Sunday, March 21, 2021

శక్వరీ ఛందము, పరమేశ వృత్తము

 గురువులకు, పెద్దలకు ప్రణతులతో...  నేను వ్రాసిన పద్యములకు సవరణలు సూచించి సరైన రీతిలో వ్రాయించిన వరలక్ష్మమ్మ గారికి సవినయ పూర్వక కృతజ్ఞతలతో... 


శక్వరీ ఛందము, పరమేశ వృత్తమునకు పద్యములు


స,న,జ,భ,గగ గణములు, యతి 10వ అక్షరము



1. త్రిపురాసురుల హరించి దివ్యుల కెల్లన్

రిపు బాధలచెర దీర్చు పృశ్నివి నీవే

యపరాధులను వధించు నాశ్రిత పక్షా

యపమృత్యువు దొలగింపుమా పరమేశా

పృశ్ని = వెలుగు


2. సిరి సంపదలను గోర చిన్మయ రూపా

కరుణించుమని భజింతు కాముని వైరీ

యరులెల్ల గలుగ జేయు నాపదఁ దీర్పన్

అరుదెంచి దరికి రావయా పరమేశా



3. కలనైన విడువనయ్య కల్మష నాశా

యలుపన్నదెఱుఁగకుండ నార్తిగ నిన్నే

తలతున్ మది నిరతంబు తాండవ రూపా

మలినంబులు దొలగించు! మా పరమేశా


4. భయ నాశము గలిగించు పార్వతి నాథా

లయకార! నిను నుతించు రాగము దీయన్

నయమౌను వెతలు రోదనల్! మరి వేరౌ

నియమంబులను త్యజింతు నే పరమేశా


5. ఎదురీత నెఱుఁగ నయ్య యీశ్వర! దేవా

మదిలో వ్యథలు జనించె; మాపుమ బాధల్

నిధులేవి యడుగ నేను నిశ్చల రూపా

హృదిలోన నిలుపుకొంటి! హే పరమమేశా