Tuesday, August 31, 2021

ప్రవచనం - 2

 

రావే మనవరాలా! ఏమిటీ సంగతులూ!

గుమ్మంలోనే సౌమ్యకు ఎదురు వెళ్ళారు సుమంగళి గారు.

ఏమీ లేదు బామ్మా, ఈ వేళ మా ఆడపడుచు శ్రావ్యకి కొన్ని సందేహాలున్నాయంటే తీసుకు వచ్చాను , తీర్చ మనవి! అభ్యర్థనను కూడా నాటకీయంగా చెప్పింది సౌమ్య!

అలాగేనమ్మా, అంటూ వారిని కూర్చోపెట్టి, పలకరింపులూ పరిచయాలూ అయ్యాక ప్రశ్నోత్తరములు మొదలు పెట్టమన్నారావిడ!

ఏమీ లేదు బామ్మా, మీరు సౌమ్యకు చెప్పారు కదా, అమ్మ భావనా మాత్ర సంతుష్ట అన్నారు కదా! అంటే తలచినంతనే కష్టములను తొలగిస్తుందనీ, మరి అటువంటప్పుడూ ఇన్ని స్తోత్రములు ఎందుకూ, ఇన్ని రకముల పూజలూ, నోములూ, వ్రతములూ ఎందుకు బామ్మా. అడిగింది.
చెప్తాను గానీ, ముందు ఇది పట్టుకో, హల్వాలోకి ఉప్పు వేయాలి, అన్నారావిడ చమత్కారంగా.

ఆవిడ ఏదో చమత్కారంతో ఉన్నారని అలవాటైన సౌమ్య మిన్నకుండి పోయింది కానీ, శ్రావ్య మాత్రం ఖంగారుగా, అయ్యో, అదేంటి బామ్మా, హల్వా లో ఉప్పు ఎలా వేస్తామూ అన్నది. అద్గదే మనవరాలా, ఏ వంట వండటమునకయినా పనిని చేయటానికైనా ఓ పద్ధతి ఉంటుంది కదూ! అలాగే, అరిషడ్వర్గ మాయలో పడిన ఈ మానవులు ఇహ, పరములలో తరించటానికీ, ప్రవర్తన చెడకుండా దారిలో పెట్టటానికీ ఈ పూజలూ, పద్ధతులూ ఓ దారమ్మా! చెప్పారావిడ.

నే చెప్పలేదూ, బామ్మ స్టైలే వేరూ అనీ! అంటూ చప్పట్లు కొట్టింది సౌమ్య. 

అంటే ఇప్పుడు ఎవ్వరైనా ఏ పూజైనా చేసేయవచ్చా బామ్మా? అంటే, ఆడవారు అయ్యప్ప పూజ వంటివే కాదు నా సందేహంలో, అసలు మంచి తనమే తెలియని వారు కూడా కోరికలు కోరటమూ పూజలు చేసి పొందేయటమూ అంటే, ఇంక అర్థమేముందీ? అడిగింది శ్రావ్య.  గొప్పగా పూజలూ గట్రా చేయకపోయినా, సౌమ్యకు కూడా ఆసక్తిగా అనిపించి, శ్రద్ధగా వినసాగింది.
ఆమె అమాయకత్వం నవ్వు తెప్పించినా, అందులోని స్వచ్ఛతా, ధర్మ నిరతీ అర్థమై, ఆమెను మెచ్చుకున్నారావిడ.  

పిచ్చి తల్లీ, గొపృప గొప్ప పూజలు చేసి చెడ్డ కోర్కెలు కోరేస్తే తీరవమ్మా! మరలాంటప్పుడూ, ప్రజలకి ఈ చెడు ఎలా జరుగుతోందీ అంటే, అది వారి ప్రస్తుత,  లేదా గత (జన్మ) కర్మల వల్ల జరుగుతుంది. అలాగే, అసలు చెడ్డ వారు కోరిన ఏ కోరికా నెరవేరదా అంటే, మంచిదైతే తప్పక జరుగుతుంది! కాకపోతే ఇక్కడ మనం ఏమి గుర్తించాలీ అంటే, ఆ కోరిన కోర్కె, దాని ఫలమూ, గ్రహీతలెవరన్నదే లెక్క కానీ, కోరుకున్నది ఎవరూ అన్నది కాదమ్మా! ఆ మాటకు వస్తే, అమ్మకై తన బిడ్డలందఱూ ఒక్కటేనన్న భావన ఎలాగయితే ఉంటుందో, నువ్వు ఉన్నాడనుకున్న జగజ్జననీ జనకులకూ అంత కంటే ఎక్కువే ఆ భావన ఉంటుందమ్మా! అందుకే, ధర్మ, కర్మలననుసరించి, ఎవరు కోరినా నెరవేరటం! కొండొకచో, అందఱికంటే తక్కువ లో ఉన్న బిడాడ పట్ల మరింత శ్రద్ధ తల్లిదండ్రులకొ ఎలా ఉంటుందో, అలాగే దేవునికీ ఈ గుణహీనుల పట్ల కాస్తంత దయ ఎక్కువే ఉంటుంది! 
అలాగే ఇప్పుడు మీరందరూ అంటూన్న body shaming అసలు ధర్మబద్ధంగా తప్పన్నది మొదటి నుంచీ ఉన్నదే! భగవంతుడూ లేదా మీ తరం నాస్తిక వాదం ప్రకారం ప్రకృతీ ఇచ్చిన ఒకరి తనువునూ, లేదా శారీరక, మానసిక లోపమునూ చమత్కారమో,   వెటకారమో చేసే హక్కూ, అధికారం మనకెక్కడిదీ?
ఇక విధివంచితల పట్ల చులకన చేయటాన్నీ, అందఱకూ దూరం చేయటాన్నీ ధర్మం ఎలాగ ఒప్పుకుంటుందీ?
నే చెప్పేది ప్రసంగంలా అనిపించవచ్చునేమో తల్లీ, కానీ ఇది అందఱూ గుర్తెరుఁగ వలసిన విషయం! అంటూ ఆగారు బామ్మ!
Spellbound బామ్మా! అన్నారిద్దరూ ఒకేసారి! 
మాకు professional ethics పేరుతో నేర్పిస్తున్నవి అన్నీ మీరు ఇంత బాగా విశదపరిచారు! థాంక్యూ బామ్మా, అన్నది సౌమ్య,  తనకు ఆవిడ వద్ద ఉన్న చనువుతో.
మరేఁవిటనుకున్నావూ మన సంప్రదాయమంటే! అంటూ వారి నవ్వుతో శృతి కలిపారు బామ్మ కూడా.

మరో చర్చతో మళ్ళీ కలుద్దాం. సెలవ్.


No comments: