#పిల్లలమీదప్రేమజనించినక్షణం
ఎక్కడని మొదలుపెట్టను?
తొట్ట తొలిగా గర్భిణినీ అని తెలిసినప్పుడా?
తొట్టతొలిగా బిడ్డ స్పర్శ గర్భంలో తెలిసినప్పుడా?
తొట్ట తొలిగా బిడ్డను చేతులలోకి అందుకున్న ఆ క్షణమా?
ఇది "నాదీ" అని దేవుడు నాకు ఇచ్చాడని అర్ధమైన క్షణమా?
ఆనందభాష్పాలు రాలుతున్న గత 11 సంవత్సరాల ప్రతిక్షణమా?
అడుగడుగునా బిడ్డ పాలు తాగుతున్నప్పుడు పొందుతున్న ఆనందాన్ని, కేరింతల కొడుతూ వళ్ళో దూకుతున్న క్షణాలను, ఎన్ని పొదివి పట్టుకున్నానో?
ఇలాగే కొన్ని వేదికల మీద వ్రాశాను కూడాను. ఎక్కడ మొదలు పెట్టను?
బాబు నా చేతులలో ఉండంగానే ఉద్యోగాల్లో కూడా అందుకున్న విజయాల గురించా?
అంతర్జాతీయ స్థాయిలో ప్రచురితమైన నా పేపర్ల గురించా?
ఒకటి రాస్తే ఇంకొకటి తక్కువ చేసినట్టే, అన్నీ సమమే కదా మనకి.
మచ్చుకి ఇదిగో!
1.
పిల్లలకి ఇష్టం అని, చిన్న ప్లాస్టిక్ గద బొమ్మ కొన్నాను ఓ సారి. ఓ గుడి దగ్గర ఉండంగా చేతులలో ఉన్న పిల్లవాడు అది చూసి ఆనంద పడటం గమనించి. అదీ సింధూర వర్ణంలో. ఇక ఆగుతానా మరి? అయితే, అలవాటు ప్రకారం అమ్ముకున్న కవరు తీయకుండా ఆడించేస్తున్నాను. అలా అడిస్తూనే పక్కనేదో పని చేసుకుంటున్నాను. ఒక్కసారిగా ఆ గదిమకి ఉన్న వల (అదే కవరు) - అందులో వేళ్ళు చిక్కుకుని పిల్లవాడు బాధపడ్డాడు. గట్టిగా ఏడ్చాడు. అంతే, విలవిలలాడి పోదూ నా ప్రాణం?
ఎలా ముని వేళ్ళతోనే కత్తిరించానో తెలియదు, వలను చీల్చి పడేసాను.
తర్వాత చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది.
2.
అలాగే పిల్లవాడిని వడిలో వేసుకుని మరోసారి, ఆఫీస్ మెయిల్ కి అలవాటు ప్రకారం మొబైల్ నుంచిని స్పందన ఇస్తున్నాను. పుట్టింట్లో ఉన్నాను అప్పుడు. మామూలుగా బొద్దింక కనబడితేనే, అసలు నోరెత్తిని నేను, అన్ని వీధులకు వినబడే లాగా అరుస్తాను భయంతో. నిజానికి ఆ అరుపు గొంతు దాటి రాకపోయినా, నా భయం అలా ఉంటుంది. అలాంటిది, ఆ రోౙు, ఓ పురుగు నా వైపుగా వస్తోంది. వడిలో బాబు ఉన్నాడు. చూసేవాళ్ళకు అది చిన్న సంఘటననే కావచ్చు. నా మటుకు మాత్రం నాకది, మరుగుజ్జు కొండ ఎక్కినట్టే. ఎలా తీశానో తెలియదు, ఆ పురుగుని ఎడమ చేతితో అంత దూరానికి విసిరేసాను. అది మళ్ళీ నా వైపుగా వస్తుంటే, పక్కన ఖాళీగా ఉన్నావ్ ప్లాస్టిక్ డబ్బానికి తిరిగేసి మూత పెట్టాను దాని మీద.
బయటనుంచి లోపలికి వస్తూ, గుమ్మానికి ముందరే కాళ్ళు కడుక్కుంటున్న మా అన్నయ్య, నాకు సాయం చేయడానికి వేగంగా నా వైపుకు రాబోతూ, ఇది చూసి, ఎంత ముచ్చట పడ్డాడో. ఎంత మెచ్చుకున్నాడో.
3.
ఉయ్యాలలో ఉన్న పసివాడు, బొంతలు కప్పినా, చలిగా ఉందని వణుకుతూ ఉంటాడేమో, ఇబ్బంది పడుతూ ఉంటాడేమో అని, ఇదీ పుట్టింట్లో ఉన్న రోౙున సంగతే, వంట గదిలో అమ్మకేదో సాయం చేద్దామని వెళ్ళిన నేను, కాస్సేపటికే గదిలోకి వచ్చి చూస్తే, బొంతలన్నీ కాళ్ళతో తన్నేసి, హాయిగా నవ్వుతూ ఆడుకుంటున్నాడు.
నీ పని ఇలా ఉందా అని, చేతులకి గ్లౌజు, కాళ్ళకి సాక్సులు తలకి క్యాపు తొడిగేసి, తల చుట్టూత మళ్ళీ బరువు అయిన గుడ్డలు అడ్డు పెట్టి, "ఇప్పుడు చెప్పు" అన్నట్టు చూశాను. నవ్వాడు.
"ఇప్పుడు అమ్మమ్మ వస్తే నువ్వు ఓడిపోయావు అనీ, నేను గెలిచానని ఎలా చెబుతావు, నిన్ను కట్టేసాను కదా అన్నిటితో", అన్నాను. అప్పటికే మా అమ్మ కూడా వచ్చేసింది ఆ గదిలోకి. "భలే కట్టేసింది రా, మీ అమ్మ నిన్ను", అని ముచ్చట పడింది మా అమ్మ. ఎందుకంటే నేను చాలా బద్ధకస్తురాలిని మరి. కానీ ఈ పని ఎలా చేసేసాను, అసలు ఆలోచన ఎలా వచ్చేసిందో నాకు, అని అమ్మ సంతోష పడింది.
మా అమ్మ అలా అంటూ ఉండంగా, నేను "ఇప్పుడు చెప్పు", అన్నట్టు చూశాను కదా. కాళ్ళవీ, చేతులవీ కూడా, ఆడుతూనే తీసేసి, హాయ్ చెప్పినట్టు ముని వేళ్ళూపాడు, మా అమ్మ వంక చూస్తూ,
నవ్వుతూ.
"నేనే ఓడిపోయానే" అనుకున్నాను.