Friday, September 16, 2022

మంగళాద్రివాస మమ్ముఁ గనుమ

 

ఆదిపూజ్య నిదియె నభ్యర్థన! శతకము


వ్రాయబూనినాను! భయము ద్రోలు


పరమపురుషుడైన ప్రహ్లాద వరదుని


స్తుతినె జేయదలచి! శుభము కొఱకు


జ్ఞానశూన్యనైన నన్ను పలుచనగా


జూడకుండ కరుణ జూపు మనుచు


మ్రెక్కెదనయ విఘ్నములనుఁ పాద్రోలుమా


వేడుకొనెద దేవ! విశ్వవినుత



పలుకు రాక నేల పడితిఁ వాక్కుల రాణి


సాయమీయ రమ్మ శారదాంబ


రక్షకొఱకు స్వామి లక్ష్మీ పతిఁ శరణు


వేడుచుంటి పద్యవిందు తోడ!





1.



బాలు డడిగె ననుచు బయలు వెడలు వాడ


నాఱసింహ! యపుడె నఖము తోడ


నిలువరించినావు నేర్పుగా నసురుని!


మంగళాద్రి వాస! మమ్ము గనుమ!



2.



సాయపు సమయమున సాయుధుడవు గాక


గడప పైన నిలచి! కపటుడైన


కశ్యపాత్మజునని కడతేర్చినావయ


మంగళాద్రి వాస! మమ్ము గనుమ!



3.



స్థంభ నిలయ! దేవ! సన్నుతించెదమయ్య


చెంచు లక్ష్మి గూడి! చెంతనుండి


చేరదీయుమయ్య చెంగల రాయ హే


మంగళాద్రి వాస! మమ్ము గనుమ



4.



పాప నాశ! స్వామి ప్రహ్లాద వరద! మా


ధ్యేయమీవ స్వామి! దివ్య రూప!


యార్తి దీర్పుమయ్య యాదాద్రి నాథుడా


మంగళాద్రి వాస! మమ్ము గనుమ



5.



ధర్మమిౘట దారి దప్పి దిరుగుచుండె


నిలుప రావ దేవ! నీలదేహ!


భయము కలిగెనయ్య! వ్యాకులతఁ దఱిమి


మంగళాద్రి వాస! మమ్ము గనుమ!



5.



సుస్థిరతను గూర్చి శుభములొసగ రమ్మ


గృహము నందు జేరు కీడు ద్రుంచి


ఐకమత్యమొసగి నంతరముల ద్రోలి


మంగళాద్రివాస మమ్ము గనుమ



6.



రక్షనొసగు నీవలక్ష్యము జూపిన


వేరు దిక్కు లేదు వేద వేద్య


వేల్పువీవు మాకు! వినుచు మొఱలను హే


మంగళాద్రి వాస! మమ్ము గనుమ



7.



స్వాతి తారనందు సాక్షాత్కరించిన 


ధర్మపక్ష పాతి! దైత్యుడైన


యతని సుతుని గాౘ! యాపదలను బాపు


మంగళాద్రి వాస! మమ్ము గనుమ! 



8.



పానకాల రాయ పాతకముల దీయు


పావనుడవు నీవు! పద్మ నయన!


భువిని జరుగుచున్న మోసములను ద్రుంచు


మంగళాద్రి వాస! మమ్ము గనుమ


9.


ఎన్ని బిందెలైన! యెంచక మాకిట


తీర్థమొసగెదవు! తిరిగి సగము


కరుణ పంచు గుణముఁ కరవు లేదయ చెంత


మంగళాద్రివాస! మమ్ము గనుమ 


10.


పానకమును ద్రాగి భాగమిడుదువయ్య


భక్త జనుల కొఱకు శక్తి రూప


కొండ పైన నిలచి గండములను గాచు


మంగళాద్రివాస మమ్ము గనుమ



11.


వేట గాడు దాగి చాటునుండియు వేయు


వలను చిక్కికొన్న బలము లేని


యల్పులైన జనముకాశ నీవెగ స్వామి!/ దేవ


మంగళాద్రి వాస! మమ్ము గనుమ



12.



మూడు రూపములను ముచ్చటగను దాటి


నాఱసింహుడైన! నళిన నేత్ర!


కపట బుద్ధి జనుల కల్మషమును బాపు


మంగళాద్రి వాస! మమ్ము గనుమ



12.



నీదు స్తుతిని జేయు నేర్పు లేదయ దేవ


పూజ లేవి రావు! పుణ్య పురుష!


భక్తి కొదవ లేని పావనులము మేము


మంగళాద్రివాస మమ్ము గనుమ



13.



ఆత్మశుద్ధి గోరి నర్చించ లేదయ


యన్యమెఱుఁగమేము! యాది పురుష!


యవని నందు పడిన యల్పులమయ్య హే


మంగళాద్రి వాస! మమ్ము గనుమ


14.


ఎట్టి తలపు నెఱుఁగ నెల్లవేళల మది


నిన్ను దలచుచుండు! కన్న తండ్రి!


యేమి చేయుచున్న మా మది నిను జూచు!


మంగళాద్రివాస మమ్ముఁ గనుమ


15.


కర్తవీవుగాదె కార్యమేదైననూ


మేము పావులమయ! మేరు పూజ్య!


భ్రాంతి యోడుఁ నీదు భక్తుల ముందఱ


మంగళాద్రివాస మమ్ముఁ గనుమ 



16.



నేనె రాజుననుచు మేను విరచి వాడు


తుదకు నోడి పోయి వెదుకు నెన్ను!


మాదు గమ్యమీవు మధుకైటభ హరి హే/ నాదు గమ్యమీవు నారాయణ! హరి! హే


మంగళాద్రి వాస! మమ్ము గనుమ



17.



తూలి పోవు వేళ తొలగి పోవు భ్రమలు


కల్ల గాదు నిౙము కనికరించి


మాయ లోన పడిన మనుజుల గాచుమ


మంగళాద్రి వాస! మమ్ము గనుమ



18.



ఓర్మి లేదు స్వామి! యురగ శయన! నీదు


పథము కొఱకు వేచు బలము మాకు


లేదు యనక వెలుగు రేఖవై నిలచిన 


మంగళాద్రి వాస! మమ్ము గనుమ



19.



జలజ నాథుఁవీవు జయముల నీయుమా


చిద్విలాస మూర్తి! శేష శయన!


పక్కివాహనుడవు! పంతముఁ బట్టక


మంగళాద్రి వాస! మమ్ము గనుమ



20.



దుష్ట జనుల వలన దోష భూయిష్టమై


ధరణి డస్సి పోయె! దైత్య నాశ!


జాగు సేయకయ్య! సౌందర్య రూప యో


మంగళాద్రి వాస! మమ్ము గనుమ!



21.



ఇహపరము లైన యిచ్ఛ లెన్నొ గలవు!


ధర్మ వాంఛలైన దయను దీర్చి!


నీదు మహిమ దెలుపు నేర్పు గలిగినట్టి


మంగళాద్రి వాస! మమ్ము గనుమ!



22.



అదితి కోరగానె యవతరించితి వయ


బిడ్డగాను తనకు! ప్రియము మీర!


నింత దయను జూపు నిభరాజ వరదవు!


మంగళాద్రివాస! మమ్ము గనుమ



23.



శక్తిహీనులనుచు సాటి వారినెపుడు


జనులు గేలి చేసి సాగునిౘట


లోకులెన్ని యన్న లోటు జేయవు నీవు


మంగళాద్రివాస! మమ్ము గనుమ


24.


సోలిపోతిరిౘట శోభ లేక జనులు!


వేగ దీర్చవయ్య వేదనలను!


నేటి కైన నీవు నేత్రము దెరువుమ!


మంగళాద్రివాస మమ్ము గనుమ


 25.


గగనమంటుచున్న గాలి గోపురముకు


గలిగినట్టి చరిత ఘనము ఘనము


వేల యేండ్లు మాదు వేడికోళ్ళు వినుమ


మంగళాద్రివాస మమ్ము గనుమ


26.


గాలి గోపురమ్ము గాంచగ చాలవు


రెండు కన్నులున్న! రిపు వినాశ!


రాజ్య లక్ష్మి నాథ! రావె జనుల గాచఁ


మంగళాద్రివాస! మమ్ము గనుమ


27.


రాతి తోడ చేయ రక్షగా నిలచెను


పీఠ భాగము! బహు వింత గొలుపు


చిన్న స్థలమున నిలిచిన గోపుర గిరీశ


మంగళాద్రివాస మమ్ము గనుమ



28.


కొండ పైన జూడ గండములను గాచు


దిగువ నేమొ నీదు దివ్య దీప్తి


విషయమేమిటన్న! విశ్వమంతయు నీవె!


మంగళాద్రివాస! మమ్ము గనుమ 



29.


సరుకులన్ని దెచ్చి సంత నడుపుదురు


పిన్న పెద్దలకది వేడుకయట


నీదు లీల గాదె! నీలమోహన రూప!


మంగళాద్రివాస! మమ్ము గనుమ 


30.


నీదు రాజ్యమేగ నిధియు పెన్నిధియును!


వేరు లోకమడుగు తీరు గాదు!


నీదు నుదరమందు నిలచు నిఖిల సృష్టి


మంగళాద్రివాస! మమ్ము గనుమ


31.


వల్లె వేయలేను పట్టి స్తోత్రములను


పాట పాడ లేను బాగు గాను!


నేరమెంచకయ్య భారము దీయుచు


మంగళాద్రివాస! మమ్ము గనుమ. 


32.


నీవు లేవు ననుచు నిందించు దైత్యులు


తుదకు నాశమొందె! తోయజాక్ష


అంతు లేని కరుణనందించు ఘనుడవు


మంగళాద్రివాస! మమ్ము గనుమ


33.


దైత్యులెల్ల చేయు దైవ దూషణలను


సలుప లేదు గనుమ! సాధు పోష


నిన్ను నమ్ము వాని! నిందలు పడనీకు


మంగళాద్రివాస! మమ్ము గనుమ


34.


వేదములను ౘదువ విజ్ఞానముయు లేదు


పూని చేయలేము పూజ లేమి


భక్తి మీర కొలిచి భజనలే చేసేము


మంగళాద్రివాస! మమ్ము గనుమ


పానకాలరాయ ప్రణతులిడుదు


35.


కంబమందు నుండి కదలి వచ్చేవు నీ


యార్తులెల్ల గాచు నండవగుచు


కోరి పిలుచు వారి! కొఱకు నిలచి యుండి


మంగళాద్రివాస! మమ్ము గనుమ


36.


వైరి వర్గమనుచు పంతమ్ము లేలేవు!


శరణు ఘోష వినిన! సరగున దిగి


రక్షణనొసగేవు/ రక్షణను యొసగుచు! రాగము పంచేటి


మంగళాద్రివాస! మమ్మ గనువ


37.


భీతి వెడలి పోయి పేర్మి యందేనయ


నిన్ను దలచినంత! నీదు మనసు


కన్న తండ్రి కన్న మిన్న! లోక పితవై


మంగళాద్రివాస! మమ్ము గనుమ 


38.


సాగరమ్ము నీదు జ్ఞానమ్ము కరవయా


చక్రి నిన్ను జేరు ౘదువు రాదు!


స్మరణ మాత్రమైన సలుపుట రాదయా


మంగళాద్రివాస మమ్ము గనుమ


39.


వేల యోజనములు కాలి నడక జేయు


యాత్రికులకు నీవు యాశ్రయమ్ము


శిఖరమందు నటులె చెంత నేలన యున్న


మంగళాద్రివాస మమ్ము గనుమ


40.


పూర్వ కవుల పలుకు! పొగడు నిన్ను! మాకు


జపము దానములును తపము రావు


క్షేత్రములను జేరి కీర్తింౘ లేమయ


మంగళాద్రివాస మమ్మ గనుమ


41.


ధర్మ రాజు నిౘట స్థాపనమును జేయ


వెలసినట్టి దేవ! కలత దీసి


సిరులనొసగు మయ్య క్షేత్ర నాయక! హరి!


మంగళాద్రివాస మమ్ము గనుమ


42.


అష్ట విష్ణు పురములందు మంగళగిరి


చూసినంత మాకు శోభ యనెడి


యార్ష వాక్కు రీతి హర్ష మొసగు దేవ


మంగళాద్రివాస మమ్ము గనుమ


43.


అష్ట నాఱసింహ ఆలయముల లోన


మంగళాద్రి నందు మమ్ము గాౘ


వెలసినట్టి దేవ! కలత దీర్చి సతము


మంగళాద్రివాస మమ్ము గనుమ


44.


భక్తులెల్ల గాౘ భవ్య స్వయంవ్యక్త


రూపమున వెలసిన పాప నాశ!


నిలచి జనుల హృదిన ఫలముల నొసగుచు


మంగళాద్రివాస మమ్మ గనుమ 


45.


సూక్ష్మ జీవులేవి చూడ లేము మనము


స్వామి కొఱకు జేయు పానకముకు


చెంత! యింత మహిమ చేయు ఘనుడ! దేవ!


మంగళాద్రివాస! మమ్ము గనుమ!


46.


కలియుగమ్ము ముగియుఁ కాలమున తరలు


చీమ యీగ వంటి జీవులన్ని


తీపి రుచుల వెంట! దేవ నంత వఱకు


మంగళాద్రివాస మమ్ము గనుమ 


47.


ప్రథమ రాజులిౘట పాలించె నాంధ్రులు


శాతవాహనులె! విఘాతములను


ద్రోలి వీరి గాచు దురిత దూరుడవైన


మంగళాద్రివాస మమ్ము గనుమ


48.


ఇలను గాచు వారు యిక్ష్వాకులు నిౘట


పాలనలను జేసె బాగుగాను


యట్టి వంశమునను పుట్టిన దైవమా


మంగళాద్రివాస మమ్ము గనుమ


49.


పల్లవులకు దక్కె పాలన తదుపరి


నంద గోత్రికులకు నందె పిదప


విష్ణు కుండినులను ప్రీతిగన్ జూసిన


మంగళాద్రివాస మమ్ముఁ గనుమ


50.


కాకతీయులకును కాలము ముగిసెను


తుర్క రాజులంత ద్రోల బడగ


సార్వభౌములైన చాళుక్యులను గాచు.


మంగళాద్రివాస మమ్ము గనుమ


51.


కొండవీడు వారు కొల్చినట్టి నృసింహ 


గజపతులను గెలిచి సగర్వముగను


గిరిని యేలినట్టి కృష్ణ రాయ వినుత


మంగళాద్రివాస మమ్ము గనుమ


52.


తళ్ళికోట వారి తదుపరి గోల్కొండ 


రాజులంత జేరి వ్రాయగాను


పశ్చిమాద్రి వారి పైన మమ్ము నిలుపు


మంగళాద్రివాస మమ్ము గనుమ


53.


వాసిరెడ్డి వారు వాసికెక్కెనిౘట


గోపురమ్ము కట్టి గుడికి తాము


యింత చరితను గల హేల నొసగు దేవ


మంగళాద్రివాస మమ్ము గనుమ


54.


రంధ్రమందు నిలచి రసమయ గుణముల


పానకమును తిరిగి ప్రజల కొసగు


కరుణ మూర్తివయ్య కమల దళేక్షణ


మంగళాద్రివాస మమ్ము గనుమ


55.


ఆది శంకరాది అవతార పురుషులు


మధ్వ గురువు జేరె మంగళ గిరి!


రామనుననుచరులు రామానుజని గాచు


మంగళాద్రివాస మమ్ము గనుమ


56.


స్వామి పథము గోరు చైతన్యులును వచ్చి


పాదముద్ర నిలిపె! భక్తి నిండ!


పుణ్య పురుషులంత పూజించు దేశేశ


మంగళాద్రివాస మమ్ము గనుమ


57.


జార్జి ఫోర్టు నేత షాముకు మహిమల


జూపినట్టి దేవ రూప రహిత


గంధకమ్ము గాదు గాచేటి నీవయ


మంగళాద్రివాస మమ్ము గనుమ


58.


తాళ్ళపాక వారి తనయుని పుత్రుండు


చిన్న తిరుమలయ్య చేరె ననుచు


చేరదీసినావు శ్రీ నాఱసింహ మా


మంగళాద్రివాస మమ్ముఁ గనుమ


59.


అష్ట సంఖ్య నందు నలనాటి రాజుల


శాసనములు గలిగె ౘక్కగాను


కార్మికులను గాచు కారుణ్య మూర్తి హే


మంగళాద్రివాస మమ్ము గనుమ 


60.


కొండ చెంతనున్న కోనేటి గుడిలోన


కొలువు దీరెనంట గొప్ప వాడు


రామబంటు హనుమ! ప్రార్థనా పూజ్య హే


మంగళాద్రివాస మమ్ము గనుమ 


61.


కొండవీటి రాజుఁ గొట్టి రాయల వారు


శాసనమ్ము వేసి సన్నుతించె


నిన్ను నీరజాక్ష వెన్న మనసు వాడ


మంగళాద్రివాస మమ్ము గనుమ 


62.


దేవ దేవ నీకు తిమ్మయ్య గట్టేను


గోపురమ్మునొకటి గొప్ప గాను


వీరినెల్ల గాచు నాఱసింహ రమేశ


మంగళాద్రివాస మమ్ము గనుమ


63.


అంధకారమలమె యవని పైన నృసింహ 


కర్మ ఫలములైన కరుగ దీసి


బాగుసేయ మనవి బ్రతుకులన్ని దయను!


మంగళాద్రివాస మమ్ము గనుమ


64.


అలవి మాలినట్టి అహమందు జనులకు


తెలివి నీయ రమ్మ తీరుగాను


కలత కలహలముల కలవరములు దీసి


మంగళాద్రివాస మమ్ము గనుమ


65.


తాము సర్వమనుచు ధరనుఁ తిరుగు వారి


మోహ భావనలను! ముసుగు లెల్ల


తొలగు జేసి తుదకు తోడు నిలచు వాడ


మంగళాద్రివాస మమ్ము గనుమ


66.


ఆట విడుపు కైన యాఖరు క్షణమైన


దలచినంత కదలి దయను జూపి


పాప పుణ్య ఫలముఁ బాపి మోక్షమొసగుఁ


మంగళాద్రివాస మమ్ము గనుమ 


67.


అంతరంగమందు నంతరముల జూపి


స్మరణ చేయకున్న మరణమొంద


తరుణమందు గాచి దర్శన మొసగెడి


మంగళాద్రివాస మమ్ము గనుమ


67.


ఋజువులేలనయ్య రిపువినాశ నృసింహ 


తలచినంత పలుకు దైవమీవె


యుగ్రరూపమంత నిగ్రహించి దయను


మంగళాద్రివాస మమ్ము గనుమ 


68.


అద్దమయ్య జగతి అంతటా నీవను


సత్యమెఱుఁగనీక జనుల మదిని


భ్రాంతి నింపి యాడు కాంతి స్వరూప మా


మంగళాద్రివాస మమ్ము గనుమ


69.


నీతి నియమములకు నీరు వదిలి సాగు


స్వార్థపరుల నుండి స్వామి


రక్షనీయమనవి రాక్షసాంతక మా


మంగళాద్రివాస మమ్ము గనుమ 


70.


వందలాది మంత వంత పాడెడివారు


అయిన వారు ఎందఱైన గాని


నీకు సాటి రారు! మాకు రక్షణ నీవె


మంగళాద్రివాస మమ్ము గనుమ 


71.


ధర్మ గ్లాని జేయు దానవులను మాపి


శాంతి నిల్పు దేవ! సాధు పోష


మేలుకొనుమ రమ్మ! మేలొనరించను!


మంగళాద్రివాస మమ్ముఁ గనుమ 


72.


ఉర్వి నిండి పోయే నోర్వలేని తనము


కుళ్ళు కపటములకు కాళ్ళు వచ్చె!


సత్వ గుణములన్ని స్థాపన జేయుచు


మంగళాద్రివాస మమ్ముఁ గనుమ 


73.


లేశమాత్రమైన క్లేశము నోపగ


శక్తి లేదు తండ్రి! జాలి హృదయ!


శ్వాస యాశ నీవె! పాలించు దైవమా


మంగళాద్రివాస మమ్ముఁ గనుమ


74.


అంతిమంబునాత్మ యాసీనురాలౌను


నీవె వాసమవగ! భావ గమ్య!


నంతవఱకు గూడ నాదరించు నృహరి!


మంగళాద్రివాస! మమ్ముఁ గనుమ 


75.


కర్మ లన్నిటికిని కర్తలు తామని


దలచి మాయను పడి కలతనొందు


మానవులకు కప్పు మాయ పొరలు దీసి


మంగళాద్రివాస మమ్ముఁ గనుమ


76.


నిన్ను జేరుకున్న నీ నామ స్మరణము


విడువవలయునన్న! విషపు సమము!


సతము మదిని దలచుఁ సౌభాగ్యమొసగుచు


మంగళాద్రివాస మమ్ముఁ గనుమ


77.


మోక్షమడిగినంత! మోహ నాటకమును


ముగియజేయవలయు! నయముఁ గాదు


స్మరణ మాను పథముఁ మాకు వలదు దేవ!


మంగళాద్రివాస మమ్ము గనుమ


78.


జ్ఞానహీనులమయ మానాభిమానము


వీడలేని మమ్ము పేర్మి తోడ


చేరదీయుమయ్య! చిన్నవారమనుచు!


మంగళాద్రివాస మమ్ముఁ గనుమ 


79.


నిన్ను దలువకున్న నిష్ఫలమౌనయా


నరుని జన్మ గనుక కరుణ జూపి


భక్తి మార్గమిమ్మ భవ బంధవి నాశ


మంగళాద్రివాస మమ్ము గనుమ


80.


భక్తి దెలియదయ్య పరిమళ భరితమౌ


పేర్మి పంచు గుణము బిడ్డలైన


మాకు స్వంతమయ్య! మర్మమెఱుఁగ మేము


మంగళాద్రివాస మమ్ము గనుమ 


81.


కర్మ ఫలమునంత గాల్చక గూర్చున్న


నీదు మహిమ యేమి నీరజాక్ష


నామ స్మరణ జూచి న్యాయము చేయుమ


మంగళాద్రివాస మమ్ముఁ గనుమ


82.


బిడ్డ లెపుడు గొలుచు పేర్మితో పెద్దల


నట్లు నిన్ను దలుచి హర్షమొందు


భాగ్యమీయవయ్త ప్రహ్లాద పూజిత


మంగళాద్రివాస మమ్ముఁ గనుమ


83.


నరుని దృష్టి వలన నాపరాయి పగులు


నట్టి కీడు మాకు నంటనీక


నీదు రక్షణిమ్మ! యాదగిరి నిలయా


మంగళాద్రివాస మమ్ముఁ గనుమ


84.


నీదు కీర్తి నెఱుఁగ నేను తిమిరమందు


నిలిచినాను తండ్రి! కలువ నేత్ర


నేరమెంచకయ్య వారిజాక్షి వినుత


మంగళాద్రివాస! మమ్ముఁ గనుమ


85.


తనువు మునుగు వేళ తలువ లేముగ నిన్ను


యనుచు చింత చెందిరాద్యులంత!


మాకు ధైర్య మిమ్మ మరువనీయననుచు


మంగళాద్రివాస మమ్ముఁ గనుమ


86.


ఈతి బాధలందు నీదుచు మరచితి


నీదు స్మరణ దేవ! నీరసించి!


కోపమేలనయ్య పాప వినాశ హే


మంగళాద్రివాస మమ్ముఁ గనుమ



85.


రోగములను బడసి జోగితి దేవర


యింట బంధ పనులనింకి పోయి


వడలినాను తండ్రి! కడలి నిలయ నింక


మంగళాద్రివాస మమ్ముఁ గనుమ


86.


భోగములను గోరి పొంది సౌఖ్యములను


దలచిరంట జనులు తగని రీతి


నదియె పూర్ణమనుచు నని వీడక దయను


మంగళాద్రివాస మమ్ముఁ గనుమ 


87.


నిశ్చలాంతరంగ నిఖిల లోకములేలు


నీవె మాకు దిక్కు! రావ దేవ.


మమ్ము గాచ కంటి చెమ్మ దుడుచి తండ్రి


మంగళాద్రివాస! మమ్ముఁ గనుమ


88.


బాధలెన్ని యున్న! పాడెదమయ మదిన


నీదు కిర్తనలను నిరతమిలను!


శాంతిసౌఖ్యమీయ స్వాతి చినుకువీవె


మంగళాద్రివాస! మమ్ముఁ గనుమ 


89.


వైరి భస్మమగును శౌరి పేరు వినిన


కంబమందు నుండి గాల్చునరుల!


కీడు దొలగజేయు కేయూర బాహుడ


మంగళాద్రివాస! మమ్ముఁ గనుమ


90.


వేయి బాధలైన వెఱువక పడినట్టి


బాలుడైన వాని పాలి వరము


వోలెనుద్భవించి నుద్ధరించిన దేవ


మంగళాద్రివాస! మమ్ముఁ గనుమ


91.


తండ్రి వడిని జేరి తన్మయత్వము నొంద


వరము దక్కనట్టి బాలునీవు


చేరదీసినావె! చిద్విలాస! నృసింహ!


మంగళాద్రివాస! మమ్ముఁ గనుమ


92.


ఆత్మబంధువీవు నంతరంగమునందు


నిలచి గాచు మమ్ము! సులభ రీతి


గొలువగలము నిన్ను! గుహనివాస నృసింహ 


మంగళాద్రివాస! మమ్ముఁ గనుమ 


93.


