Tuesday, November 5, 2019

నీటి ఎద్దడి,చందమామ :-- నాగిని

నీటి ఎద్దడి:
=======
నేలను త్రవ్వి చూశాను - నింగికి ఎగిరీ వెతికాను
గాలిలో తేమకై తలచాను - అగ్గిలో ఆవిరైనా ఉందని ఆశించాను
ఎందెందు ఉండునో అన్నన్నీ గాలించాను
కానీ నీటి చుక్కనైనా పొందలేక పోయాను
కన్నీటనైనా కానరాని కాస్తంత తడి కోసం వెతికి వెతికి నీరసించాను
భగీరథుడు యత్నించాడంటే నాడు జగమంతా జలం నిండి ఉంది
విఫల యత్నం నాదయ్యిందంటే నేడు ఇసుమంతైనా అది లేకపోయింది
-- నాగిని (కలం పేరు),  మాధురి (పేరు)

చందమామ -- నాగిని
==============
తెల్లని మల్లెల వంకకు చూస్తే నవ్వుతు చందురుడు కనిపించాడు 
ఎవ్వరు నువ్వు అని పలుకరిస్తే అందరికీ మామను అని చెప్పాడు 
అందుకోవాలని ఆరాటపడితే తాను గగన కుసుమానన్నాడు 
మామ కాని మామ ఎవరంటే చల్లని వాడు చందమామన్నారు
చేయి చాపి చూసి చెంత లేడని తెలుసుకుని 
అద్దం లో కని ఆనందిస్తుంటే
చక్కనైన పుస్తకం - తోడుండే నేస్తం 
జాబిల్లిని మరిపించే గొప్పదనం - చీకటిని పారద్రోలే తెల్లదనం 
ఉన్న "చందమామ" వచ్చింది నాకు వారసత్వంగా పుస్తకాన్ని అందించింది అమ్మ. 

అక్షరాలు నేర్చుతూ అది చదివాను
అందులోని నీతులు తెలుసుకుంటూ పెరిగాను
పసి వయసు నించీ పెరిగాక కూడా పక్కనే ఉంచుకుంటున్నాను
తరాలు  మారినా సముద్రాలు దాటినా వన్నె తరగనిది "చందమామ"
పున్నమే తప్ప అమాస ఎరుగదు ఈ వెన్నెలమ్మ
తీయని మాటలు అన్ని కాలాల్లోనూ పంచునమ్మా


అమ్మమ్మ నించీ తను పొందిందీ అంతటితో ఆగక నాకు పంచింది
నా సుతునికది నేను ఇచ్చాను పెంపకం ఇక కష్టం కాదని అనుకున్నాను
ఆకాశంలోని చందమామ వెన్నెలని పంచునమ్మా
అందుకోవాలని చూస్తే అందని మావేనమ్మా
తెల్లని చల్లదనం, స్వచ్చమైన మంచిదనం కావాలంటే
అద్దం దాకా ఎందుకమ్మా చేతిలో చందమామ ఇదుగోనమ్మా 

శ్రీ పరా దేవతా

పరా దేవత ప్రసన్న వదనం స్రృజియించెను విశ్వాన్ని
శిరమున శశి నింపెను అందున విశ్వాసాన్ని

ప్రకృతికి ఇంత తీయదనమేల ఒనగూరే
పరమేశ్వరి చెరకు గడని కుంచెగా చేసి చిత్రించినందువల్ల

పంచభూతాలకు అంత కారుణ్యమెక్కడిది
అది ఆ తల్లి శరముల నుంచి వచ్చినవి కదా

అష్టదిక్పాలకులు అంత స్థిరంగా ఎలా ఉన్నారు
అది దేవత నొసట నుంచి వచ్చినవి కనుక

సూర్య చంద్రులు గతులెలా నిలబడినవి
అది శక్తి సునేత్రాలు కదూ అవీ

పుడమి తల్లికి ఆ వాన జల్లు ఎక్కడిదీ
రమా వాణీ ల వింజామరల నుంచి వచ్చినవి కదా


కలం పేరు: శేషు (నాగిని)
పేరు: మాధురి

రాజ రాజేశి అష్టక రాగంలో:


అంబా శాంభవి శాంకరీ శార్వరీ పార్వతీ

కాశీ ప్రాసాద నాయకీ శ్రీ క్రీం శుహదరీ

సాయుజ్యామృత ప్రదాయినీ ప్రభావతీ భైరవీ

ఛిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి || శ్రీ రాజరాజేశ్వరీ ||


అంబా మోక్ష స్వరూపిణీ మోహినీ భార్గవీ

మాతా మలయాచల వాసినీ మాహిషాసుర మర్థినీ

మూకాసురాంతకా ముదితామణీ మృణాళినీ

ఛిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి || శ్రీ రాజరాజేశ్వరీ ||


అంబా శారద శార్ంగధాదరా శ్రీ శివా ప్రియ సతీ

శార్దూలాసనా స్థితకరీ శశి శేఖర పల్లవీ

అంబా భారతి భవభయహారిణీ భ్రామరీ రూపిణీ

ఛిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి || శ్రీ రాజరాజేశ్వరీ ||


అంబా వాణీ గాన లోల లహరీ  వామాంకవాసినీ

వారిజాక్ష సహోదరీ విశ్వనుత వీరోచిత శిరోమణీ

అంబాపరాజితా అంబుజాక్ష పూజితా

ఛిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి || శ్రీ రాజరాజేశ్వరీ ||


అంబా త్రిభువని త్రైలోక్య అర్చితా త్రిపురాంబికా

అజ్ఞానాంధకార నాశిని తిమిర దీపోజ్జ్వలా

అంబా త్రినయనుని తరుణీమణీ తపః ఫల ప్రదాయిని

ఛిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి|| శ్రీ రాజరాజేశ్వరీ ||


అంబా సకల కళా వల్లభీ సామగానరస రూపిణీ

చిన్ముద్రాలంకృత చిరుదరహాసిని మృదుభాషిణీ

అంబా మందగమనా మహిమండల పాలినీ మాహేశ్వరీ

ఛిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి || శ్రీ రాజరాజేశ్వరీ ||


అంబా చందన చర్చితా చాంపేయ కాయా కళత్రా

కాంచీపురాధిపా కామాక్షి కామదాయనీ

కైవల్య పథార్చితా కైమోడ్పు నేత్రిణీ

ఛిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి ||శ్రీ రాజరాజేశ్వరీ ||


అంబాష్టాదశ పీఠవాసినీ అమంగళ నాశినీ

అష్టైశ్వర్య ప్రసాదినీ అఖిల భువనేశ్వరి

అంబాసురవధాంతకా ఆదిత్య మండల సంస్థితా

ఛిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి|| శ్రీ రాజరాజేశ్వరీ||




గరికపాటి గారి గురించి:

గరికపాటి వారు మొదలెడితే జోరు ఆ
గరిక వారిది అద్భుతమైన తీరు మంత్రించిన
గరిక రీతిని సాగు మనకు పాఠములెన్నో నేర్పు సా
గరిక పోటుకు అది సాటి వారన్నింటా మేటి

రతనముల సంఖ్యతో మొదలగును
మరి భోజరాజు ఆస్థాన కవులను దలపింప జేయును
చదరంగ గడుల సంఖ్యనుండి ఏకత్వమును గోల్పోయిన పిమ్మట
అది నలుదెసలకూ వాటి మధ్య దెశలకూ గలువున్
అదియే మరల వచ్చి జేరున్
మరల వచ్చుటకు ముందు నొకటి మరల గోల్పోవున్
ఉంగరపు వేలుకు ఇటు రెండు అటు రెండు దగిలించినన్ వచ్చెడిది మరల వచ్చినది


ఇరువంటి శివరామకృష్ణ - నాగలక్ష్మి

వరలక్ష్మి విష్ణువుల సుతుండు
తన్నెరింగినవారికెల్ల హితుండు
కుశలము కోరేటి కృష్ణయ్యకు
మదినెరిగి ముదమొనర్చుచు
నగుమోముతొ నడయాడుచు
నీలమేఘశ్యామనాముని సీతారాముని
ఆనందాల గని అరవిందుని అందించెన్

కేశములు - కస్తూరి రంగ రంగా రాగం


తల్లి నీ కురులెల్లనూ దలచినా ఉండవు క్లేశమ్ములూ
మనమునా మరి కొలిచినా జేరవూ ఖేదమ్ములూ

వనమునూ దలపించెడీ విరులు నెలకొన్న కురులూ అవీ
వెన్నెలను నింపేటి ఆ నెలవంకకే తలమానికం

మోముపైకీ ఇంపుగా కనిపించు ముంగురులవీ
మూడవ నేత్రమ్ములో నుండేటి అగ్నినీ చల్లార్చునూ

తిమిరముగ అగుపించెడీ ఆ వర్ణమే అండగా
తాటంకములను మోసెడీ కర్ణమును అవి తాకగా

తాపసులకూ సైతమూ తమగుణమునూ అవి బాపునూ
తరుణులూ శిరములకునూ కోరెడీ సిరి నిధులివీ


-------------------------------------------------------------------

భద్రమ్మునొసగే శ్రీ కాళి దేవీ
భయముల హరియించు నీ కురులు మాకూ

తలపించు తలపై అవీ చిక్కటి చీకటి రాతిరినీ
కాలవర్ణమున కనపడును కాననే ఆ తిమిరమ్ము

భైరవునితొ చేరితెనేమో స్వర్ణవర్ణమగునూ
భక్తులమైన మా కెల్ల శుభములను కూర్చుచూ