Tuesday, July 23, 2019

శ్రీ దేవీ స్తుతి

భక్తి కలిగితె పూజరా భుక్తి కొరకు కాదుగా
శక్తి కొలది అర్చనా ముక్తి పేరుతో వలయునా
మోహమేల మోక్షంపై మౌనమొక్కటె సాధనోయ్
మదము మది మనది కాదోయ్
మాధవా వినుమా మా ప్రార్థన
మత్సరము వదలలేము మంత్రము చదవలేము
మాటను విడువలేము
మీపై ధ్యాసను నిలుపలేము
మొక్కుబడి దీర్పగలేము
మీ మూర్తిని సైతం కొలువలేము
మిమ్ము దయ నడగక నుండలేము

పేగు తెంచిన తల్లికే అమ్మవమ్మ
పేర్మి తోడ మమ్ము సదా జూడవమ్మ
పేదలమనవు నీవు నెపుడు దరమవమ్మ
పేచీలు మేము జూపీన ఓర్చు దుర్గమ్మ
పెనవేసుకున్న బంధం నీతో మాది పెద్దమ్మ
పేరు పేరునా గూర్చి నిను అర్చించ ప్రయత్నింతునమ్మ
పేర్చి నీదు నామములు లెక్కించలేమమ్మ
ప్రేరణ నిచ్చి నీ వైపుకు మమ్ము నడుపమ్మ
పెట్టలేదనీ సొమ్ములు మరి అలుగకమ్మ

కలదె సంపద నీ యందు ధ్యాస కంటె
కలిమి బలిమి అంతయు నీవే కదా
కూరిమి పేరిమి నీ నుంచి వచ్చినదే కాదా
కరుణ జూపు నీవుండగా నాకేల కలత

త్రైలోక్య జననీ త్రిభువన పాలినీ
త్రయామయీం పదార్చితా తాంబూల చర్వణ చర్వితా
తామశ నాశక దేవిగా తీక్షణ దృక్కుల దీవెన
తమసములొందే మాకొసగుమా
తొలగించుమా మా ఆపదలు
తరమకుమా మమ్ము తప్పులున్నవని
తరుణివిగా నీకు ఇది తప్పదుగా
తుమ్మెదలు వాలు శుభ మోము నీదీ
తేనెలు గారు తీపి పలుకులు నీవీ
తోయజాక్షీ నీకిదె మా వందనం

శ్రీ మాత్రే నమః

నీదు చరణములే శరణము
నీ గాధలే చేతుము శ్రవణము
నిను వదిలితే మాకు అంతటా రణమే
మనమున అది మేమగా మాన్పలేని వాతావరణము
నిను తలచితేనే అగును సకలము పూర్ణము
నిను కొలిచినదె ఉత్తమ పురాణము
నిను అనుసరించి ఏ కదా పాడును ఆ వాణీ
నిను ఏకధాటిగా కొలుచును కదా రంగనాథుని రాణీ
అతివల మూలమైన ఓ తరుణీ
నిఖిల లోక కళ్యాణీ
నీలకంఠుని శ్రీ రమణీ
నీరజనాభుని శసహోదరీ
భువనములకెల్లా భవానీ
బ్రోవుమమ్మా మమ్ములనూ

వాణీ రమా సేవితా
వారాహీ నామధేయితా
వామాంకా నివాసితా
వసుంధరా పూజితా
కదనరంగాపరాజితా
కామితార్థ ప్రదాయితా
కాణిపాకుని మాతృకా
కాంచీపుర నాయికా
వందనమ్ములు తరుణీమణీ
వర్చస్సు కల సాకార రూపిణీ
వదనమ్మున చెదరని దరహాసినీ
సదా సుమధుర భాషిణీ

చిదానంద గుణ భాసినీ
చిన్ముద్రాలంకత సంధాయినీ
సదా చిద్విలాసినీ
చంద్రశేఖర భామిని

చీనాంబరధర ధారిణీ
చింతా ప్రశమన వరప్రదాయినీ
చతుర్భుజ రూపిణీ
చాముండా ఆశ్రిత రక్షకీ

చుక్కల మధ్యన తారకలా
చీకటి చీల్చే నాయకీ
చిక్కులు దీర్చే దయామయి
చింతామణికీ మూలమూ

చిత్తశుద్ధి కలుగజేయవ మాకు
చందనమంటి చల్లదనమీయవే
చైతన్యమును దొలగనీయక మమ్ము
చైత్ర కోయిలల్లె నిన్ను గొలువనిమ్ము




శ్రీ కంచి కామాక్షి:
---------------------


కంచిలోన వెలసీనావు మాకు
కవచమై సదా నిలచీనావూ
కనకవర్షమును కురిపించీనావు
కరుణామృతమును చిలికీనావు
కమనీయ వదనవు కమల నయనవు
కైలాస వాసినివి కైవల్యదాయినివి
కైమోడ్పులందుకో మా కైదండలివిగో మా
కై నీవు తరలిరా మా క్షేమ భారము మోరవా

No comments: