Monday, April 12, 2021

ప్లవ ఉగాదికి నా పద్యములు

 శార్వరి యనూజ! నూతన
పర్వ మునకు తెఱఁను దీయ వచ్చేయమ్మా
యుర్విని గమ్మిన పురుగను
దర్వము దరమఁగ సఱగుఁన దయసేయమ్మా


నూతన వత్సరమా మా
హూతిఁ గొని దిరిఁగి యొసగుమ హోత్సాహమ్మున్
సేతువు గట్టిన మువ్వురు
మాతల ముద్దుల తనయుని మనువుకు రమ్మా



అలసి సొలసితిరిట గడచిన కాలమున్
జనులు ప్రాణ హాని జరుగు ననుచు
గడప దాటకుండ కాలము గడిపిరి
మంచి జేయ రమ్మ! మహికి ప్లవమ!


ఆమని!రమ్మిట! కోయిల తీయగ రాగము వీనుల విందుగ పాడును
మామది నిండుగ స్వాగత మిత్తుము మామిడి తోరణ మాలగ ముంగిట
ప్రేమగ యార్తిని బాపుమ వేదన పెంచక; భూమిజ నాథుని యల్లుడు
రాముని ప్రార్థన జేసెద మేమిట రక్షణ తక్షణ మిమ్మని

Tuesday, April 6, 2021

ఏడూకొండల వాడితో నా ప్రయాణము

అది 2005వ సంవత్సరం. రెండు దశాబ్దాల నా కన్నవారి కృషికీ, నేను కన్న కలల కోసం ఇష్టంగా పడ్డ కష్టానికీ, నాపై నేను, నా వారు ఉంచిన నమ్మకానికీ ఫలితం దక్కిన తరుణం.

నేను కోరుకున్న ఉద్యోగం వచ్చిన సంవత్సరం. ఉద్యోగానికై వ్రాత, మౌఖిక పరీక్షలకు వెళ్ళే ముందు నేను మా అమ్మ వంక చూడగానే తను అన్న మాట,  ఆ కలియుగ నాయకునిపై భక్తి చెదరనీయకు, నీ ఆత్మవిశ్వాసాన్ని ఆ స్వామి చెదరనీయరు అని. నాకు బాగా అలవాటైన మా ఇంటికి దగ్గర లో ఉన్న ఆ స్వామి కోవెలకు వెళ్ళే సమయం కూడా లేదు, ఎంతో దూరంలో ఉన్న పరీక్షకు బస్సులు మారి మరీ చేరాలి మరి! అయినా స్వాభి లేనిదెక్కడ, అందరి ఆత్మలోనూ ఉన్నది ఆ సర్వాంతర్యామే కదా, దిగులేలా యని ఒక్కసారి కన్నులు మూసుకుని స్వామి దివ్య మంగళ రూపాన్ని స్మరించుకుని పరీక్షకు చేరుకున్నానూ, ఆ స్వామి దయతో ఉద్యోగాన్నీ పొందాను. 

మా నాన్నగారికి మొదట అర్థం కాలేదు, నాకు అంత పెద్ద ఉద్యోగం వచ్చిందని! కానీ ఆ స్వామి ఆశీర్వదించారంటే నా భవిష్యత్తుని తను అంత ఉన్నతమైన స్థాయిలో వ్రాసినట్టే కదా!

అటు తరువాత స్వామికి కృతజ్ఞతలు చెప్పుకుందామని పరుగు పరుగున తిరుపతికి పయనమై వెడితే చూడాలి స్వామి దయ! కాలినడకన కొండ ఎక్కిన అరగంటలోనే దర్శనమిచ్చేశారు స్వామి! ఆ దివ్య మూర్తి! అందరూ ఎంతో సమయం వేచి ఉంటే కానీ దొరకదన్న ఆ స్వామి దర్శన భాగ్యం మాకు మాత్రం నిరీక్షించే అవకాశం రాకుండానే దక్కింది. ఆ క్షణం నా ఆనందానికి హద్దులు లేవు, ఆనందాన్ని వర్ణించటానికి అక్షరాలూ చాలవు. ఆ తర్వాత మాడ వీధులలో నడుస్తుంటే ఒక యోగి రూపంలో దర్శనమూ, ఆశీర్వచనమూ లభించాయి, ఇక మాకెవ్వరికీ అక్కడ నుంచీ కదిలి తిరిగి ఇంటికి రావాలి అనిపించలేదు. 

అది మొదలు, విడువకుండా స్వామి దర్శనానికి మరల మరల వెడుతూనే ఉన్నాము, అంతటితో ఆగలేదు. 

శివునిలో శక్తీ, నారాయణునిలో నళిన దళేక్షణ, బ్రహ్మ లో భారతీ ఐక్యమవటమంటే - ఆత్మ పరమాత్మతో ఏకమశటమే అంటారు.

అలా నేను నాకు సర్వస్వము అయిన నా పతిదేవునితో ఏడడుగులు వేసింది కూడా ఆ ఏడుకొండల ఏకస్వరూపుని సన్నిధిలోనే. అంగరంగ వైభవమైన వేడుకలేవీ వద్దు, ఆ అలమేలు మంగమ్మ స్వామి సన్నిధియే నాకు మక్కువ అని ఆ నారసింహుని జయంతి రోజున ఆ తిరుమలలోనే నా పతిదేవులతో ఏడడుగులూ నడచి, వివాహమైన వెంటనే స్వామి వారి నిజరూప దర్శన భాగ్యం కూడా పొందాను.

ఆ స్వామి దీవెనతో పండంటి బాబుని కని, ఆ పసివాడికి కూడా ప్రతి యేటా ఆ దివ్య మంగళ సవరూపుని దర్శనం చేయిస్తున్నాం. అంతే కాదు, మా బాబుకి ఎంతో చిన్న వయసు నుంచే ఆ తిరుమల సన్నిధి లోని మాడ వీధులలో... ఆ కోనేటి రాయని నమ్మిన బంటు, భక్తుల పాలిటి కల్పతరువు అయిన ఆ రామదూత తిరుగాడిన చోటనే తనూ సంచరించే వాడు.

ఒక్క దర్శనమొందే వేళ తప్ప... మిగిలిన సమయములో, అర్థరాత్రి అయినా సరే, చలికి జ్వరము వచ్చినా మా బాబు లోపలుండి నిద్దరోవటం ఇష్టపడడు మేము ఆ తిరుమలలో ఉన్నత సేపూ... ఇదంతా ఆ స్వామి కరుణ గాక మరేమిటీ అనిపిస్తుంది.