Saturday, November 5, 2022

కవిశ్రీ గారిపై

శార్దూలవిక్రీడితము

వాత్సల్యమ్మును బాల్యమందె కరవై పాట్లెన్నొ జూచేను; యే
మాత్సర్యమ్మను జేరనీకనె సదా మౌనమ్ముగా ధ్యానులై
యుత్సాహమ్ముగ తా రచించె తను కావ్యోధ్యాయి గాకున్ననూ
సత్సంతోషమొసంగె కన్న కలలే సాకారమాయేనికన్

మత్తేభవిక్రీడితము

కవితా నామము పెట్టి పుత్రికకు సత్కార్యమ్ము గావించిరే
భువి పై వేరగు దేశమందు దిగి యే భోగమ్ము నాశించకన్
శివునిన్ భక్తిగ నిత్యమున్ గొలుచుచున్ క్షేమమ్ముగా జేరి తా
చివురై పూచెను పద్య రంగమున నిక్షేపమ్ముగా సాగుచున్

ఉత్పలమాల

పిన్న వయస్సునందె తన విద్య ప్రదర్శన జేసి నాటికల్
వన్నె రచించుచున్ కళను పట్టియు ముందుకు దూకుచుండె తా
సున్నిత మైన తత్త్వముకు జోడిగ నుండు ఘనుండు కాసులన్
మిన్నగ దల్వబోక చనె మేలుగ చక్కగ భారతావనిన్

మత్తేభవిక్రీడితము

కవితా నామము పెట్టి పుత్రికకు సత్కార్యమ్ము గావించిరే
భువి పై వేరగు దేశమందు దిగి యే భోగమ్ము నాశించకే
శివునిన్ భక్తిగ నిత్యమున్ గొలుచుచున్ క్షేమమ్ముగా జేరి తా
చివురై పూచెను పద్య రంగమున నిక్షేపమ్ముగా సాగుచున్


ఉత్పలమాల 

కష్టములెన్నియో పడిరి కాల పరీక్షలు దాటినారహో
నిష్టగ నిల్చి సత్యమను నీమముతో పయనమ్ము జేయుచున్
స్పష్టముగా మనోరథపు వాంఛగు చక్కని పద్యమాలికల్
వృష్టిగ వ్రాసి ముందుకిక ప్రీతిగ సాగుచు వృద్ధినందెనే

ఉత్పలమాల 

దేవులపల్లి వారి కృపఁ తీయని పద్యములల్లు శక్తితోన్
తా విలువైన నీతులను ధారగ వ్రాసిరి వంద సంఖ్యతో
భావి తరమ్ముఁవారు తగు పద్ధతిలో నడచేందుకై భళా
యీ విధమా కవీశ్వరులు నీ ధరపై కవిశ్రీగ మారిరే

No comments: