Sunday, April 26, 2020

తారంగం - తాండవం

కాళింది పైనా కృష్ణుడు ఆడెను తారంగం
సర్పముతోటీ శివుడూ చేసెను తాండవం

గోలోకమున వేణుగాన లోలుడు ఆడెను తారంగం
కైలాసమునా ఢమరుక నాధుడు చేసెను తాండవం

రాధాదేవితో రమణీ పతి ఆడెను తారంగం
రాకేందువదనతో రుద్రుడు ఆడెను తాండవం

నందుని తనయుని రస నర్తనమే తారంగం
నందివాహనుని మధురసభరిత నాట్యమే తాండవం

నళినదళేక్షుని నటనా కౌశలం తారంగం
నటరాజుని నర్తనా పటిమా తాండవం

నీరజనాభుని పద వినోదమె తారంగం
నీలకంఠుని లయ విన్యాసమె తాండవం

శ్రీ కాళహస్తి కవితలు రాగం

హస్తి  (కాలం కాని కాలంలో కోయిల పాటలెందుకనో... రాగంలో)

భాగవతం లోని గాధలలో మా కరుల గాధలున్నవిగా
భగవంతుడే తానొచ్చీ మకరుల నుంచి మమ్ము కాచెనుగా

గజముఖ వదనుడు నీ తనయుడే
గజలక్ష్మీ మరి నీ సోదరే

గజ ఉదరంలోనే కొలువున్న గౌరీపతి వందనమిదిగో
గంగాదేవితో జలరూపాన నిను అభిషెకించేముగా

అందుకోవయ్యా మా అర్చనా అంబాపతి ఆనందంగా
అలంకరించేను నిను నేనూ అరవిరిసిన విరి కాంతులతో

కాళ (వేయి సుఖములు కలుగు నీకూ రాగంలో)

వేయి పడగలు కలవు నాకూ కాని వర్ణింప అలవి కాదూ
వేన విధముల కొలుతు నిన్ను నన్ను ధరించిన శ్రీ కంఠా

భూషణమును నీదు వారలకు బహు విధములుగా
భవానీకీ కేశము నేనూ లంబోదరునీ యజ్నోపవీతమును

వల్లీ పతికీ రూపం నాదే అస్తీక మునిని కాదే
వైకుంఠ వాసునకూ నే తల్పమును కానా

కాళిందీ మడుగునై నే కొలనులోనూ నిలిచితీ
వాసుకిగా పాలకడలిని చిలికి విషమును గ్రక్కగా

చక్కగ పట్టీ మెడకు చుట్టీ నన్ను నీవూ కాస్తివే
చేయి కాలు విడిగ‌ లేవు నాకు ఐనా నిను నే సేవింతునూ

విడువకయ్యా నన్ను ఎన్నటికీ విషము కలదానననీ
వినుము నా ఈ మనవి స్వామీ ఆదరించుమా నన్నూ

శ్రీ: వేయి సుఖములు కలుగు నీకూ రాగంలో

అన్యులలె లేదు నాకు ఎట్టి చరిత్రా అమరేశ్వర
ఆదరించవయ్యా నన్ను నిన్ను నే అభిషేకింతునూ

అన్ని అంశలూ నీవే కదా మరి అప్పుడు నేనైననూ
అలవి కానీ దాననైనా అంతరంగమున స్మరియింతునూ

శ్రీ భోళాశంకర భక్తురాలు

బెజ్జ మహాదేవి వోలె భజనలు వ్రాయగా లేదామె
భక్తబాంధవులను పిలిచి భోజనాలు‌ వడ్డించలేదామె

శివ సాన్నిధ్యం చేరే ముందర ఉసురు పోయిన
శరీరమునకు పూసిన బూడిద విభూది సమమామెకు

సకల చరాచర వస్తువులందూ సదాశివునే దర్శించే
సనాతన నమ్మిక ఆమెది సగుణోపాసన నిర్వచించెను

రాతిలో స్వామిని అనుభూతించెను రోలి రోకలినే అర్చించెను
నీటిని గంగని అభిషేకించెను సైకతమె విభూతి అని అలంకరించెను

నుదుటిపై జారే జలములకడ్డుగ త్రినేత్రుని
నయనముల కాచగ తన హస్తములనే హద్దులు చేసెను

అర్ధనారీశ్వరుడని పసుపు కుంకుమ పువ్వును పెట్టెను
అన్నీ స్వామి అంశలే అని ఆకులు ఫలములు నైవేద్యమనెను

శిరమున నిలిచిన శశి వోలే నేత్రమైన దినకరుని వోలె
ప్రియ పుత్రులైన వక్రతుండ వల్లీపతి వోలే

పుడమి అంతా తిరిగి ప్రదక్షిణ చేయలేనని నీరుగారలేదు
కపటం లేని భక్తి ఉంటే సాధ్యం కానిది లేదని తలచెను

తానున్న చోటే కైలాసమనెను ఆత్మ ప్రదక్షిణ గావించెను
కరములు చేసే ప్రతి పని స్వామికి చేసే సేవేననుకొనె

కలముతొ వ్రాసే పదములు ఢమరుకం లోనివె
కనుకే అంతా కామేశునికే అర్పణ‌‌ అనుకొనె

పదములు వేసే ప్రతి అడుగూ పర్లీనాధుని వైపే ననుకొనే
మనమున వచ్చే తలపులు అన్నీ మాహేశుని గూర్చే చేసే

ఇంతకన్నా భాగ్యం ఇలన ఇంకేమున్నదనే
ఇహపరములన్నీ స్వామి ఇచ్చే అని తెలుసుకొనే