Thursday, October 9, 2008

తాత్త్విక చింతన

1. కరిగిపోయిన కలల మీద రాయనా కవితని
కలిసిరాని కాలం మీద కదపనా కలాన్ని
కరువైన కరుణ గురించి విప్పనా గళాన్ని
దూరమైన మంచితనం మీద వల్లించనా పాఠాన్ని
కవితల పలక మీద చెరిగిపోతున్న అక్షరాలూ
మనోఫలకం పైన నిలిచిపోయిన భావాలూ
మనవి కావనుకుని వేరయిన బంధాలూ
పలకరించని స్నేహపు సుగంధాలూ

మాపటి పూటంటి మాటున జేరగ

సాయం సంధ్యపు చీకటి చాటున దూరగ

వర్ణన లేవీ వర్ణమాలలు ఏవీ పర్ణశాలలు ఏవీ

నా పద, పద్య పాకశాలలో వీటన్నిటి మాటశాలలో!!

2. పచ్చని చీరను చుట్టిన పుడమిపై

నును వెచ్చని కిరణపు పలకరింపుతో
పక్షుల గానము వీనులవిందుగ
మన అందరికీ మనసులు నింపగ

పరుగులు ఆపీ ప్రతి లిపిని దీసీ

ప్రతినిత్యము పద, పద్యములు వ్రాసీ

పసివారికీ పాఠకులకూ కధలను అల్లీ

అవి అందించిన రచయితలకు జవాబుల మాలను పంచీ

పొద్దు గడిచాకా ఝాము దాటాకా

పడమటమ్మ నుదుటిని మొత్తం పరిచే
కమలముల నేస్తం కనుమల నుంచి జాలువారగా

మంచు బిందువుల‌ కన్నా మిన్నగ

మంచితనముతో కరిగే మనసును

కమలముల రేడు నిశి రాతిరి రాజూ

మబ్బుల మాటున దాగిన వెన్నెల


చల్లని స్పర్శ నుదుటిని దాకగ
ఇలపైనే ఇంటి వద్దనే  నిలిచే చెట్ల‌నీడన
నిదురించాలీ అనునిత్యమ్మూ
ఇవ్విధముగ సాగాలీ అనుదినమూ

No comments: