Tuesday, May 26, 2020

శ్రీ సాయి నక్షత్ర మాలిక - నా రచన

 1.
జయములనిచ్చే శ్రీ సాయీ
దయగల వాడవు నీవే నోయీ
మాయల నుంచి మము కాచవోయి
సాయమెన్నటికీ మానకోయీ

2.

శ్రేయమునూ మాకందించెదవూ
ప్రేమతత్వం మును పంచెదవూ
సహనమునూ పాటించెదవూ
సమర్థతనూ చూపెదవూ

3.

వ్యయము ప్రయాసలు వలదంటివీ
నిన్నూ మేమూ దర్శించుటకై
నీవే మాకడకొచ్చితివీ
నిన్నూ మేమూ చూడదల్చినన్

4.

షిరిడీ నందూ వెలసితివీ
సిద్ధులనెన్నో చూపితివీ
శిక్షణ మాకూ ఇచ్చితివీ
సచ్చిదమునూ పొందుటకై


5.

శ్రీ కర శుభములు కూర్చుటకూ
శీఘ్ర ఫలములనిచ్చెదవూ
శాంతం శ్రద్ధా నెలకోలిపీ
ధ్యానం దానం నేర్పితివీ

6.

షిండే షింపీ శ్యామా మాధవా
రాధా మాయీ బాయిజా బాయీ
భక్తులెందరైన పథమొక్కటే నీది
ప్రతి జీవిని గౌరవించుట

7.

హేమాద్రి దాసా శ్యామా మహల్సా నానా కాకా
ఐకమత్యమే బలమంటివీ అందరినీ కలిపీ ఉంచితివీ
ఎక్కడ ఉన్నా నీ వైపునకూ
మమ్మూ నీవే చేర్చితివీ

8

గురువుల అవతార పరంపరగా
భువిపై నీవూ వెలసితివీ
జ్ఞానమును మాకూ పంచితివీ
ముక్తిధామముకు నడిపించితివీ

9.

పేర్మి ధర్మం మాకు చూపీ
ప్రజలనెల్ల ఏకం చేస్తివీ
మత బేధములను బాపుతూనే
స్వధర్మమును నిలుపమంటివీ

10.

ఏ రూపమునా తలచినచో
ఆ దైవముగా అగుపించెదవూ
ఆరాధించే గురువులనే
కొలుచుట పద్ధతి అని తెలిపావూ

11.

భాషా పురాణములందూ
బహు పట్టూ గలవాడివిగా
భాగవతం వివరించావూ
భాష్యమునూ బోధించావూ

12.

అక్షర పఠనము చేసిననూ
ఉపనిషత్తు తెలువకుండినా
ఆచరణ చూపీ నేర్పావూ
ఆచటకు భక్తులనీ పంపీ

13.

నీ స్థానమునే నీవుంటూ
విషయములనన్నీ గ్రహియించితివీ
భూత భవిష్యత్ తెలిపితివీ
భయములనెల్లా తీర్చితివీ

14.

నదులూ తీర్థములు నీయందే
నీయందు పారుచుండెనుగా
క్షేత్రములనతన్నీ నీవేగా మా
మోక్షధామమూ ద్వారక మాయేగా


15.

ఇటుక పైనే శయనించితివీ
ఇహనుండు సౌఖయమును జయింతివీ
ఇడుములనన్నీ తీసితివీ
ఈడేర్చితివి మా కష్టమ్ములా

16.

ఈతి బాధలన్నియూ బాపితివీ
ఇనుమడించెను నీ కీర్తీ
ఇక్కట్లనూ తొలగించితివీ
ఇలలో మమతను నింపితివీ

17.

ఇష్టమయిష్టమను ద్వంద్వములూ
ఇరుకైన మనఃతత్తవమునూ
ఇసుమంతైనా చూడము నీలో
ఇందూ అసత్యం లేదయ్యా

18.

ఉత్సవమ్ములను‌ చేసితివీ
ఉత్సాహమ్మూ నింపితివీ
ఉత్పాతములూ తొలగించీ
ఊపిరులూ నీవు నిలిపితివీ

19.

ఉల్లి రొట్టెలూ ఆరగించుటలో
ఉపదేశమునూ బోధించితివి
ఉపన్యాసమ్ములూ ఈయకనే
ఉపనిషత్తులని విడమర్చితివీ

20.

ఉపవాసము వలదంటివీ
ధ్యాస ధ్యానం చాలంటివీ
దైవం పస్తు కోరదనీ
దయతో మాకూ తెలిపితివీ


21.

ఉప్పెనలెన్నో బాపితివనీ
ఊరూరా నీ కీర్తనలే
ఉదార స్వభావా ఓ సాయీ
ఉప్పు నీటినే నీవు మార్చితివీ

22.

ఋతువులు అన్నీ నీ లీలలే
ఋజువులు ఆగిన ప్రళయమ్ములే
ఋణశేషం మాకు తీసివేయుమయ్యా
రణరంగమన్నదెచ్చటనూ వలదయ్యా

23.

ఆరోగ్యం సదా అందేను మాకు
అంటు వ్యాధులు ఎన్నో బాపేవు కదయ్యా
అందరూ కలసీ ఆడే చోటా
అవాంఛనీయము లేనే లేదూ

24.

అగ్ని నుండి బిడ్డడిని తీసినావూ
ఆకసమున వాననాపినావూ
అంతటా వీచే గాలి చూపిన
అతివేగమునూ ఆపి వేసినావూ


25.

నూతిన నీరు ఉప్పవు కాదిపుడు
గాలి యందు బల్లపైనే శయనించితివీ
భువిపై మట్టియె నీదు ఊదీ
భూతమలన్నీ ఇవ్విధముగ నీకు వశమే

26.

భిక్షాటనమ్మూ చేసితివీ
కానీ అందరి ఉదరములు నింపితివీ
దాచుకొనుట కంటే దానమే ఘనమనీ
దయతో ఉండుటే ధర్మమంటివీ

27.

పులి నీ ఎదుటే ప్రాణంబు విడిచే
అశ్వమ్ము జాడను నీవూ తెలిపే
బల్లి ఆగమనము వచియించావూ
సర్ప ముంగీసల వివాదము తీర్చావూ

28.

శునకమును శిక్షించ వద్దంటివి
వాటి ఆకలి బాధ్యత వహియించితివీ
సర్ప విషమును తొలగించితివీ
శ్యామానూ నీవూ కాచితివీ

29.

ఈ రకముగా జంతు జాలమును
నీ పరమేనని గ్రహియించితిమీ
బేధ భావములు ఎరుగక అందరమూ
నీ ఎదుటనే ఉండెదమూ

30.

పుష్ప వనమును పెంచితివీ
లెండీ తోటను సృజియింతివీ
పచ్చదనమును అంతటా నింపితివీ
ప్రకృతి నిటులా కాస్తివీ

31.

మనతోనే మిగతా జీవులు అంటూ
మమేకం చేస్తూ ఒకరికి ఒకరమని
కలిసుంటేనే పృథివి సాగునని చూపీ
ఆదర్శముగా నిలిచితివీ

32.

నీలో అందరి రూపం కదలాడునూ
అందరి ఆత్మా నీవై ఉండెదవూ
సృష్టి అంతా ఒక్కటనినావూ
సమృద్ధిగ సమిష్టిగా మము చేశావూ

33.

అంతటా ఒక్కటేనను తత్త్వం
అవలీలగా నువు చాటావూ
అవని అంతా మమతానురాగాలు
అందరిలోనా నింపావూ

34.

నింబ వృక్షపు నీడలో
నీవూ మాకై వెలిశావూ
నిండుదనమునూ నీ చుట్టూ
నింపిన మా గురువువీవూ

35.

నమ్మకం సహనం నిజమైన
నగలూ మనసుకి అన్నావూ
పగలూ రేయీ మాకై నిలచీ
నీవారిగ మమ్ము కాచావూ

36.

ఆపదలన్నవె రావూ మాకూ
ఆప్తుడవై నీవుండంగా
ఆదరమున చూచుచుంటివి మమ్మూ
అవతారమునూ చాలించిననూ

37.

పై వాడికి బంటును మాత్రమే అంటూనే
ప్రతి విషయానికి నీవై నిలిచావూ
ప్రజలనెల్ల నీవు బ్రోచావూ
ప్రమోదములనూ నింపావూ

38.

చిత్తముతో సాయిని చేరండీ
చిక్కులు మనకెపుడు రావండీ
చందనమ్మునూ అందుకునీ
చావడి నుండి మననూ చూసెదరండీ

39.


మనుష్యులమయ్యా మేమందరమూ
మాయలోనే పడి ఉండెదమూ
మోక్షమ్మెన్నడు కోరామని
మోహము లోనే మునిగెదమనీ

40.

మాపై కినుకా వలదు సుమా
మా పథము కడకూ మీ వైపేగా
ఈ జూదములో మిమ్ములనూ
ఇహమునకు తలుచుట విడువముగా

41.

నీ స్మరణకు కారణం ఏదైనా
మా ప్రతి కదలికా తలపూ
నీవాడించే నాటకమే
కనుకే మీకూ దూరం కానట్టే

42.

మరచిననూ మేము మిమ్ములనూ
మీరెపుడూ మమ్ము విడువరుగా
మాతృ మమత మరి చూపితిరీ
మార్గమునూ మాకు తెల్పితిరీ

43.

వేదనలోనా మేముంటే
వేగిరమే మా కొరకొచ్చెదవే
వ్యధలనన్నీ తీసివేసీ
వేడుకనే చేసెదవే

44.

సద్గురు అంటే ఇంతేగా
సచ్చిదానందము మాకు తెల్పుటేగా
సహవాసము మేమొనర్చినచో
సాయుజ్యమునే పొందెదమూ


45.

ఎంతని వర్ణించను నీ మహిమా
ఎన్నని వివరించెద నీ లీలలూ
ఎరుగమె మేమూ మీ ఘనతా
ఎప్పటికి వ్రాయగలం మీ చరిత్ర

46.

ఎన్ని యుగాలు దాటనీ
ఏయే రూపాలు ధరియించనీ
శాశ్వతమూ నీవే సత్యమూ నీవె
మా ఐశ్వర్యమూ నీవే

47.

నీ ఊదీయే రక్ష మాకూ
నేలపై ఉన్నా మట్టినైనా
నీ నామము తలచి ధరియించినచో
ఫలములనూ పొందెదమూ మేమూ

48.

అప్పా యోగులు ఎందరో
ఎపుడూ నిను స్మరియించెదరూ
నిజమైన భక్తి కలిగినచో
నీ నీడ అందరికీ అందునే

49.

పతాకమ్ములూ పైపైకే
అంటవు నిన్నూ ఏ భావమూ
ఎరుగని వారూ ఈ విషయం
ఎంచెదరూ నిన్ను మన్నించుమా

50.

ఇటూ వంటివన్నీ నీ లీలలే
మాకూ విషయములు తెలిపేందుకే
మమ్మూ వారికీ తెచ్చేందుకే
నీ దరికీ చేర్చేందుకే

51.

‌‌ఎరుగనూ నేనూ ఏ వేదమూ
చదువగ లేనూ ఏ స్తోత్రము
సేయగలేనూ పూజలనూ
లెలిసిందొకటే నీ నామము

52.

తలచుచునే ఉందును నిత్యము
నిను విడువక ఉండుటె నా నియమము
అందరియందూ నిన్నే చూతును
అన్నార్తులకూ ఆకలి తీర్చ ప్రయత్నింతును

53.

పరీక్ష చేయకెపుడు మాకు
నిన్ను మనమునందు ఉంచితిమా
నీ స్మరణనెపుడు సేయుదుమా అని
మా పదము పథము పాదము పద్మము లెపుడు నీ వైపే


54.


ఉపసంహారం అంటూ లేనే‌ లేదు నీ
ఔన్నత్యమునూ వర్ణించుటకూ
వాగ్దానము ఇదే సాయీ మా
వందనం నీకే ఎల్లప్పుడూ

నాగిని కలమున సాయి
నాధుడు పలికించిన తీయటి
గుళికలు సాయీ లీలలు పలుకులు
మాకెన్నటికీనవే ధైర్య వచనములు

Tuesday, May 12, 2020

శ్రీ నారద

శ్రీ నారద మా శ్రియమును కోరి
శుభములకై సంచరించీ సదా
శారగధరుని స్మరించే వీణాధారీ
శ్రీ హరి భక్తా ఓ కరుణా వరదా
నీ మాటల లోనా మర్మం ఉన్నా
నీ మది ఎపుడూ నుండును మౌనమునందే
నీలమేఘశ్యాముని ధ్యానమునందే
నారాయణుని మాయేనది నిక్కమూ

Wednesday, May 6, 2020

శ్రీ నృసింహ జయంతి - శార్వరీ నామ సంవత్సరం




  • శ్రీమతి లలితాదిత్య నిమ్మగడ్డ గారు పంచిన అనఘమ్మ అనఘయ్య పాట రాగంలో


తదియ నాడు పరశు రాముడు
చతుర్దశమున నారసింహ అంటూ
నవమి ఐతే రామచంద్ర అంటూ
శ్రవణమైతే వేంకటేశ ద్వాదశిన వామన
అష్టమి నాడు కృష్ణా అంటూ
దినమునకొక పేరుతో అర్చించెదమయ్య మిమ్ము
పూజలు మరి సేయలేను కీర్తనలూ వ్రాయలేను
ఫలములు పరమాన్నమస్సలే వడ్డించలేను
ఓ దేవా నువు వినవా మంది లోనీ మాదు మనవి
ఉదరముకై భక్ష్య భోజ్యములు వండేటి జనులు మేము
బువ్వ పెట్టే నీకు అంటె సత్తువ మరి లేదనందుము
ఉల్లాసం సరదాలంటు రొక్కమెంతో పోసే మేము
నీ పేరుతొ చేసే సేవలకై నిక్కముగ తీయబోము
పాపపు భీతి ముదిరితేనే క్షేమము కైన చేరెదము
నేటి మా జీవన శైలిలో అది కూడా విహార యాత్రే
పండుగైనా పబ్బమైనా ప్రతి దినమూ వోలె నాకు
పూని అంటే మరి వృత్తిదే కానీ నీ కొరకేమి చేయలేను
ఊరందరి ముందరకూ పీతాంబరం ధరించే నేను
నీదు ఉత్సవమంటే ఉట్టిగనే ఉంటానందును
ఓపికలు లేవంటూ దాటేసీ విశ్రమించెదనూ
అంతిమంగా చేరేదీ నిన్నే నన్న ధైర్యమేమో
దయయుంచీ ఎంచక మము మన్నించీ కాచుమయ్యా
బిడ్డలము కదా మీకు పెద్దరికం వహించవలయు
అన్నింటా అదిలించక ఆదరించ వెయ్యి మమ్ము

Tuesday, May 5, 2020

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి

మురుగేశా మయూర‌ వాహన
మానస సోదర మాతృకల తనయా
మాననీయా మము దయ చూడవయా
మా కష్టముల బాపుమయా
మహేశ జ్ఞాన బోధకా మయూఖ సోదర
మహి మండలమున ఉదయించిన
మహామహిమాన్విత దేవా
మము దీవించుమా కరుణావరదా