎలా? అంది సౌమ్య .
నువ్వే అన్నావు కదా, సాధనమునా అనీ... సాధన చేసేయి, అన్నారు, తన మార్కు సన్నని నవ్వుతో.
అంటే తల్చుకుంటూ ఉంటే పనులు జరిగిపోతాయా, కష్టాలు తీరిపోతాయా, అంది కినుకగా.
నేనేమి చెప్పానూ, తల్చుకుంటే, తల్చుకుంటూ ఉంటే, కష్టాలు తీరతాయని కాదూ! మనం మన మనసులకి తీసుకోవటం మాని వేస్తామని! అందుకు సాధన! అంతే కానీ గాలిలో దీపాలెట్టమని కాదు! 
కాబట్టీ గీతలో పరమాత్ముడు చెప్పినట్టూ పనులు చేయటం మానవద్దు, కానీ దైవ స్మరణ మరువకు! ఏమో, అయినా మన అమ్మ మనకెప్పుడూ అడగకుండానే అన్నీ అమర్చి పెడుతుందే, అందరం ఒకే ఊరిలో లేకున్నా తనకు అందినంత మేర మనను కాస్తుందే! మరి అలాంటప్పుడు ముల్లోకములకూ మాత ఆ పరమేశ్వరి మన కష్టం తీర్చదని ఎందుకనుకుంటున్నావూ! కాకపోతే, అంతటి సామ్రాజ్ఞిని తలుచుకోగలిగే భాగ్యం వచ్చాక ఇక మిగతావి చిన్నవి అయిపోతాయి, ఎందుకంటే, అవన్నీ అంతు లేని కోర్కెలూ, కానీ ఈ తల్లి మన అంతరంగం! అందుకే అంతలా మమేకమైపోతాం! ఈ సారి సన్నని నవ్వు కాదు ఆమె మోములో, ఓ తన్మయత్వము! సౌమ్య మరింత ముగ్ధురాలయి మరి మాట్లాడలేదు!
థాంక్యూ బామ్మా, అంటూ బండి వద్దకు వెళుతూ, ఆవిడని దింపాలేమోనని వెనకకు చూసేసరికి, చక్కగా అడుగులు వేసుకుంటూ నడుస్తున్నారావిడ, చెప్పుల స్టాండ్ దగ్గర నుంచీ. ఆవిడ దగ్గరకు వెళ్ళి, దింపనా బామ్మా అని అడిగితే, ఇల్లు దగ్గరేగా! ఓ నాలుగడుగులు వేస్తే మంచిదే, నడుస్తానన్నారావిడ. ఆవిడకు కంపెనీ ఇస్తూ, అది సరే బామ్మా, నే దేవుణ్ణి నమ్మినా నమ్మకున్నా నాకు మీ కాన్సెప్ట్ నచ్ఛింది కాబట్టీ ఓకే, మరి పూర్తి నాస్తికులకయితే ఎలా చెప్తాం, అడిగింది, అమాయకంగా.
ఎవరికైనా వర్తించే సూత్రమొకటేనమ్మా, అయినా నీ భాషలో చెబుతా విను, ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, మొన్న ఆఫీసులో తిన్న తిట్లే కానీ, నిన్న స్నేహితులతో జరుపుకున్న సంబరాలే కానీ, అటువంటప్పుడూ, మనసులో చింతలేలా? రేపనేది మన చేతుల్లోది కానప్పుడు అతి చింతన ఏలా? అది మన ఆరోగ్యానికే చేటన్నప్పుడు వదిలేస్తే పోలా? అంతేనా కాదా? అన్నారావిడ. 
You're awesome బామ్మా అనకుండా ఉండలేకపోయింది సౌమ్య. 

కంద పద్యము:

జననిని దలిచిన సతతము
మనసును జేరదు విషమగు మలినము జనులా
వనరుహ లోచని నిత్యము
మనలను గాచును! శరణము స్మరణయె! వినుమా


మరొక బోధతో మళ్ళీ కలుద్దాం, సెలవు.

Wednesday, August 4, 2021

శ్రీ రామప్ప

 5.




4.

ఆటవెలది
ఎన్ని యాపదలకు ఎదురీది నిల్చెనో
తెలిసికొన్న మనసు తేలియాడు
కట్టడమును గట్టినట్టి పట్టును జూసి!
దండకమ్ము వ్రాసి దండమిడుదు

3. ఆటవెలది

నీటి మీద తేలి నిలుచు నిచట నున్న
యిటుక రాళ్ళు! ఏమి కిటుకు వాడి
గట్టి నారు రాజు గణపతి సేనలు
పట్టుఁ దప్పకుండ! భక్తి మీర


2. ఆటవెలది

కాకతీయ రాజు కళల యభిరుచిని
దెల్పునట్లు గాను దిద్ది రిచట
నునుపు రాతి తోడ ననిల నయనుడగు
పరమ శివుని! శిల్పి! భక్తి మీర


1.తేటగీతి

శిల్పి నామమ్ము నే పేరు నిల్పుకున్న
ఆలయమ్ము రామప్ప దేవాలయమున
శివుడు విష్ణువు లిరువురు జేరి నిలచు
దృశ్యమును గన్న చాలును హృదయమునకు

Thursday, July 15, 2021

పద్యాంశములు

 పద్యభారతి వారు ఎంపిక చేసిన పది అంశములు వీటిలో మీకు నచ్చిన నాల్గు అంశాలతో ఒక్కోదానికి అయిదు పద్యాలను వ్రాయండి.

1.దైవ ప్రార్థనలు

2.  తెలుగు భాషా ఛందస్సు

3.  హేమంత ఋతువు

4 . ప్రపంచ శాంతి

5. పద్య పరిమళం.

6. తెలుగు పెళ్లిళ్లు

7.తెలుగు సినిమా

8.అవధానం -అంశాలు

9.నవరసాలు

10. పద్య భారతి.


1. దైవ ప్రార్థనలు


[24/05, 13:47] Durga Madhuri: 


మేదుర దంతము


మానస మందున మంగళ దాయిని మాతను గొల్చెద మంత్రము తోడను

దీనుల బ్రోచెడి తీయని పల్కుల దేవత; బాధను దీర్పెడి తల్లిని

గానము జేసెద కాంచి నివాసిని కష్టము బాపెడి గౌరిని దల్చెద

భాను రథంబున భాసిలు రేఖగు భ్రామరి దేవిని భక్తిగ నిత్యము


*మేదుర దంతము, 8 భ గణమూలు, 5వ గణము మొదటి అక్షరము యతి*

[24/05, 13:49] Durga Madhuri: 


మానిని


మానస మందున మంగళ దాయిని మాతను గొల్చెద మంత్రముతో

దీనుల బ్రోచెడి తీయని పల్కుల దేవత బాధను దీర్పుననిన్

గానము జేసెద కాంచి నివాసిని! కష్టము బాపెడి గౌరివనిన్

భాను రథంబున భాసిలు రేఖగు భ్రామరి దేవిని భావనతో

మానిని వృత్తము 7, 13, 19 యతి స్థానములు, 7 భ గణములు, ఒక గురువు*


అశ్వగతి


మానస మందున స్కందుని మాతను గొల్చెద నే

దీనుల గాచెడి బాధలు దీర్పెడి తల్లిని నే

గానముఁ జేసెద నిత్యము గౌరిని కీర్తనతోన్

భానురథంబున భాసిలు భ్రామరి నే గొలుతున్



*పద్మనాభ వృత్తము: 7 తగణములపై 2 గురువులు, 5వ గణము మొదటి అక్షరము యతి*


శ్రీమాత నీనీడ మాకిమ్మ మాయమ్మ! ఛిద్రూపి! నీ దివ్య నామంబె గాచున్

ప్రేమార నీదృష్టి మాపైకి సారించు  వింధ్యాద్రి పైనుండి! ముల్లోక పూజ్యా

గ్రామంబు లందుండి నిత్యంబు రక్షించి కామ్యంబు లన్ దీర్పు వేల్పంచు మమ్మున్

శ్రీమంతులన్ జేయు సౌభాగ్య రూపంబు! సేవించు భాగ్యమ్ము నందించుమమ్మా


స్రగ్విణీ


తల్లి!నే నెప్పుడున్ దల్తునిన్ భక్తిగన్

మల్లెలే యల్లెదన్ మాలగా బేర్మితోన్

బల్లవించున్ సదా భక్తి పాటల్ మదిన్

జల్లగా జూడుమా శాంభవీ! మమ్మిటన్


పద్య పరిమళము


[30/07, 12:55] Durga Madhuri: 


1. *ఆట వెలది*


తెనుగు భాష నందె తీయనౌ పద్యముఁ

గలదు! చదివినంత గలుగు మదిని

హర్షమెపుడు! గణము యతులు ప్రాసను గూర్చి 

ఛంద మనుసరించి! సాగ వలయు


2.

[30/07, 15:47] Durga Madhuri: 


2. *తేటగీతి*

తొమ్మిదవ శతాబ్దమునది తొలుత దొఱికె

శాసనమ్మున తరువోజ ఛంద పలుకు

యుద్ధమల్లుకాలమున నిబద్ధమాయె

నైదు సీస పద్యమ్ములు! నందె మనకు


3.

[31/07, 12:58] Durga Madhuri: 


3. *తేటగీతి*


వృత్తపద్యములు దొఱకె వేల యేండ్ల

నాడె! కామసానుల శాసనమ్మునందు

జూడ దెనుఁగున పద్యము జాడఁ అగణ

ఘనచరితగలదని! పూర్వ కథలు దెలిపె


4.

[02/08, 09:26] Durga Madhuri: 


4. *తేటగీతి*


శృతి లయలతోడ గానము చేయునట్లు

నొక సరళ రీతిన నడుచును కవనములు

పద్య మునకు ఛందమనెడి ప్రక్రియ యొక

అందమును గలిగించెడి యమృతపాణి!


5.

[02/08, 09:26] Durga Madhuri: 


5. *హరిగతి రగడ*


భక్తకవీశుడు పోతన వ్రాసెడి పద్యము పూరణ సేయుట కొఱఁకను

రక్తిగ పుడమికి వచ్చెను యారఘు రాముడు స్వయముగ! గావున గోరను

ముక్తిని! దెనుఁగను భాషను నేర్చెడి బుద్ధిని మాత్రము నిమ్మని! అమ్మను!

శక్తిని వేడెద! నిత్యము పద్యము చదివెడి వరమును యొసగిన చాలును!




తెలుగు భాషా ఛందస్సు

1. ఆటవెలది

పాదములకునుండు పద్యలక్షణములు
దెలుపు శాస్త్ర మదియె! తేనెలూరు!
ఛందపరిమళమ్ము సన్నజాజికి మల్లె
వోలె నల్లుకొనుచు! నేలె సతము


2. ఆటవెలది
దెనుఁగు భాష సాహితీ ప్రక్రియను! జూడ!
యతులు ప్రాస తోడ! యలరుచుండు!
వదల కూడదిట్టి బంగరు సంపద!
భాషయందమపుడె! పరిఢవిల్లు

3. ఆటవెలది

ఐదు పదుల నుండు అక్షరమాలను
ఖైదు చేయవచ్చు కైతలందు
ఛంద శాస్త్రమునకు జతను జేరి వెలుగు
పద్య నామమంది! హృద్యమగును



4. ఉత్సాహము


తేట దెనుఁగు భాష జూడ తేనెలూరు దీయగన్

తేటగీతి గణము లందు దినకరసుర రాజు లన్

యాటవెలది నందు గూడ యార్క యింద్ర ములనిటన్

బాట వోలె గూర్చినంత బల్లవించు పద్యమే


5. తేటగీతి

తేట దెనుఁగున ఛందముతీపి వనరు
పద్యమునకు సొగసునిది పంచి యలరు
గురువు లఘువు తోడ గణముగూర్చ వలయు!
ప్రాస లుయతులు తోడుగపల్లవించు


