Monday, September 18, 2023

మగువ మహరాణి కవితా వేడుక శ్రావణ మాస ఆరాధన:

మగువ మహరాణి కవితా వేడుక


శ్రావణ మాస ఆరాధన:


ఇరువంటి (సోమరాజు) మాధురీ దేవి [నాగిని]


క్రమసంఖ్య: 1 - 18


*1*


సురనుత! లక్ష్మి! యిద్ధరికి శోభను గూర్చు శుభాంగి! యంబుజా

కరముల పట్టి యందముగ కాంచన పద్మము లెల్ల ధారగన్

సిరులను మాకొసంగు సఖి! శ్రీహరి వెంట పఱుంగిడేవు యీ

ధరణిన భక్తబృందముకు ధైర్యము నీయగ పద్మసుందరీ



*2*:


పలికెద నీదు మాతృ హృది భక్తజనాళికి పంచు పేర్మి నే

దలచెద నా మనస్సున కృతజ్ఞత నిండగ మూసి కన్నులున్

పిలచెద తల్లి కష్టములు భీతిలచేయగ నమ్మి యంబికా

యలుసుగ చూడబోకు నను! నాపద గాచుమ పద్మ సుందరీ


*3*:

శూలముఁ బట్టి యుద్ధమున జోరుగ సాగి మదమ్మునూగు యా

డోలుని మట్టుబెట్టి నిను డోలికలందున నిల్పుకొందునే

మాలతి నీయశస్సుకు సమానము నీ ధర నందు లేదు మా

వేలుపు నీవు గైకొని నివేదన గాచుమ! పద్మ సుందరీ


*4*:

కాలుని పాశమీ యిలను కాష్టము వోలెను మండు చుండగన్

పాలక వర్గముల్ తమ పంతము వీడవు వైరి మూకలున్

వ్రాలును దాటి హద్దులు! జవానులు ప్రాణము లెక్క సేయకన్

హేలను పంచు సైనికుల నెన్నడు వీడకు పద్మ సుందరీ


*5*:

సూక్ష్మపు వానివైన యును జోగుచు పోరును సల్పుచుందురే

లక్ష్మి! సమృద్ధి వృద్ధిని గొని ప్రజ్ఞను సాగరదేలనో జనుల్

పక్ష్మము పాటు వీడినను పంతము మేలును గల్గునీ

సూక్ష్మమునే గ్రహింపకయు శోకము నుందురు పద్మ సుందరీ


*6*:

వర్తనమందు ద్వందమును బట్టి సమస్యలు దెచ్చుచుందురే

కీర్తి యశస్సు కోసమని కీడును చేయుచు బాహ్యమందు నన్

నర్తనమాడుచుందురుగ నమ్మిన వాఱిని ముంచి పైన తా

మార్తిగ నుండుచుందురట హాయిగ నుందురు పద్మ సుందరీ


*7*:

బాలుర విద్య చూడ బహు పాట్లను మ్రోయుచు నీరు గారెనే

వ్రాలగ వెన్నుపూసలు సవాలుగ మారగ వంగిపోవుచున్

పీలగ శక్తి జారగ వివేకము శూన్యము గాగ నిత్యమున్

తేలుచు నుండి నంతిమము దీనత నొందిరి పద్మ సుందరీ


*8*:

చేనుకు పట్టె చీడలు సుశిక్షితులెవ్వఱు రైతు వర్గమున్

మేనుల కష్టపెట్టినను మేలును గూర్చు విధమ్మెఱుంగకన్

పానము తీసికొంటిరిల; ప్రార్థన నీకిదె ధాన్య లక్ష్మి మా

దీనత దీయు దేవతవు దీవెన లీయుమ పద్మ సుందరీ


*9*:

భార్గవి! తండ్రి శాపమును పట్టిన నీమము నేగిపోవగన్

స్వర్గము వీడి! పేదరిక భారము యింద్రుని క్రుంగదీయగన్

మార్గము వేఱు తోౘక సమస్యను ద్రుంౘ! వేడెనింద్రుడే

నిర్గుణ రూపుడౌ హరిని! నీదయ కోసము పద్మ సుందరీ


*10*:

సంద్రపు లోతునున్న సిరి జాడను గైకొన చిల్కి పాలనే

కేంద్రపు స్థానమందు తమ కీలకమౌ గిరి నిల్పి దీక్షగన్

యింద్రుడు వొందె సంతసపు హేలలదేమన కామధేనువున్

చంద్రుడు నీవు దక్కె! తప సంపద లోటుయు దీరిపోయెనే


*11*:


కపటము కుళ్ళు వంచనయు కల్మష బుద్ధులు తోటి వాఱిపై

యపప్రద మోపి హర్షమున యాడుచు శిష్టుల బాధ పెట్టుటన్

తపముగ జేయుచుండుట ధాత్రిన మ్రింగగ ధర్మ బోధలన్

శపథము పూని గాచు ధర సత్యము! యశోక! పద్మ సుందరీ


*12*:

Thursday, February 2, 2023

హనుమ శతకము

28. గగన సీమలదురు గర్జన నీది వినిన!

గాని మౌన యోగి! జ్ఞాని నీవుఁ!

ననువుఁ గాని చోట యసలు పలుకబోవుఁ!

హనుమ! రక్ష నీవె! వినుఁమ మొఱలు

27. మోహమసలు లేక మోక్షమందెడి వీలు

గలిగి యుండి గూడ నిలను గాచి

వెలుగు నింపుటకును వెలసిన కారుణ్య!

హనుమ! రక్ష నీవె! వినుఁమ మొఱలు

26. సంద్రమంత దాటు శక్తి యుండియు గూడ

వినయ గుణముఁ జూపు విజ్ఞత గల

సూక్ష్మబుద్ధి నీది! శోభాయమాన! యో

హనుమ! రక్ష నీవె! వినుఁమ మొఱలు

25. మాత జాడ పట్టి మనసు శాంత పరచి

రామ సేవ జేయు లక్ష్య సిద్ధి

మొదలు పెట్టినావుఁ! పుణ్య చరితుడవో

హనుమ! రక్ష నీవె! వినుఁమ మొఱలు

24. జన్మ జాతి చూడ! చరియించు వనమందు

నీదు వాసమేమొ నిర్మలముఁగ

భక్త హృదయమందు! భగవంతుడవుఁ నీవుఁ!

హనుమ రక్ష నీవె! వినుఁమ మొఱలు

23. పిన్న వయసు లోనె పెను యాపదను దాటి

శాశ్వతముఁగ ధరను శ్వాసనంది

మార్గదర్శకునిగ మాకు నిలచినావుఁ!

హనుమ! రక్ష నీవె! వినుఁమ మొఱలు

22. నాఱసింహ క్షేత్ర నాయకుండవుఁ నీవుఁ

పంచముఖములందు పట్టుకొనుచు

రెండు రూపములను మెండుఁగా దీవించు

హనుమ! రక్ష నీవె! వినుఁమ మొఱలు


21. నీవు తోడు మాకు లేకున్న యో దేవ!

పేర్మి తరిగి పోవుఁ! పెద్ద లోటు!

నిన్ను విడచు తలపు నే చేయలేనయ్య

హనుమ! రక్ష నీవె! వినుఁమ మొఱలు

20. ఒక్క మారు స్వామి! యుర్వి నందునేము

రామ రామ యనిన! లక్ష్య సిద్ధి

పూని! గాచు సులభ మోక్ష ప్రదాత! యో

హనుమ! రక్ష నీవె! వినుఁమ మొఱలు

19.  నిన్ను గాంచి మనసు నిలచేను నిత్యంబు!

ధైర్యమంది! దేవ! ధర్మ పోష!

యగ్ని కాల్చనట్టి! యాద్యంత రహితుడ!

హనుమ! రక్ష నీవె! వినుఁమ మొఱలు

18. రామ కథను నడిపి స్వామి భక్తిని చాటి

త్యాగనిరతి యనెడి దారి నడచి

శక్తి యుక్తి తోడ సతతమ్ము మెలిగేటి

హనుమ రక్ష నీవె! వినుఁమ మొఱలు

17. భక్తునిగ మొదలిడి పయనమ్ము! మారుతి!

దేవదేవువై విధిని లిఖించు

బ్రహ్మ పదవి నంది భవిత నిర్మించేవు

హనుమ! రక్ష నీవె! వినుఁమ మొఱలు

16. పుడమి యంత నిండు పున్నమి వలె నీదు

వెలుగు పంచి మాకు వెచ్చనిదగు

నీదు స్పర్శనొసగు నిర్మల మూర్తివి!

హనుమ! రక్ష నీవె! వినుఁమ మొఱలు

15. ఆపదంటు వేళనాదుకొంటివి నన్ను!

భయము మదిని సోకి! పాహి యనక

నేను నిలచి యున్న! నీ దయ నొసగిన

హనుమ రక్ష నీవె! వినుమ మొఱలు

14. మేము మరచి యున్న! స్వామి నీవు యెపుడు

వదలవయ్య మమ్ము! పవన పుత్ర!

ఋజువులెన్నొ గలవు! నిజము నా నమ్మిక!

హనుమ! రక్ష నీవె! వినుఁమ మొఱలు

13. నాటకమ్ము లాడు నయవంచకులు జేరి

బూటకములు జేసి! పూయు విషము

వాని నుండి గాచు వాయునందన! మమ్ము!

హనుమ రక్ష నీవె! వినుమ మొఱలు

12. తెలివి లేదు మాకు! తెలిసి గోతులు దీయు

జనులు చుట్టు నిలచె! జరిగెనయ్య

మోసములు హతవిథి! నీ సమక్షము నిమ్మ!

హనుమ! రక్ష నీవె! వినుమ మొఱలు

11. కనులు గప్పి నిజము కాననీయక దాచి

మాటలాడు వాఱు తూట సమము

వాని చెఱలు దీసి పాలించుమా మమ్ము!

హనుమ! రక్ష నీవె! వినుమ మొఱలు

10. పూర్వ జన్మ పాప పుణ్య గణన లేల

నిన్ను నమ్మినంత నిలుచు గతులు

నిజము లన్ని దెలియు నిందించు వాఱికి

హనుమ! రక్ష నీవె! వినుమ మొఱలు

9. స్వంత కీర్తి కొఱకు వంచించి యింటిని

సాగుచుండువాడుఁ యాగడెపుఁడుఁ

నట్టి వాని చెంత యధమమే బ్రతుకులు

హనుమ! రక్ష నీవె! వినుమ మొఱలు


8. బాలురైన వారిపైననూ లేదయ

జాలి గుణము దుష్ట గాలికెపుడుఁ

నీవు గూడ నిలకు రావు యెటుల యింక

హనుమ! రక్ష నీవె! వినుమ మొఱలు

7. ధర్మ పథము నున్న మర్మము చూపించి

మాయ చేసి తుదకు వేయు కాటు!

నట్టి వాఱి నుంచి ననునిత్యమూ మాకు

హనుమ రక్ష నీవె! వినుమ మొఱలు

6. నింద వేసి జనులు బొందిని దీసి

తృప్తిగ నుండునంట! తృష్ణ దీరి!

ఎదురు నిలచి పొడచు ఎత్తు చూపరు వీరు

హనుమ రక్ష నీవె! వినుమ మొఱలు

1. భయము కలిగెనేని నయముగ దీర్చెడి

దైవమీవు ననుచు దలచుచుంటి

జ్ఞానహీనూ తప్పు గాచి గాపాడవే

హనుమ రక్ష నీవె! వినుఁమ మొఱలు

2. బుద్ధి పూర్వకముగ పొడుచుచుండు జనులు

వాని పట్ల జాలి వలదు వలదు

నమ్మి ముంచు వాని నా చెంత రానీకు

హనుమ రక్ష నీవె! వినుఁమ మొఱలు

3. అండ నీవె గాద! అంజనా పుత్ర! యే

దండ వేయలేను! కొండలైన

పిండి జేయగలవుఁ వేదనల్ బాపూమో

హనుమ రక్ష నీవె! వినుమ మొఱలు

4. ఎంత సహనమైన ఎగిరి పోవును గాద

యింత స్థాయి చిక్కులెదురు యీద

శక్తి లేదు మాకు! యుక్తి నీది యొసగు

హనుమ! రక్ష నీవె! వినుమ మొఱలు

5.

గాయమెంతదైన యాయువు మిగులును

కాయము దరుగు మనసు కష్ట పడిన

తనువు వద్దు యనెడి జనులను గాచుమో

హనుమ రక్ష నీవె! వినుమ మొఱలు