ఉరగశయన! మాకు నూరులందు రమతో


దర్శనమ్ము నొసగు దైత్య నాశ 


లక్ష్మి నాథ రిపు బలాంతకా సర్వేశ


మంగళాద్రివాస మమ్ముఁ గనుమ


94.


చేదుకొనుమ దేవ చేదు యనుభవము


లేవి చేరనీక! మావి వోలె


గప్పి మాకు యెపుడు కదిరి నాథ రమేశ


మంగళాద్రివాస మమ్ముఁ గనుమ 


95.


అంతిమమ్ము నందు నాలకింౘగ లేము


నీదు కీర్తనలను! నిశ్చలముగ


బంధువర్గమంటు పరుగు పెట్టినను యో


మంగళాద్రివాస మమ్ముఁ గనుమ 


95.


ఇందిరా పతీ సురేంద్ర వినుత నీకు


ప్రణతులిడుదుమయ్య రాక్షసాంత


హ్లద మొసగు వ్డ హాదర్షి పూజ్య యో


మంగళాద్రివాస మమ్ముఁ గనుమ


96.


కాలి మువ్వవోలె గండపెండేరము


శోభలొసగుచుండ మా భయముల


దీర్పమనచు పట్టి దేవ మ్రొక్కెదమయ


మంగళాద్రివాస మమ్ముఁ గనుమ 


97.


ఉగ్ర జ్వాలలెగసి నుర్వి పైనుండగన్


పానకమ్ము గొనుచు ప్రజల కొఱకు


శాంతమందినట్టి సాధు గుణ విదూర


మంగళాద్రివాస మమ్ముఁ గనుమ 


98.


సత్య యుగమునందు సంహరించి యరుల


యూరకుంటివేల యుగ్ర రూప


నేడు ధర్మపరుల జోడువై గాచవే


మంగళాద్రివాస మమ్ముఁ గనుమ 


99.


మోక్షమడుగబోము మోహనాంగ సతము


సతము స్మరణ వరము చాలునయ్య


స్వర్గ సీమ యదియె స్వామి నీ సన్నిధి!


మంగళాద్రివాస! మమ్ముఁ గనుమ 


100.


ఆర్తి బాపనీవె యాది లక్ష్మి వినోద


నాదరింప రావ హాద పూజ్య


యవతరించి నీవు యవని పైన సతము


మంగళాద్రివాస మమ్ముఁ గనుమ 


101.


యోగ నాఱసింహ! వేగ రమ్మ నిలకు


మాదు పూజ గాంచి మైమరచుచు


హర్షమొంద మనవి! యాశ్రిత పోషకా


మంగళాద్రివాస మమ్ముఁ గనుమ 


102.


ఏమి ఠీవి నీది! ఇందిరను తొడపై


గలిగినట్టి వాడ కమల నయన


కలిమి నడుగబోము కలత దీర్చిన చాలు


మంగళాద్రివాస మమ్ముఁ గనుమ 


103.


కశిపునకు సుతుండు కాని వాడైననూ


కాచినావు నీవు కరుణ తోడ


నీదు యునికి దెలిపి నిగ్రహించి రిపుని!


మంగళాద్రివాస! మమ్ముఁ గనుమ 


104.


ౘదువుసంధ్య లన్న సన్నుతించుట యని


స్మరణ జేయు వాని చంపనెంచి


బాధ పెట్టు వేళ బాలుని గాచిన


మంగళాద్రివాస! మమ్ముఁ గనుమ 


105.


అందు యిందు గాదు యన్నిటా నీవని


దెలిసికొనిన వాని తెలివి మెచ్చి


యసుర రాజు చంపినట్టి వీర! దయార్ద్ర!


మంగళాద్రివాస! మమ్ముఁ గనుమ 


106.


సంధ్య వేళ నిన్ను స్మరియించిన మాకు


మేలునొసగు వాడ! మీన నేత్ర!


యస్తమించు వేళ నక్కున జేర్చుచు


మంగళాద్రివాస మమ్ము గనుమ 


107


గణన సేయబోకు కర్మ ఫలములీవు


కరుణ తోడ వాని కాల్చి వేసి


కష్టములను దీర్చి కనికరించుమ తండ్రి


మంగళాద్రివాస! మమ్ముఁ గనుమ 


108.


నూరు పద్యములను వార పోసెదమయ


దోషమెంచకుండ త్రోవ జూపి


బ్రతుకు బాట లోన పండించి కాపాడు


మంగళాద్రివాస! మమ్ముఁ గనుమ 






No comments: