Sunday, November 3, 2024

నా బాధలు

 ల(క్షణ) ప్రాస‌పద్య రాజము:




విలువలు పలుౘన నలుపుౘు


వలువలు పలు గట్టగలమ! లత తనువులకున్


సొలసిన కలికిని యలతిగ


కలతను నిలుపుట ఫలమ్మ! కలిమా! యిలపై




నీదే తెలివిగ మురియుౘు


భావించి నితరులనెల్ల వ్యర్థమ్ముగ యీ


తావిన యమరని యిమడని


పూవైతివిగా హతవిథి! పుణ్యము రాదే!




చేసితి వ్రాసితి నొందితి


వాసిగ రాసిగ ఫలములు భావింౘుౘు నీ


దాసిగ పలుకుట తగునా!


ౘూసితివా నా ఘనతను! చోర! కిషోరా!




అలసితి! సొలసితి నైనను


కలికీ యడుగను బహుమతి కలవే


కరముల్


పలు సంఖ్యను! చేయుటకై


సులువుగ పనులను! పలుకున ౘులకన తగునా!






విరిసిన కుసుమపు సొగసులు


మురిపింౘగ మనసు కందముయు పుట్టెగదా


శిరమున చేరిన యాగున!


తరుణికి ముఖమున చెదరని దరహాసములే




 స్వయముకు పిన్నత్తకు నా

వ్యయమగు పతికిని శిశువుకు నస్వ్థతలే

భయమిక పడలేనమ్మా

నయముగ ననుగని మనవిది! నగజా ప్రణతుల్


పాలును తేనీరును నే

బేలగ పట్టితి నిరుడును! వెలసిన తనువే

తాలిమి గోరెను నిన్నే

లీలలు చూపించుచు నను శ్రీ సతి! గనుమా


విశ్రాంతములే కరవే

నే శ్రమ పడలేనిక నను నీ దరి గొని యో

యాశ్రయమిమ్మా చాలును!

మా శ్రీ దేవీ! శరణము మంగళ మూర్తీ


అలసిన తనువుకు లేదా

కొలదిగ నైనను విరామ కోటా హయ్యో

నిలుపుమ స్వస్థత గృహమున!

బలి తీసుకునుందువ నను! వగచెడి దానన్


లోకపు మాటలు చాలును

నా కను పాపలు నడిగెను నయముగ సెలవున్

పీకుట పాకము బెట్టుట

లేకి తనంబవద! తల్లి! శ్లేషలదేలన్


మరచితి పొయ్యిని గట్టుట

శిరమున పెరుగగ బరువులు చింతలు మదిలో!

కరుణను చూపించుచు నను

తెరపిన పెట్టుమ సురనుత! దీవెనలిడుమా


శిశువుకు తల్లియు టీచరు

వశముగ చెల్లెండ్రు చేసె పనులను! నేనే

నశియించిన పిదపను! నా

యశమును గమ్మత్తు గణన యవసరమా! ఏ?


లెక్కలు చేసెడి జనులే

యొక్కఱు హితమును సహాయముసగరు నైనన్

చుక్కలు చూపించెదరే తగునా

యక్కట! యీ దౌష్ట్యములు సుఖేసిని! జననీ



నిందలు వేయుటదేలన!

బొందిని దీసెడి తలపులు పుణ్యములేనా

సందును జొప్పించి మఱీ!

విందెటులగునో యివి మఱి! వినడా భవుఁడే



అలసితి సొలసితి బలమును

పలుకును నిలువక తరలగ వదలితి తలపున్

కలిమిని కలమును పిలువక

వెలుగక నలిగితి లలనను! వెతలన పడితి

న్



ౘదివితి గాని శాస్త్రములు సన్నిధి లేదు కపర్థి! బ్రోవరా

కుదుపులు లేని జీవితపు కోటలు లేవను సత్య వాక్కునే

మది గదినందు తోౘక ప్రమాదపుటంౘును చేరి యుంటినే

వదలక నాదు హస్తమును! పాదము తోడుగ నుంౘు తండ్రిగా


అనిల కుమార! భక్త శిఖరాగ్రవు కాదయ దేవువీవెగా

యనవరతంబు సాయముగ హస్తమునుంచుమ చెంత వీడకన్

కనులను కారు నీరు నను కాల్చుచు నుండగ నేడ్చి సోలితిన్

నిను మది నమ్మినాను నను నీలపు నీడన ముంౘబోకుమా




బిడ్ఠల వృద్ధిని కోరుౘు

గడ్డలు దాటెడి జనాళి ఘనులయ ధాత్రిన్!

తెడ్డును దాౘుౘు ముంచిన

విడ్డూరముగ! శిశువు వేదన పడునే


సీసము:

చాకిరి చేసెడి ౙాబిలి యారిన!

యిక కాచెడి తన వాఱెవ్వఱంట

తగవులు జగడము తంపులు చేయుౘు

కీడును కోరుౘు కీర్తి యశము

సహితము విడువక ౘంపెడి వృద్ధులు

తుదికంట తరుణుల తోసి వైచి

నంగిగ నగుపించి నయ వంచనము చేసి

ముదమునొఅందెదరు! బోలెడంత


తేటగీతి: రాయల శైలి


త్యాగ నిరతి తోడ తమను తామె శిశువు

యాహుతిగ చేసి యున్నను యాగరు గద

ఫలము నంది విశ్వాసపు వలువలేవి

యెఱుఁగనట్టి వారు! పరుల యేడ్పు గోరు


ఏక పక్షిని చేసి సహేతుకముగ

దానినే దలంౘుౘు గొడి తరుణి మణిని

నవ్వుకొందురు ప్రజలు సనాతమగున!?

వీరి గుణముల నెంౘుట నేరి తరము?



అంతర్యామీ అలసితి

సుంతైనను దయను ౘూపి సుపథమునిమ్మా

చెంతను నిలువక వెడలిన

యంతమె బ్రతుకుకు! మనసున ఆక్రందనతో 


మానితి! యాత్రలు, బ్రతుకుట

మానిని! నలుగుౘు నలుగుఱి మధ్యన తుదకున్

మానై మిగిలితి, నీవే

మానవ జాతికి దెలుపుమ! మంచి తనమునే


వగచెడి వనిత వధింౘుట

తగునా హతవిథి యెఱుఁఖరు ధర్మము నరులున్

తగిలించి గాట్లు మనసున

నగవులు చిలుకును వెలుపల నయ వంచనలే


మారున! ధర్మము తలకొక

తీరుగ! తగునా! యుసురుల తీయుట నటుపై

శౌరి నటింౘుట! యెఱుఁగడు!

యా రమ నాథుడివి యేమి! యనుకొను నరుడా

(అంతరంగమందు నపరాధములు చేసి /

మంచి వాడు గాను మనుౙుడుండు

యితరులెఱుఁగకున్న యీశ్వరుడెఱుఁగడా

విశ్వదాభిరామ వినురవేమ)


ఏడు గడిచె గాని ఏఁడుపే మిగిలెనే

ఒక్క రోౙునైన యులుకు లేక

సాగలేదు బ్రతుకు! జవములుడిగి తీసె

యుసురు తృప్తి లేదు యూరికెపుఁడు




ఆపరేషనన్న ఆట గాదు నరుల!

శ్రమయు హద్దు మీరి రక్ష‌ లేక

పాట్లు పెంచె గాద! వాక్కులేలన యింక!

యన్న వదలలేదు ఆకసమ్ము


నీతులు మీకొక విధముగ

గోతుల నను ముంౘు విధము! కొద్దిగ నైనన్

మీ తలపున లేదా యీ

రీతి సబబు కాదు యని! శ్లేషాత్మకులా!


విశ్రాంతము లేకుండగ

నా శ్ర మనంతయును దోచి! నడి సంద్రమునే

యాశ్రయముంౘక మ్రింగుట!

మిశ్రమ‌ గుణములు కలిగిన మీకది సుళువే


నా బాబును సాకుటకై

నే బతుకును కోరలేదు! నీతియు గననే

మీ బాధ్యతలే నావయ!

యీ బరువును మోసి తుదకు నేడ్చుౘు ౘనెదన్


యే బంధము ఉన్నది యిటు

నా బాధల గని దరి నిల్చి నయముగ ౘూడన్!

నే బదులీయగ లేనుగ

యీ బలముయు పోవ! చచ్చి యిచ్చెద గెలుపున్


నిందలు మోపుట సుళువే

బొందిని లాగుట భళి భళి పుణ్యము అది యే

విందయ మీకెపుడూ నను

తొందఱగను పంపి తృప్తి తోడను నిలుమా




అలసితి సొలసితి విధికే

అలుసై పోయితి బ్రతుకను యంబుధి తేలే

అలలే నిలువగనీవే

అలవాటైనది గద యిది అతివ జగతికే.



వాత్సల్యంబే కల్లయు

మత్సరమే నిజము నటన మహ తీపి గదా

యుత్సాహముతో గ్రోలుౘు

తాత్సారము లేక మ్రింగి తాగెదరిలపై.



కర్మ ఫలముఁ దీయ కల్మష నాశ! నీ

శక్తి చాలదేల! స్మరణ తోడ

వేడుకున్న వినక కీడు దీయని నిన్ను

మనసు నిలుపనేల! మానినాను.



నిన్ను నమ్మి యున్న నిర్వీర్యమవ్వదే

కర్మ యొక్క శిక్ష! కనుఁక యికను

భక్తి యొకటె నిలిపి బాధల్లు భరియిస్తు

బ్రతుకవలెను నిజము! వందనములు.



కలియుగంబు నీవు కల్ప తరువువంటు

నమ్ముకొన్న గూడ నాశనంబు

గుప్పిటందు నుంచి తప్పులె సాకుగా

చూపు జనని! యోటమాపలేవు.




నిండు భక్తి యుండె! నీడ నీవని నమ్మి

గాౘవేలనయ్య! కల్ల గాద

రక్షకుడవనెడి యరాౘకపు పలుకు!

స్వస్తి స్వస్తి స్వస్తి ౘాలు స్తుస్తి.



తృప్తి లేని మనసు తీరని కోరికల్


మెలికి పెట్టుౘుండ తలచి నదియె


తెలివి యంటు సాగు తీపులే ముంౘునే


నరుని బ్రతుకు ధరను! కరగు శాంతి.








కష్టపడకుండ కరుగదు కండ గాని


కలిమి తరిగిపోవును యున్న గనుల నుంచి


గాన కలశము నింపుమా కళలు కలల


తోడ కలత యుండదపుడు తోషమేను.




// తేటగీతి






తెలుగు లోగిలి సమూహంలో 




తోటికోడలి విరుపులు సాటి లేవు


అత్త ఆడపడుౘులారడులకు


మామ బావ యింక మరుదుల గోలలూ


వంటరైన వారి వఱకు రావు




ఉమ్మడికుటుంబమందుకె


యిమ్మహి ౙారెను కలవర హేతువు గనుకన్


చెమ్మను ౘూడని కన్నుల


కొమ్మలు లేవుగ గృహమున కొట్లాటలెగా.





కవిత లేదు పాట కవనమల్లగ లేను

కలము నిలచి కలలు కరిగి

మౌనమొక్కటె పరిమళమైన వేళన

యక్షరములె కాౘు లక్షణముగ.



Friday, November 1, 2024

02 November , 2024

 కార్తిక పాడ్యమి, క్రోధి


జ్ఞానమునకు నధిపతివే

మానవ జాతికి వరమిడి మహినే దాటే

నీ నవ పథమును ౘూపవ!

ధ్యానము ముద్రను ధరింౘు హరహర! దేవా


గౌరీ తనయా కపిలా

వారింౘక కర్మ ఫలము భరియించితిమే!

పారింౘవ నీ కరుణను

ధారుణి వాసులకు మదిని దయతో నికపై


దత్తాత్రేయా నీవే

నుత్తమ రూపుడవయ! మము నుర్విని గాౘన్!

వృత్తము చక్రములేలన!

విత్తము నీ దరి! నిౙమున! వినుమా మనవుల్


ఆపదనందు దల్చుకొని యానక వీడను తల్లి! మాకు నీ

ౘూపులు ౘాలునమ్మ! నిల జ్యోతులు వెల్గులు నిండి పోవునే

మూపున భారమింక మది మోయగ శక్తియు లేదు పాపముల్

బాపుౘు మమ్ము నీదు కనుపాపల వోలెను గాౘు శాంభవీ!