Tuesday, November 5, 2019

నీటి ఎద్దడి,చందమామ :-- నాగిని

నీటి ఎద్దడి:
=======
నేలను త్రవ్వి చూశాను - నింగికి ఎగిరీ వెతికాను
గాలిలో తేమకై తలచాను - అగ్గిలో ఆవిరైనా ఉందని ఆశించాను
ఎందెందు ఉండునో అన్నన్నీ గాలించాను
కానీ నీటి చుక్కనైనా పొందలేక పోయాను
కన్నీటనైనా కానరాని కాస్తంత తడి కోసం వెతికి వెతికి నీరసించాను
భగీరథుడు యత్నించాడంటే నాడు జగమంతా జలం నిండి ఉంది
విఫల యత్నం నాదయ్యిందంటే నేడు ఇసుమంతైనా అది లేకపోయింది
-- నాగిని (కలం పేరు),  మాధురి (పేరు)

చందమామ -- నాగిని
==============
తెల్లని మల్లెల వంకకు చూస్తే నవ్వుతు చందురుడు కనిపించాడు 
ఎవ్వరు నువ్వు అని పలుకరిస్తే అందరికీ మామను అని చెప్పాడు 
అందుకోవాలని ఆరాటపడితే తాను గగన కుసుమానన్నాడు 
మామ కాని మామ ఎవరంటే చల్లని వాడు చందమామన్నారు
చేయి చాపి చూసి చెంత లేడని తెలుసుకుని 
అద్దం లో కని ఆనందిస్తుంటే
చక్కనైన పుస్తకం - తోడుండే నేస్తం 
జాబిల్లిని మరిపించే గొప్పదనం - చీకటిని పారద్రోలే తెల్లదనం 
ఉన్న "చందమామ" వచ్చింది నాకు వారసత్వంగా పుస్తకాన్ని అందించింది అమ్మ. 

అక్షరాలు నేర్చుతూ అది చదివాను
అందులోని నీతులు తెలుసుకుంటూ పెరిగాను
పసి వయసు నించీ పెరిగాక కూడా పక్కనే ఉంచుకుంటున్నాను
తరాలు  మారినా సముద్రాలు దాటినా వన్నె తరగనిది "చందమామ"
పున్నమే తప్ప అమాస ఎరుగదు ఈ వెన్నెలమ్మ
తీయని మాటలు అన్ని కాలాల్లోనూ పంచునమ్మా


అమ్మమ్మ నించీ తను పొందిందీ అంతటితో ఆగక నాకు పంచింది
నా సుతునికది నేను ఇచ్చాను పెంపకం ఇక కష్టం కాదని అనుకున్నాను
ఆకాశంలోని చందమామ వెన్నెలని పంచునమ్మా
అందుకోవాలని చూస్తే అందని మావేనమ్మా
తెల్లని చల్లదనం, స్వచ్చమైన మంచిదనం కావాలంటే
అద్దం దాకా ఎందుకమ్మా చేతిలో చందమామ ఇదుగోనమ్మా 

No comments: