Sunday, March 10, 2019

శ్రీ చీర్యాల లక్ష్మి నరసింహ స్వామి

శ్రీ చీర్యాల లక్ష్మీ నృసింహ స్వామిని దర్శించుకున్నప్పుడు కలిగిన అనుభూతి తో అంతా "చ" గుణింతం తో మొదలయ్యే పదాలతో వ్రాశాను.

చేతగాని ఉత్తానపాదుని తనయుడినీ
చెడ్డవాడైన హిరణ్యకశిపుని శిశువును
చలనం లేని మరెందరో ఆర్తులనూ
చేరదీసి ఆదరించిన శ్రీ హరీ

చిమ్మ చీకటిని పారద్రోలి
చిన్న వారిమైన మమ్ములను
చలనం కోల్పోయిన మా వంటి వారందరినీ
చేతులు చాచి నిను పిలుచు నీ అర్ధులనూ

చావు కోరుకునే స్థితి నించి
చెమ్మగిల్లిన కన్నీటి బొట్లను తుడిచీ
చుక్కానివై వచ్చి నావ దాటించవేమి
చైతన్యమ్మును ఇచ్చి కాపాడవేమి

చెర యందు బుట్టినా గెలిచిన వాడవూ
చెన్నకేశవ నామధేయుడవూ
చెంచులందూ వెలసీన వాడవూ
చేపగానూ తిలగీన వాడవూ

చేవలేక నీరుగారిన మమ్మూ
చతికిల బడి నీరసమొందిన మమ్మూ
చిత్తశుద్ధితో మాత్రమే నిలబడిన మమ్మృ
చిరునవ్వుతో రక్షించవె ఇకనైనా

చేదు నీటి నూతిన మునిగిన మమ్మూ
చేద వేసి ఒడ్డుకు చేర్చేందుకు రమ్మూ
చిరిగిన బ్రతుకు‌ల నున్న మమ్మూ
చిగురింప చేసేందుకు నింక లెమ్మూ

ఛాయవోలె మాకు వెంటనుండీ
చెలిమి చేసి మాకు పేర్మి పంచీ
చిత్తరువులందు సదా నీవె నిలచీ
చిత్ర విచిత్రాలను మాకు చూపవే

చివరిదాకా కదలక‌ తోడు నిలచీ
చిన్న బుచ్చు కోకుండా మమ్ము కనికరించీ
చిక్కటి కష్టాలను పలుచన చేసీ
చివాలున వాటిని దరిమేయవె

చిత్రగుప్తుని వోలె లెక్కలనూ దేలిచీ
చిక్కని దుష్టులకు శిక్షలు వేయవా
చిలుక వోలె తీయని పలుకులూ చెప్పీ
చక్కనీ ఆనందాల నీయవే

చెంపపై నుండీ క్రిందకూ జారీ
చెక్కిళ్ళ వద్ద వెక్కిళ్ళతో ఆగీ
చైత్రమును కోల్పోయిన మోములను నీవూ
చందురుని వోలె వెలిగించవా నీవూ

చిన్మయానంద మూర్తీ చిద్విలాస రూపీ
చిన్ముద్ర ధారీ చిద్విలాసమును లాల్చీ
చిరుదరహాసమును మాకొసగవే
చిన్నారులనెన్నడున్నూ చెదరనీయకుమా

చంచల లక్ష్మిని హృదయమందు నిలిపీ
చరాచర జగత్తునకు నాథునవై నిలచీ
చెరపలేనంత ప్రేమనూ రాశిగా పోసి
చెప్పలేనంత అనురాగమునీయుమా

కలం పేరు:  నాగిని

2 comments:

Unknown said...

Chala bagundhi madhuri. Meru padyalu koda rastara

Durga Madhuri said...

అవును వదినగారూ... ఇదే దానిలో ఇంకా చాలా వ్రాశాను. చదవగలరని మనవి. దేవుడు, నదులు ఇలా...