Sunday, October 31, 2021

శారదాంబ శతకము

 1.


శ్రీ శ్రీ శ్రీ శృంగ గిరి పీఠాధిపులకు సాష్టాంగ దండ ప్రణామములిఠుచు


మాతపితరులకును వందనమిడి

పతిదేవులకు ప్రణతులిడి

నను ప్రోత్సహించు నా కుటుంబ సభ్యులందఱకూ ఆనందము గలుగునట్లు

మాన్యులు, సాహితీబంధు శ్రీ తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గురువర్యులకు నమస్సులతో


శుభములు గూర్చమని మనవి చేయుచూ శారదాంబకు అక్షర మాల

షిర్డి వాసుడైన చిత్స్వరూపుడు సాయి

క్షణము క్షణము నన్ను గాచువాడు

యాశివచనమడుగ యానందముగ నిచ్చు

గురువు నీతడేగ! ధరణినందు

ఆది పూజ్య నాకు నానతి నీయుమ

యనుచు వేడుచుంటి నయ్య నేను

శారదాంబ పైన శతక రచన చేయ

మనవి గనుమ దేవ! జనని తనయ!


జన్మనొసగినట్టి జననీ జనకులకు

వందనంబులిత్తు వాక్కు తోడ!

తోడునుండి నడుపు తోబుట్టువులకును

పేర్మి నింపు పలుకు! విన్నవింతు

భార్య వెన్ను తట్టు పతిదేవులకు నిత్తు

ధన్యవాద పలుకు! తలపు నందు

స్వార్థమసలు లేక స్వాగతించుచు నన్ను

ప్రోత్సహించునట్టి లోకమునకు

పుట్టినింట గాని మెట్టినింటను గాని

నన్ను నడుపు వారు! మిన్న యనుచు

రక్త బాంధవులకు లక్షణముగ నిత్తు 

ప్రణతి ప్రేమ తోడ! పదములల్లి

చేత గాని నన్ను చేరదీసి దయను

విద్య నేర్పినట్టి పెద్ద లైన

బాల గురువుకిచ్చు భక్తి మీర ప్రణతి!

యొక్క మాట చాల తక్కువేగ!


1.

ధరణినందు జనుల కొఱకు శృంగేరిలో

నవతరించినట్టి యంబవీవు

దర్శనంబునిమ్మ దరహాస ముఖి యని

సన్నుతింతు మమ్మ శారదాంబ


2.


భువిని మాత యుండి పుణ్య మూర్తులఁ గాయ

వలయు నని నిన్ను భక్తి తోడ

నిలిపె శంకరులు! యనల నయన! యనుచు

సన్నుతింతు మమ్మ శారదాంబ


3.

శృంగ గిరిన వెలసి సిరుల నొసగునట్టి

ౘల్లనమ్మ మమ్ము సాకుమమ్మ

పాపు లెల్ల బ్రోచు పావని వీవని

సన్నుతింతు మమ్మ శారదాంబ


4.

జ్ఞాన మార్గమునను నడువ వలయు నని

మాకు తెల్పు నట్టి మాత వనుచు

నీదు పథము నందె నిలిపి మదిని నిన్ను

సన్నతింతుమమ్మ శారదాంబ 


5.


దక్షిణమున వెలసె దక్ష పుత్రిక యని

దక్షిణనుచు మేము తపము సేయుఁ

శక్తి లేదు గాని సద్భక్తి తోడనే

సన్నుతింతు మమ్మ శారదాంబ


6.


ముజ్జగముల నేలు మూలవిరాట్టువు

ముక్తి పథము జేరు యుక్తినిమ్మ

శక్తి నిలయ! శుద్ధ సత్త్వ రూపిణి యని

సన్నుతింతు మమ్మ శారదాంబ 


7.

విశ్వ వంద్య! వనుచు వృద్ధి కారిణివని

వేద వేద్య వుయని వినతు లిడెద

దీనులకడ వెలుగు దివ్వెవీవని నిను

సన్నుతింతు మమ్మ శారదాంబ 


8.


శ్రీగిరి నిలయ యుమ శ్రేయముల నొసగు

సంపద ప్రధాత్రి! సరసిజాక్షి

జాలి చూపవేల బాల త్రిపుర యని

సన్నుతింతుమమ్మ శారదాంబ 


9.

శంకరార్యులిౘట పంకజాసన వగు

నీకు పీఠ మొసగె! నీడ నిమ్మ 

నిఖిల లోక మాత! నీకు వందనమిడి

సన్నుతింతుమమ్మ శారదాంబ 

10.


వేడి కోలు వినుమ బింకమేల జనని

కినుక వదలి రమ్మ గిరిజ! ననుచు

భక్తి మీర నీకు భజన సేయుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ 


11.

ఆదిశంకరార్యులంటి బిడ్డనిచట

నాదరించినావు అంబ! మేము

యల్పులమ్ములనక యాదుకొనుమనుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ


11వ పద్యమునిలా మార్చానమ్మా

12.

నీవు భువిని యున్న నిశ్చింత జనులకు

ననుచు నిౘట జేరి యల్పులైన

మమ్ము గాచు లోక మాతగ కీర్తించి

సన్నుతింతుమమ్మ శారదాంబ 


13.

ఋష్యశృంగ యనెడి ఋషి తపమును జేసె

నిౘట నందు చేత నీగిరిపుడు

శృంగగిరిగ యున్న శ్రేయః కరమ్మంచు

సన్నుతింతుమమ్మ శారదాంబ 

14.


శృంగపర్వతమ్ము శ్రీగిరి శిఖరమ్ము

నీ నివాసములట నిర్మలాంగి

యొక్క పరిని వచ్చి మ్రొక్కిన గాతువు!

సన్నుతింతుమమ్మ శారదాంబ 


15.

వైరి జాతులైన పాము మండూకము

చూడ చక్కనైన జోడు నిౘట

భేదభావమెపుడు లేదుగదా యని

సన్నుతింతుమమ్మ శారదాంబ 


16.

ఉదయ భారతియను సుదతి మారెను తానె

వాణిరూపమందు పల్లవించె

గనుక మమ్ము లిౘట కనికరించితివని

సన్నుతింతుమమ్మ శారదాంబ 


17.

/*ఆర్యులైన శంకరాచార్యులు స్వయముగ

మొట్ట మొదట పెట్టినట్టి పీఠము గద!

సతము విడువకుండ జనుల కావుమనుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ */


18.


ఆదిశంకరుండు ఆదిగా నిచటనే

గట్టి పీఠమును సగౌరవముగ

నిన్ను నిలిపె జనని నీరజాక్షి యనుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ 


19.

మహ్మదీయ రాజు మైసూరు పాలించు

సమయమున యొసంగె సంపదలను

నీదు కృపను వొంద! నీలవేణి యనుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ 


20.

నాఱసింహ వనము పారేటి జలమయ

తుంగ నదియు! నీకు తోడు వెలసి

దర్శనమ్ము నిచ్చి తరియింప జేసెనని

సన్నుతింతుమమ్మ శారదాంబ 


21.

ద్రవిడ శైలి నందు భువిని నిలిచె నీదు

యాలయమ్ము నిౘట! యందమలర

చందనమ్ము నలదు స్వర్ణ విగ్రహమని

సన్నుతింతుమమ్మ శారదాంబ 


22.

విజయ నగర రాజు వీరుడౌ రాయలు

వారి గురువు లైన స్వామి వారి

స్మారకమున నిలపె జనని నిన్నిచటని

సన్నుతింతుమమ్మ శారదాంబ 


23.

శిల్పులైన వారు చెక్కినట్టివి జూడ

శాంతి కలుగుచుండు సమధికముగ

సకల కళలయందు సారంబు నీవని

సన్నుతింతుమమ్మ శారదాంబ


24.

రాశులనిౘట వారు రాశి పోసినయట్లు

నిలిపి నారు బాగ నేర్పుగాను

నీదు కరుణ తోడ నేర్చినారు యనుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ 


25. 

సూర్య రశ్మి బాగ సోకుచుండె నౘట

రాశులకనుగుణము లక్షణమ్ము

నీదు కరుణ తోడ నేర్చినారు యనుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ 


26.

శ్రావ్య గాన లోల! రక్షనొసగుమమ్మ

మాయ లోన పడిన మమ్ము గాచి

ధైర్య మీయనవి! ఆర్యనుత యనుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ 


27.

వేలమాటలేల వేద వినుత! నిన్ను

దెలిసికొనుట రాని దీనులమని

విడిచి పెట్టకుండ పేర్మి పంచుమనుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ 


28.


శాంతి సహన శీలి! శక్తి స్వరూపిణి

జ్ఞాన దీప్తి వీవు! నాద జనని

బింకమేల మాదు పిలువు వినుమ యని

సన్నుతింతుమమ్మ శారదాంబ 


29.


అసుర జాతి దరుమ నఱవీర వనితగ

నిలచి నీదు కృపను నెలతలమగు

మాకు పంచునట్టి మాతవీవు ననుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ


30.

దివ్య ధామమనెడి ద్వీపమును విడచి

దీనులమగు మాకు దీవెనలిడ

భువికి జేరినట్టి భువనేశి నీవని

సన్నుతింతుమమ్మ శారదాంబ 


31.

మోక్షపురికి జేరి దాక్షాయణిని గొల్వ

జ్ఞానవీచికలను నాకు దెల్పు

మనుచు మనజులకును మాతవీవుయనుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ 


32.

జాలి జూపుమమ్మ సాధు గుణ చరిత!

పీడ యొకటి తగిలి భీతి కలిగె

శరణు వేడి నీదు చరణము పట్టుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ.


33.

అక్షరమ్ము భక్తులంధకారమ్మును

దీసివేసి నీదు దీవెనలను

మాకునొసగుననుచు మరలి నీ కరుణను

సన్నుతింతుమమ్మ శారదాంబ


34.

జాగు నోపలేను జనని నీ సుపథము

జేరి నిన్ను జూచి చింత లెల్ల

మాసిపోవుననుచు మాతృ భావనతోడ

సన్నుతింతుమమ్మ శారదాంబ 


35.

వేరు వరములడిగి భారమవ్వను గద

దర్శనమ్ము నిచ్చి తక్షణమ్ము

నీపదముల చెంత నీడనీయమనుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ 


36.

ఫాలలోచనుండు బాలగణేశుండు

పళని వాసుడు శరవణుడు నీదు

బాంధవులని నుతులు  వ్రాయుచు సతతము

సన్నుతింతుమమ్మ శారదాంబ 


37.

హంస యానగనిలనలరారు భారతి!

విద్య నొసగు శక్తి! వేధ పత్ని

పలుకు తేనెలూరు! భజన సేయుచు నిన్ను

సన్నుతింతుమమ్మ శారదాంబ


38.

నదిగ ధరణి జేరి నరుల పాపములను

తొలగ జేయు తల్లి! తలపులందు

ధర్మ వృత్తి పెంచి కర్మ బాపమనుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ 


39.

ఉలుకు పలుకు రాని శిలలు నిన్ను గొలిచి

కీర్తనలను పాడు! కృతులు వ్రాయు!

శక్తి దయల నిలయ! ముక్తినొసగమని

సన్నుతింతుమమ్మ శారదాంబ 


40.

మాట లాడలేము మానిని జనులము

మూర్ఖులమని మాకు ముద్ర వేసి

దూరముంచవలదు! దురిత శమన యని

సన్నుతింతుమమ్మ శారదాంబ 


41.

బాట లేదు మాకు బ్రతుకుట దెలియఁదు

విధిని గెల్వ లేము వీగి పోము

కనుక వీడకుండ నిను నుతియించుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ 


 42. 

ఆశ్వయుజము నందు నవతరించితి వమ్మ

మూల తార వీవు యేలినావు!

పది దినమ్ములందు భజన సేయుచు నిన్ను

సన్నుతింతుమమ్మ శారదాంబ 

43.

పూర్వ జన్మ కర్మ పుట్టిని ముంచగ

బ్రతుకు బండ లాయె ప్రజలకెల్ల

కావుమమ్మ జనని కామాక్షీ యని నిన్ను

సన్నుతింతుమమ్మ శారదాంబ 

44.

బ్రహ్మ పత్ని! నిన్ను వరముల నడుఁగము

బ్రతుకు బాట లోన బాధ లన్ని

దీర్చుకొనెడి ధైర్య తేజము గోరుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ 

45.

పార్వతి సిరి సఖియ! వాణి కళల రాణి

ౘదువు సంధ్య లింక జ్ఞానమిమ్మ

నీదు స్తుతిని జేసి నిర్వృతి పొందగ

సన్నుతింతుమమ్మ శారదాంబ


46.

వాణి! లోకములకు రాణి! సరసిజాక్షి

వాక్కు లొసగు మమ్మ వరము లిమ్మ

వాసరా నివాసి! ప్రాజ్ఞి యనుచు నిన్ను

సన్నుతింతుమమ్మ శారదాంబ 

47.

వేయి నామములును వినుతింౘ లేవట

నీదు మహిమ! తల్లి! నీరజాక్షి

అల్పులమ్ము మేము! అవని గావ మనుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ 

48.

విశ్వ వంద్య జనని వేద వినుత నీవు

విశ్వ శక్తి వీవు విమల! వాణి!

విశ్వ నాయకివిగ వృద్ధి నీయమనుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ 

49.

శ్రావ్య గాన లోల సర్వ భూపాలమున్

రాగమాలపించు లలిత వినుత

నారదాదులంత భారతీ సుతులని

సన్నుతింతుమమ్మ శారదాంబ 

50.

లోక పూజ్య! బ్రహ్మి రోదనలను బాప

నీవె దిక్కు గాద! భావ గమ్య

దూరమేలనమ్ము తోయజాక్షి యనుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ.

51.

నదిగ నిౘట పాఱి అందఱి దప్పిక

తీర్చు కల్పవల్లి! దివ్య జ్యోతి

జ్ఞాన తృష్ణ నొసగి సాయమీయ మనుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ

52.

శార్వరీ జనమ్ము నోర్వగ లేరమ్మ

బాధలేవి బ్రతుకు బాట లోన

గాన సతము సుఖము కలిమి లొసగమని

సన్నుతింతుమమ్మ శారదాంబ

53.

లోభ మోహ శోక రోగములకు మేము

వెఱసి పోయినాము! వెతలు బాపి

వెలుగునొసగమనుచు వినుతించుచు నిను

సన్నుతింతుమమ్మ శారదాంబ 

54.

జాతి వైరములను జంతువులు మఱుచు

గాని నరులకెపుడు కలతలేగ

వాని బాపుమమ్మ వాణి యనుచు నిన్ను

సన్నుతింతుమమ్మ శారదాంబ 

55.

ఏటికెదురు నెపుడు నీదలేము జనని

నావ నుంచి గాచి నయము జేసి

భయము లెల్ల నీదు పదము లిమ్మ యనుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ 

56.

కలువ కనుల తోటి కొలను నీటిని పోలు

ౘల్లనైన గుణము సతము చూపి

కరుణనీయవమ్మ కల్పవల్లీ యని

సన్నుతింతుమమ్మశారదాంబ

57.

ౘలువ కనుల తల్లి స్వాగతమ్ము గొనుమ

ధరణి పైకి చేరి దయను జూపి

జన్మ ఫలమునిమ్మ జగదంబ యని నిను

సన్నుతింతుమమ్మ శారదాంబ

58.

ఆలకించి మొరలు! పాలించు మము నీవు

ఆది శక్తి! సతము నాదుకొనుమ

నవని పైన నిలచి! భవిత నొసగుమని

సన్నుతింతుమమ్మ శారదాంబ 

59.

యుగము లెన్ని గాని జగము లన్నియు నీదు

కన్ను సన్న దాటి కదలలేవు!

విశ్వమాత వీవు విజయ లక్ష్మివనుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ 

60.

లోకమంత నిండె లోభ మోహ మదము

యనెడి వర్గపు నిలయముగ తల్లి!

గాచకున్న నీవు కలతలే యని వేడి

సన్నుతింతుమమ్మ శారదాంబ 

61.

నీవు చూపు దారి నిశ్చింత మాకెప్డు

గాన కరుణ చూపి కలత దీర్చి

వెలుగు నింపి జ్ఞాన కలిమి పంౘమనుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ 

62. *ఆలయమున ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు అంకురించిన తలంపు ఇది*

తల్లి! యాలయమున దలచుచు నీ చుట్టు

తిరుగుదాము యన్న దెలిసి వచ్చె

మొదలు తుదయు లేని మూల శక్తివనుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ 

63. *అన్నీ 'క' తోటే*

కనులు మూసి నిన్ను కలలోన గాంచిన

కలిమి నొసగు తల్లి కలికి చిలక

కళల రాణి వాణి కచ్ఛపీ ధారిగా

సన్నుతింతుమమ్మ శారదాంబ 

64.

ధరణి పైన నదిగ దయను పాఱుచు మాకు

బ్రతుకునొసగినట్టి బ్రహ్మ పత్ని!

మాత గా యిౘటన మము గాచితివనుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ

65.

రోజు కొక్క మారు లోకమంతయు నిను

తలచినంత కలుగు కలిమి కలుగు

జ్ఞానవిదయనెల్ల దానమొసగు నిన్ను

సన్నుతింతుమమ్మ శారదాంబ 

66.

మకుటమొకటి దెచ్చి మానిని శిరమున

నిలిపిచూచినంత తొలగు భ్రమలు

నీదు శిరము మించు నిధులు లేవిలనని

సన్నుతింతుమమ్మ శారదాంబ 

67.


కేశములను గనిన క్లేశములు దొలగు

నంధకారమంత యంతమొందు

నీదు కురులు రక్ష నీలవేణి యనుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ 

68.

జలజ నయన గాన ౘల్లని చూపులు

గాచు మమ్ము సతము కరుణ పూని!

శీతల గుణ శీల చేదుకొనుమ యని

సన్నుతింతుమమ్మ శారదాంబ 

69.

కరములందు చూడ కమలము పొత్తము

వీణ యభయ వరద! వీక్షకులకు

కల్పతరువు గాద! కల్ప నాయకి యని

సన్నుతింతుమమ్మ శారదాంబ 

70.

దారి తప్పి యింటి దరికి జేరని బిడ్డ 

తల్లిని గనినపుడు ధైర్యమందు

నట్లు నిన్ను జేరినంత మోదమనుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ 

71.

హంసవాహనమున యవని చేరెడి నీవు

భ్రాంతి లోన యున్న భక్త జనుల

నేరమెంచకుండా నేర్పు మంచిని యని

సన్నుతింతుమమ్మ శారదాంబ 

సన్నుతింతుమమ్మ శారదాంబ 

72.

ఎంత ౘదువుకున్న యెఱుఁగమైతిమి గాని

బ్రహ్మ మన్న మాట భ్రాంతి వలన

నీవు యున్న చోటు నిజ పురమనుచును

సన్నుతింతుమమ్మ శారదాంబ 

73.

బ్రహ్మమెపుడు గాంచు పథమెఱుఁగము నీదు

ద్వీపమందు మేము దిగుట రాదు

మదిని నిన్ను నిలిపి మైమరచుచు నిన్ను

సన్నుతింతుమమ్మ శారదాంబ

74.

జన్మలెన్ని యైన చదువలేమమ్మ నీ

కళల నెపుడు మేము! కర్మ వలన!

గాని నీవు మమ్ము గాంచి గాచుమనుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ 

75.

కనులనెదుట నున్న కల్పవల్లిని మాయ

పొరల వలన జూడబోని మాకు

నీవు తప్ప లేదు నీడ యనుచు మేము

సన్నుతింతుమమ్మ శారదాంబ 

76.

భోగ లాలసులము! యే గురి లేదమ్మ

దైవనామమన్న! దలువబోము

గాని గామ్యములను గలిగి దీర్పమునుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ 

77.

చిత్రమేమిటన్న చిత్తము నందు మే

మెపుడుఁ దలువకున్న మిమ్ము జనని

మేలు గూర్చెదవు మీన నయని యని (లాటానుప్రాసమా? శబ్దమొకటే, అర్థ భేదము).

సన్నుతింతుమమ్మ శారదాంబ 

78.

సుప్రభాత సేవ సుమమాలికల శోభ

నందజేయు చోట సుందరముగ

వెలసి దీవెనలిడు వేద మాత యనుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ 

79.

బిడ్డ బాగు తప్ప వేరు తలపు లేదు

పెరిగి పోయె తల్లి వేదనిౘట

భావి తరముఁ కొఱకు భవ్య పథముఁ గోరి

సన్నుతింతుమమ్మ శారదాంబ 

80.

శిశువు వోలె జూచి శిక్షలు వేయక

తప్పులన్ని గాచు తల్లి! వాణి

నీదు పేర్మి మాకు నిధులు యనుచు నిన్ను

సన్నుతింతుమమ్మ శారదాంబ 

81.

ఆలయమున నున్న అందఱి మదిలోన

నిలచినట్టి తల్లి నీదు కరుణ

యంతు లేని సంద్రమని దెలిసికొనుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ 

82.

సూత్రమేమి లేదు నాత్రమొకటి తప్ప!

నిన్ను గొలుచుకొనుట నిరుడు జన్మ

వరము మాకు తల్లి! పాహి పాహి యనుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ 

83.

లోకమేది యైన నీ కను పాపలే

పాలపుంత నందు వసుధ నున్న

మాదు రక్ష కూడ! మాత! నీదే యని

సన్నుతింతుమమ్మ శారదాంబ 

84.

యుగ యుగములు నీకు యొక్క దినమ్మౌను

గాన రెప్ప పాటు గాద తల్లి!

మాదు బ్రతుకు నీకు! మఱి గాచుమా యని

సన్నుతింతుమమ్మ శారదాంబ 

85.

నీవు పట్టకున్న నిఖిల జగతి యింక

వంటరైన ఛందమంటు జనని

తెలుపుచుంటిమమ్మ తెరలు దీయుమనుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ 

86.

భక్త జనుల బ్రోవ భారతీ తీర్థుల

నిలకుపంపినావు! కలత దీర్చు

స్వాములందు మేము సద్భక్తి మెలగుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ 

87.

తీర్థులైన వారి దివ్య తేజము మము

గాచు నన్న భావన చరించి

మమ్ము నిలుపు నమ్మ! మా జననీ యని

సన్నుతింతుమమ్మ శారదాంబ 

88.

ముక్తి నెపుడు నడుగఁ బోము నీ సామీప్య

మందు నిలచు భాగ్య మందుకొన్న

చాలు ననుచు సతము జారని మనసుతో

సన్నుతింతుమమ్మ శారదాంబ 

89.

ఆగ్రహింౘబోకు మమృత హస్తా దయా

సింధు వాణి దీన బంధు మాదు

దోషములను మఱచి తోషములీమని

సన్నుతింతుమమ్మ శారదాంబ 

90.

పద్యమల్ల లేము! విద్య లేదుగ మాకు

నక్షరార్చనైన యసలు రాదు

నిత్య స్మరణ జేర్చు సత్య లోకమున నిన్

సన్నుతింతుమమ్మ శారదాంబ 

91.

కలము పట్టినంత కదులు వరము నిమ్మ

కవనములను వ్రాసి! కమల నయన!

తృప్తి పొందెదము మదిని నీదు నుతులతో

సన్నుతింతుమమ్మ శారదాంబ 

92.

శ్వేత వస్త్ర ధారి! వెన్నెల వదనవు

మేఘమాల మధ్య మెఱయు నీవు

అంచయాన సతము హ్లోద రూపిణి వని

సన్నుతింతుమమ్మ శారదాంబ 

93.

యోజనములు దాటి యొక్క పరికి నిన్ను

చూచుకున్న చాలు శోభనాంగి

కనులు నిండి పోవు! గాన నౘట సదా

సన్నుతింతుమమ్మ శారదాంబ 

94.

తుంగ యొడ్డునందు తోయజాక్షి! వెలసి

మమ్ము గాౘ మంగళముగ

పూజలందుకొనెడి పుష్పాలంకృత యని

సన్నుతింతుమమ్మ శారదాంబ 

95.

నారదాదులంత నయముగ కొలిచెడి

లోకమాతవమ్మ! బ్రోవు మమ్ము!

కోటి సూర్య కాంతి కోమలాంగి యనుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ 

96.

పండు వెన్నెలైన పండదు మాకును

జనని నీదు కరుణ సాగకున్న

నీదు పలుకు చాలు నిరతము మాకని

సన్నుతింతుమమ్మ శారదాంబ 

97.

జాలి చూపవేల బేలలమైతిమి

జాగు మాని రమ్మ జనని చెంత

చేరి శాంతి యనెడి సిరులనిమ్మా యని

సన్నుతింతుమమ్మ శారదాంబ 

98.

నారద జననీ సునాద వినోదినీ

నాల్గు వేదములకు నాయకివని

నలు దెసలన కీర్తి గలిగె ననుచు నిను

సన్నుతింతుమమ్మ శారదాంబ

99.

బుద్ధి దాత్రి సకల సిద్ధులేమి యడుగ

నీదు చరణములకు నాదు మదిన

నిలిపి దీర్చుకొందు దలపుల గొలుచుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ 

100.

నలుయుగంబులందు నాడి నందున యుండు

నీదు నామమేను! నీలవేణి!

మరువమొక్కమాటు! మాయలోన పడక

సన్నుతింతుమమ్మ శారదాంబ 

101.

భీతి కలుగు నిన్ను వీడిన బిడ్డకు

జనని జాలి చూపి చరణములకు

సేవ జేయు భాగ్య శీలమొసగుమని

సన్నుతింతుమమ్మ శారదాంబ 

102.

అంతు పొంతు లేదు అంబ స్మరణముకు

హద్దులుండ బోవు! హర్షమొకటె

మదికి తపము దీర్చి మాతను జేర్చగ

సన్నుతింతుమమ్మ శారదాంబ 

103.

జాడ తెలియ లేదు సత్య లోకమునకు

పట్టు వీడకుండ పరుగు పెట్టి

చిత్త శుద్ధి తోడ చేరి నిన్ను భళిగ

సన్నుతింతుమమ్మ శారదాంబ 

104.

సామ గాన లోల! నామమే శరణము

వేరు దారి నెఱుఁగ! వేద వేద్య

చరణ ద్వయము పట్టి శరణు వేడుచు నిను

సన్నుతింతుమమ్మ శారదాంబ 

105.

పాపముల గణించి కోపము జూపక

మమ్ము గాయ మనవి! మందగమన!

సృష్టి కర్త పత్ని! కృపను జూపుమ యని

సన్నుతింతుమమ్మ శారదాంబ 

106.

అగణిత సుగుణముల కాలవాలము నీదు

సన్నిధేను తల్లి! వెన్న వంటి

ౘల్లనైన భనసు తల్ల నీది యనుచు

సన్నుతింతుమమ్మ శారదాంబ 

107.

చేత కాని మమ్ము చేరదీసి విమల

యశము నొసగి జయము వశముఁ జేసి

మోడు వారనీక కీడు దరుము నిన్ను

సన్నుతింతుమమ్మశారదాంబ

108.

ఆలకించి మాదు అంతరంగములను!

యాదుకొనవె తల్లి యంౘ యాన!

హారతిదియె గొనుమ! భారతీ యని నిన్ను

సన్నుతింతుమమ్మ శారదాంబ 



2 comments:

వెంకట రాజారావు . లక్కాకుల said...

నిలువెల్ల తెల్లని వలువలో వెలుగొందు
వాగ్దేవి ! శారదా ! వందనములు ,
తెల్లదామర పైన తేజరిల్లెడు తల్లి !
బ్రాహ్మీ ! సనాతనీ ! వందనములు ,
బ్రహ్మ విష్ణు శివులు ప్రస్తుతించెడి తల్లి !
పరదేవతా ! నీకు వందనములు ,
పద్మ పుస్తక శుక స్ఫటిక మాలల వెల్గు
పరబ్రహ్మ రూపిణీ ! వందనములు ,

జన్మ జర జాడ్యములు వోవ జగతి గాచు
వర సరస్వతీ మాతరో ! వందనములు ,
ప్రాణులందున బుధ్ధి రూపాన నిలిచి
వరలు మూలపుటమ్మరో ! వందనములు .

Durga Madhuri said...

ఎంత అద్భుతమ్ము యింత ౘక్కని పద్యము
వ్రాసినట్టి మీకు వందనములు
తల్లి భారతి నుతి తళుకున మెఱిసెను
ధన్యవాదములివి! దయను గొనుమ