విశ్వశాంతి


5.  ఆటవెలది

జనన మరణ ములనుచక్రమునందున
చింత పడుచు తిరుగు జీవులకును
పగలు పంతములనుసెగలు మోయగ నేల
కసిని విడచి నంతగలుగు కలిమి



4. ఉత్సాహము

విశ్వశాంతి కొఱకు సలుపువేరు యత్న మేలనో
యీశ్వరుండు యొక్కడనుచుహృదయమందు నిల్పుచున్
విశ్వసించినంత దక్కువిజయపథము సర్వదా
శాశ్వతముగ ధరణిపైనశాంతి నిలుచు! సత్యమే

3.

ఉత్సాహము
నీరు నిప్పు గాలి నేల నింగి దారి జూపురా
కారు మబ్బు మధ్య మెఱయు కాంతి వోలె మెలగరా
దారి తప్పు దీనులకును దన్నుగా నిలువుమయా
ధీరుఁడౌదువపుడె నీవు తేనె వోలె పలుకుమా

2.

పోరు పొక్కు మఱిచి సతము పొందు గోరు మేలయా

వేరు భావమెపుడు లేక విఱుపు మాట వీడుమా

చేరువైన చెలిమి నెపుడు చీదరించబోకుమా

భారమౌను బ్రతుకు పరుల బాధ పెట్టినంతనే

1.

ఆటవెలది
సాటి వారి పట్ల సానుభూతి గలిగి
మసలు కొనుట మేలు మర్త్యులకును
కష్టమెవరి దైన కలిసి గెలువవచ్చు
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు

Wednesday, July 14, 2021

పద్య భారతి

 * ఉత్సాహము: 7 సూర్య గణములు, 1 గురువు, ప్రాస కలదు, యతి 5వ గణము మొదటి అక్షరము*


అరుణ కాంతి వేళ నతఁడు నామె చేయి పట్టి నీ

బరువు బాధ్యతలను మోయుఁ బంధమౌదు ననుచు తా

విరహ మింక తాళలేక వేడుచుంటి నిన్నిటన్

సరస మాడుకుంటు తెలిపె సఖుడు మదిని వలపు తోన్


*తొలకరి వర్షం*


*కందము*


తొలకరి చినుకుల్ కుఱియగ

నిలపై  నిండెను చెరువులు నింపుగ జూడన్

పొలముల పంటలు పండెన్

బలిమిగ; హాలికులకెల్ల ఫలములుఁ బంచెన్


*చంపకమాల*

*న, జ, భ, జ, జ, ర 11వ అక్షరము యతి,  ప్రాస యుండును, ప్రాసయతి చెల్లదు*


సురమునిపూజ్య! మాగృహముఁ శోభల నింపె మడి భాగ్యదాయివే!

సరసిరుహాక్షి! లోకముల చల్లగ జూచెడి నీకు మ్రొక్కినన్

త్వరిత ఫలంబు లందునని భక్తుల నమ్మిక; కల్పవల్లివై

వరములనిచ్చు వేల్పువని వందనమిచ్చెద తల్లి! నీకివే


*మత్తకోకిల*


*ర, స, జ, జ, భ, ర 11వ అక్షరము యతి,  ప్రాస యుండును, ప్రాసయతి చెల్లదు*


శౌరివై రణమం దునిల్చె డిశక్తి వేయసు రాంతకీ

వేరు మాటలెఱుంగనమ్మిట వేల్పు వైనను గావుమా

గోరినంతనె భక్తులందరి గోర్కెలన్నియు దీర్పుమా

వారిజాక్షి! కపర్థిపత్ని! దవాగ్ని నేత్ర! ప్రణామముల్

*చిత్రము*

*మంగళ గీతి: 4 ఇంద్రగణములు, 4 పాదములు, ప్రాస ఐచ్ఛికము, యతి 3వ గణము మొదటి అక్షరము*

రక్తముఁ బీల్చెడి రక్కసి జూడరే

రసము వోలె దలచి ద్రాగుచుండె మదమున్

జీవుల బాధించి చిరునగవులు చిందు

గుణమెటుల హితమగునిలన్ దెలియదాయె


*పంచ చామరము*


4 పాదములు, ప్రాస గలదు,


జ, ర, జ, ర, జ, గ గణములు, లేదా 8 వ గణములు, యతి 10వ అక్షరము


*బాల్య జ్ఞాపకములు*

*పంచ చామరము*


సదా భయంబు తోడ నేను సాగినాను ముందుగా

మదిన్ భయమ్ము మెండుగాగ మాటరాక యుండగా

గదాధరుండుఁ నాంజనేయుఁ గాయు దైవముండగా

కుదేలు గావుటింక మాను కొమ్మటంచు మాతయే


వచించి ధైర్యమిచ్చు పల్కె బాగుగాను ప్రేమగన్

రచించు మమ్మ రామ బంటు లక్షణంబులన్నియున్

కచేరి చేసి నంత భక్తిగాను దేవదేవునిన్

కుచింతలన్ని పారిపోవు; గోర్కెలెల్ల దీరునే

పద్య భారతి 3వ పరీక్షకు

పంచచామరము
వచించి ధైర్యమిచ్చు పల్కె బాగుగాను ప్రేమగన్
రచించు మమ్మ రామ బంటు లక్షణంబులన్నియున్
కచేరి చేసి నంత భక్తిగాను దేవదేవునిన్
కుచింతలన్ని పారిపోవు; గోర్కెలెల్ల దీరునే
పంచచామరము
సదా భయంబు తోడ నేను సాగినాను ముందుగా
మదిన్ భయమ్ము మెండుగాగ మాటరాక యుండగా
గదాధరుండుఁ నాంజనేయుఁ గాయు దైవముండగా
కుదేలు గావుటింక మాను కొమ్మటంచు మాతయే

చంపకమాల

సురము నిపూజ్య! మాగృహ ముఁశోభ లనింపె డిభాగ్య దాయివే
సరసి రుహాక్షిలోకము లచల్ల గజూచె డినీకు మ్రొక్కినన్
త్వరిత ఫలంబు లందున నిభక్తు లనమ్మి కకల్ప వల్లివై
వరము లనిచ్చు వేల్పువ నివంద నమిచ్చె దతల్లి నీకివే

Thursday, July 1, 2021

తోపెల్ల ఉషా కౌమారీ సీతకు కళ్యాణమున అక్షర మాల

ఆటవెలది
పద్య విద్య నేర్పుబాలశర్మ సుతకు
పెండ్లి వేడుకండి! పిన్న పెద్ద
జేరి పందిరింట సీతా హవీషులఁ
తోడ నందరాడి పాడరండి!

ఆటవెలది
పద్మనాభునకటపౌత్రిగ జనియించి
నాఱసింహునికిటనవవధువుగ
యడుగిడెడి శుభ సమయమున చిందించుమా
తఱగని నగవులనుతరుణి! సీత

తేటగీతి
ఉషకు నాడపడుచు జూడనుషయె! లీల
గనగ చివుకుల వారింటికన్న బిడ్డ
వోలె కోడలి పై మల్లెపూలవాన
కురియు భాగ్యము గలుగుత! గురుసుతకట


తేటగీతి
చివుకుల గృహమున వెలుగు సిరుల దివ్వె
చింత యన్నదెఱుఁగకుండ చిరుఁ నగవుల
తోటి వరుడు హవీషుకు తోడు యగుచు
వర్థిలవలెను నూరేండ్ల పంటగాను


కందం
వాణిజ్య శాస్త్ర మందున
రాణించవలెను సతతము ప్రప్రథమమ్మౌ
శ్రేణిన నిలువవలయు పూ
బోణి! విజయసీమ నందిముదమొందవలెన్