Tuesday, March 4, 2025

ఛందం సంకలనం కోసం

1.


స్వాగతమమ్మ! చంచల! కృపారసమే కనులందు పొంగగా

యాగమనంబె క్షేమమగునమ్మ! సనాతని! పూర్వ పుణ్యమే

మా గతమైన నీ దయన మన్నన సేయుౘు కాౘుౘుందువే

రాగ సుధా రసామృతము శ్రావణి! పూర్తిగ మాకొసంగుమా.

2.


ప్రీతిగ త్రికోణమితి నేర్చి లెక్కలందు

బుద్ధిమతిగ పేరును బాగ వొందినాను

పాఠశాలలోన పెరిగె! పరపతియును

బ్రహ్మ సతియె కరుణ మెండు పంచగానె.



3.

*మారికి వేసిరి ప్రియముగ మల్లెల దండల్*


రా! రాకుమారి యని సుకు

*మారికి వేసిరి ప్రియముగ మల్లెల దండల్*

హారము వలె చెలికత్తెలు

నారీ మణి పరిమళముకు నయముగ మురిసెన్.


4.

వరమేయడుగను తండ్రి! ప్రార్థన నీకే

శరణంబను పలుకేగ! శంకర! రావా

ధరపైనకు మము గాచ తాండవ రూపా

పరమేశ నుతులివే కపర్థి! త్రినేత్రా.


5.


మోక్ష పథము కొరకు నింపి మోహమంత

*శివుఁని బూజింప ముక్తి కించిత్తు రాదు*

యెట్టి కాంక్షలు లేక సహేతుకముగ

బ్రతుకు నడిపినంత కలుగు రక్ష‌ తుదకు.


6.


కమ్మని తేనెను ధధి క్షీ

*రమ్మును బోసిరి శివునకు రభసము తోడన్*

చెమ్మను తుడుచుచు పిదపన్

రమ్మా యిలకని పిలచిరి ప్రజలున్ భక్తిన్.




కథలలోన వచ్చు వ్యథలలో వాక్యంబు

*పతిని గొట్టి సతియె పరుగు దీసె*

ౘదివి నవ్వుకొనెచు ఛందమున యిటుల

వ్రాసి యిచ్చె మాకు! భళిగ హంస. (అక్క)


🙏🏻🙏🏻🙏🏻


వెండి కొండపై శంభుడు పెండ్లి యాడు

ఘట్టమును ౘూచి శివరాత్రి ఘడియ వేళ

లోకమాత పార్వతి మెడ లోన జూచి

*అయ్యఁ తాళి గట్ట మురిసెనంట తనయ*




(*ఓ*) నమాలు నేర్పి యోర్మితో నొౙ్జయే

పద్య(మ)న్న మేటి విద్య లోని

ఛందము (గు)రులఘువు సారమున్ దెలిపిరి

(వా)రికిదియె ప్రణతి! భక్తి మీర!


ఓ లలనా... సరి లేరు నీకెవ్వరుకు...


తిమిరము దరిమెడి సూర్యుని

సమముగ కష్టించు మూర్తి! చైతన్యమువే

యమవాస్య నిశిని నగవుల

సుమవదనముతో జయించు శోభవు నీవే



అనలేనీ పలుకును నే

*జనకుని కులమును జెరుపగ జానకి బుట్టెన్*

ప్రణతులనే దెలిపెద యా

మునిజన సన్నుతకు రామ మూర్తికి సతమున్.




స్వామిని చేరెడి తపనల
*కామమె మోక్షంబు నొసఁగుఁ గలిలో నెపుడున్*
ప్రామాణికమౌ విధమిది!
నామము విడువని స్మరణము! నవవిధములలో.

అండగ సతతము నుండెడి
కొండల రాయుని నిలుపుట కొంగుకు వెనకన్
నిండుదనంబవ్వదుగా
దండలు వేసిన శుభమిది! తరుణీ వినుమా.

వేడి నీరు గాచి పిల్లవానికి లాల
పోయుట మరచితిని బోలెడన్ని
పనులు కార్యాలయమువియె పట్టుకొనగ
నుదయమున చరవాణిలో! నుస్సురనుౘు.

నారీ మణులను జెరచెడి
యారాక్షసులను హరించి యాదుకొనెడి యా
శ్రీ రాముని! తమ వైరుల
*వైరిని జూచియు మురిసిరి వన్నెల వనితల్.*

దేవ లోకమున విచిత్రమే విరిసెన
*కంది చెట్టుకు మామిడి కాయ గాచె*
నేను ౘూడలేదు యిది జగాన విన్న
యో పుకారు! లేదీ వింత యుర్వినందు.






*పూలతోటను బెంచినంతనె మోక్షమెట్టుల వచ్చునో*

శ్రీలు చిందెడు రత్నగర్భను చిత్స్వరూపిణినిన్ మదిన్

వేలుపై యిల విద్య పంచెడి వీణ ధారిణి వాణినిన్

తేలికైన పదాలతో వినుతించు భాగ్యము యుండగన్




ఎండలు మండుౘుండగ రవీంద్రుని తాపము తాళలేక యో

బండన వాలిపోవగను బక్కని తాతను కాౘుకొందుకై

*గుండెల పైన గ్రుద్దుచును కొట్టుచు ప్రాణము నిల్పిరక్కటా*

నిండుగ గాలి పీల్చగనె నెమ్మదిగా తన యింట దింపిరే.


No comments: