Sunday, July 28, 2019

గణనాధా..

వందనమనరే గౌరీ పుత్రుడు గణనాథునికీ
వదనమునుంచే జ్ఞానము పంచే మన ఘన నాథునికీ
వినుమా వినుడీ జయ చరితములూ
వినాయకుని వింత గాధలనూ

వటపత్రమునా వెలసిన తానూ
విమలాపతికీ వివరము తెలిపే
విన్నూత్నమ్మే కదా ఈ కధలూ
విజయమునోసగే విఘ్నేశునివీ

పర్వతరాజూ పౌత్రుండితడూ
పశుపతి స్వామీ పుత్రుండితండూ
పరాశక్తికీ తనయుడు ఇతడూ
పళని వాసునీ సోదరుడితడూ

గజవదనమ్ముతో గుణముల నేర్పే
శుక్లాంబరమ్ముతో శుభములనిచ్చే
విఘ్ననాయకుడు విద్యను ఇచ్చే
సిద్ధి బుద్ధులను సిరులను గూర్చూ

గరికను దెచ్చీ గమనికనిస్తే
గమ్మత్తుగనూ కోర్కెలు దీర్చూ
ఉండ్రాళ్ళు పెట్టీ భక్తిని జూపితే
ఉత్పాతములే తీసివేయునుమా

ద్విముఖుడమ్మా మన పార్వతి తనయా
ద్విజన్ముడమ్మా ఇతడు మృత్యుంజయుడే
దిక్కులనన్నీ తానేలేవాడే
దీనజనులా తాను బ్రోచేవాడే

తల్లి దండ్రులనూ కొలిచిన ఫలమూ
తలదాటెపుడూ పోదూ అనుచూ
తమ్మునితొ గూడి తాను దెలిపేనమ్మా
తగనిది కాదే ఈ జీవిత సత్యం

మూషికాసురునీ మదమణిచిన ఘనుడూ
మాతా మాటకూ తా విలువను ఇచ్చీ
మౌనంగానూ ఆ దనుజుని కాచే
మంగళమనరే ఇంతటి మూర్తికీ

మహిమండలమూ అంతటా తానూ
మణిద్వీప వాసినీ తన తల్లిని గాంచే
మనువును గోరలేదుగా ఆ భావమ్ముతో
ముక్తినీ కోరరే అట్టి స్వామిని గొలువరే

ముప్పది రెండూ అవతారములెత్తీ
జగదంబ కటులా సామ్యము తెలిపే
ప్రతిబింబముగా ఇటులా నిలిచే
పరమాత్మికకూ మరు రూపమే కాదా

వ్రతకధను మనకీ తానందించే
దయతో గాదా మరి ఇది అంతయునూ
ఆ గాధ సైతం తా లిఖియించే
ఆర్తిని ఇటులా మనకందించే

మోదకహస్తుడై మోహము దృంచే
మోక్షమునిస్తూ మనని తా స్పౄశీయించే
మన్నించునుగా మన దోషాలన్నీ
మనమున నిలుపకా ఆ కరుణామూర్తీ

మరువగగలమే ఇంతటి దయనీ
మహనీయమూర్తీ ఇచ్చిన కృపనీ
మలినము సేయకా మన పూజలనూ
మనమందరమూ కలిసే గొలుతుమూ

ఇంతటి వానిని స్తుతియించగలమా
ఇలలో నున్నా అందరమూ కలిసినా
ఇందులో ఎట్టీ దోషములున్నా
ఇక్కట్లు ఇవ్వకా క్షమ జూపేయి స్వామీ

నీ కధలన్నీ గ్రంధములూ దెలిపే
మూడు పురాణములూ నీ కలపంతో నిండే
నీ కీర్తనలూ భువి అంతా ఏగే
చవితిన మేమూ చదివితిమీ వాటినీ

పేరు: మాధురి
కలం పేరు: శేషు

No comments: