Wednesday, October 6, 2021

ఆడ జన్మ - ఆట వెలది

1.


జగతి లోన నాడుఁ జన్మను మించిన

బాధ యేమి గలదు! బ్రతుకు చేదు

వేరు దారి లేదు వేదన తప్పదు!

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


2. 


ౘదువు పెద్దదైన పదవి ఘనము గున్న

అత్తవారి యింట మెత్తబడును

మాట లాడకుండ మౌనముద్ర వహించు

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


3.


కష్ట పడుచు నుండి కలికి నవ్వగలేదు

వెతలు దీర్ప రారు వేల్పు లైన

కడలి మించు నీరు కనుల నుండు సతము

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


4.

పేర్మి పంచుటందు పెన్నిధి యౌనామె

కూర్మికైన నోచుకొనగలేని

మెట్టినింటి మగువ! వెట్టి చాకిరి చేయు

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


5. 


పెళ్ళి నాటి నుండి పిడకలంటు వఱకు

నిందలన్ని మోసి నీరసించి

తుదకు చెఱిగి పోవు! ముదము యన్నది లేక

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


6.

పూజ లెన్ని జేసి పుణ్యము గలిగిన

మారబోదు ఖర్మ మగువ కెపుడు

మంచి జరగదెపుడు! మహిని మగువలకు

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


6.


పెట్టు పోత కొఱకు గట్టి వాదన చేయు

మగని పెండ్లి వారు మంచివారు

పెట్టలేని యాడు పెండ్లి వారిక చేదు

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


7.


జాతకాలు వట్టి పాతకాలపు మాట

మార్పు చెందబోదు మగని మనసు

నాలి వైపు నెపుడు వాలడతఁడు గదా

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


8.

మెతుకు నందనీరు మేలు జరుగనీరు

అన్నపానములకు ఆదరణకు

లోటు వీడబోదు రోదనే మిగులును

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము

9.

చిరునగవుల మరచి చింతల మధ్యన

సాగుచుండు వనిత శాప జనిత

ఎన్ని చప్పుకున్న నింకెన్నియోనుండు

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


10. 

వీరవనిత లైన భీరువులే సదా

భర్త ముంగిటెప్పుడు! బానిసలుగ

మసలుచుండ మగువ మనసు విప్పు కొనదు

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


11.

పెదవి తెఱచి మనసు విప్పలేదు మగువ

మనసు నున్న ఘోష వినరు ఎవరు!

మాయ తెలియ దమ్మ మర్మమెఱుఁగకున్న

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


12.


ధర్మ బుద్ది కన్న మర్మ గుణము తోడ

మెలుగుచుండురంట మెట్టినింట!

నీతి జాతి లేక నింద వేయుచునుండు

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


13.

భార్య విలువ గాదు భారమనుచు నుండు

భర్త వద్ద నెప్పుడు భయము మిగులు

నీటి కుండలగును నీలి కన్నులపుడు

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము

20.

అంత్య గమ్య మెప్పుడు నత్తవారి గడప

పుట్టినింట తాను చుట్టమగును

రెండ్లు గృహములందు లెక్క యుండదు గద

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము

21.

కట్నమెంత సొమ్ము కట్టబెట్టిన గాని

తృప్తి రాని మగని తీరు గనుచు

వగచు చుండవలయు వనిత! తుద వఱకున్

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము

22.

పెట్టు పోత చెంత బెట్టు మొదలు బెట్టి

ప్రతి విషయమునందు పట్టు బట్టి

క్షోభకు గురి చేసి లాభ పడెడి చోట

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము

23.

బ్రతుకు తెఱువు జూపు బాటలేమియు లేని

విద్య రాని వాని విలువ గట్టి

అమ్మకాన పెట్టు నత్తవారల చెంత

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


24.

నిౙము లెన్నొ దాచి నీతి జాతియు లేక

కొడుకు పెండ్లి జేసి కొరివి వోలె

పరుల జాతయైన వధువు నను ఇంట

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


25.


గొప్ప ౘదువు లున్న కురౘ మనసు తోడ

మసలు మగని చెంత మథన పడుచు

బంధములను నిలుపు గంధములగునట్టి

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


25.


భార్య ఘనత జూసి భర్త ఓర్వగ లేడు

పరువు తీయు చుండ పరుల నెదుట

నీచ పలుకు పలికి! పీచమణచు చోట

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


26.

మదిని పతిని నమ్మి మసలు మగువలను

మోసగుణము తోడ ముంచు చుండు

స్వార్థ పరుని చెంత చరియించు నపుడు

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


27.

పతిని దైవమల్లె భార్య కొలుచు చుండు

మగడు మాత్రమెపుడు మసలడట్లు

బానిసల్లె జూచు భర్త చెంత సతము

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


28.


అల్లుడననుచు సతము హౙము జూపుచునుండు

మగడు భార్య తరఫు మనుజుల కడ!

ఆడుపిల్ల వారు అణగవలసి యున్న

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము

29.

తమరి వారి కొఱకు ధర్మపత్నిని భర్త

సేవజేయమనుచు చెప్పగలడు

నాలి జనలకెపుడు నండ గాకయున్న

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


30.

ఆలి యొక్క ధనము అత్త వారల సొత్తు

భర్త జీత మడుగ వలదు మగువ

స్వార్థ పరుల చెంత నర్థవిషయములందు

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


31.

ఆలు మగల మధ్య నన్యులు జేరుచు

తగవు పెట్టుచుంద్రు తరచు వారు

పరుల పలుకు నమ్ము పతి చెంత పాపము

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


32.


దుర్గుణములు గలిగి దూఱు బద్దియు గల్గి

నత్తవారు సతము నాడుచుండ్రు

కల్మషంబు లేని కారుణ్య మూర్తగు

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


33.

నెలను దప్పెనేని నెలతకు మొదలిక

నిలవనీయనట్టి నిప్పు రవ్వ

మగువ చుట్టు చేరి మట్టు బెట్టెడి చోట

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


34.

కొందరింట కొడుకు కావలెనని

పాపను గనవలదని పట్టు పెరుఁగు

విధిని నిర్ణయించి వీధి పాలగు చోట

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


35.


కొందరింట నేమొ గొడ్రాలవవలెను

యనుచు యార్తి పెట్టి యాడుకొనుచు

అత్త వారలెపుడు ఆరళ్ళు పెట్టిన 

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


36.


కొడుకు బిడ్డలెపుడు కోడలి సంతులే

తమకు మనవలనరు తగవు సేయు

కొడుకు మాత్రమేను కోరునత్తలు యున్న 

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


37.

వేల కొలది గలవు వేదన పెట్టెడి

మెట్టినిళ్ళు! మెఱుగు పడవు

నెంత వేచియున్న నింతి గాథలెపుడు!

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


38.


తప్పు లెన్నొ జేసి తగవు లాడెదరట

నింద వేసి మగువ నీరు గార్చి!

మాట నేర్చినట్టి మాయ గాళ్ళకు చెంత 

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


39.

తరిగి పోని సేవ తరుణి జేయుచు నుండు

మెచ్చుకొనరు గాక మెచ్చుకొనరు

పెదవి విప్పరెపుడు! పదము లనని చోట

పడతి బ్రతుకు జూడ పాట్ల మయఢు


40.


గొప్ప పనుల లెన్ని కోడలు జేసినన్

వప్పుకొనరు గాని పట్టుకొనుచు

నొక్క తప్పు యున్న నురిమి జూచెడి చోట

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


41.


మాట వెండి మౌనముద్రను దాల్చి

మసలు కొను మగువనలుసుగ జూసి

రెచ్చగొట్టు వారు! రిపులంటి వారితో

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


42.


పెద్దరికము నసలు పేర్మి యుండవలెను

మంచి మన్ననలను మసలవలయు

వయసుతోడ గారవమ్ము రాకున్నచో

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


43.


అత్త యన్న అమ్మ ఆదరించవలయు

మామ యన్ప తండ్రి! మార్దవమ్ము

తోడ గొడుగు వోలె జూడకుండిన చోట

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


44.

ఆడుబిడ్డలన్న అక్కచెల్లెండ్రేను

బావమరదులన్న భ్రాతలేను

తోటి కోడలనిన తోడు రానపుడిక

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


45.

బంధు గణము లన్న బాగయుండవలయు

తంపు మాట వలదు సొంపు పలుకు

చెప్పవలయు సతము చెఱచు వారుల తోడ

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


46.

ఆలియన్న పలుకు అందమైన పలుకు

గేలి జేసినేని కీడు తుదకు

గౌరవింౘకుండ పోరు సేసెడి చోట

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


47.

ధర్మ పత్ని విడచి ధర్మంబును విడచి

పరుల చెంత కేగు పతులు యున్న

హాని కారకమ్ము యట్టి వారల చెంత 

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


48.

రూప సంపదలకు లోపము లుండును

గుణము జూడవలయు గోడ వోలె

నొకరికొకరు నిలచి నూతమీయని చోట్ల 

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


49.

విలువ లేని చోట వెలుగ లేదు వనిత

విజయమంద లేదు! వీగిపోవు

మగువ వెనుక నెపుడు మగడు యుండనపుడు

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


50.

కూతురంటిదేను కోడలైనను మరి

వేరు న్యాయమేల వింతగాదె

సమత మమత లేక సతమతమగు చోట

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


51.

వదిన అన్న అమ్మ! వలదు బేధమెపుడు

మరుదులైన గలిసి మసల వలయు

వేరు జేసి చూసి విడదీయ చోట్లను

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


52.


ౙబ్బు జేసెనేని సాకుట ధర్మము

వీడకుండ తనకు తోడు నీడ

గాని వారు తనను కలత బెట్టిన గాని

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


53.

భార్య తరఫు వారు భాధలో నున్నచో

నాదుకొనుట మంచి నడత గాదె

నాదు వారు గాదు నాకేల యనుచోట్ల

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


54.

వృద్ధులన్న వారు వృద్ధి జేయవలయు

నడత నేర్పకున్న నష్టమేను

ధర్మ బాట వీడి తప్పు దిద్దని చోట్ల 

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


55.

తప్పు జేయు వారు తమవారు గావున

ధర్మ బాట విడచి తగవు పట్టి

నింతి మీద దూఱు నితరుల పాలగు

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


56.

ఆత్మహత్య మాని అవమానములఁ పడి

సంతు కొఱకు తాను సర్దుకొనిన

జాలి లేని వారు సాధించు చోట్లను

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


57.

భార్య మాట వినుట పరువు తీయుననుచు

మసలు వాని మదిని మార్చలేము

తనకుటుంబమన్న తగని మగని చెంత 

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


58.

పరుల ఎదుట భార్య పరువు తీయుట పట్ల 

తగని మక్కువనెడి మగని చెంత 

జీవితాంతమింక చేదు గుళిక గాన

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


59.

ఆలుమగలు యన్న యర్థనారీశులు

బేధముండ వలదు పేర్మి తప్ప 

నీవు నేను యనుచు నీరుగార్చుచు నున్న

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


60.


అలకలుండవచ్చు హద్దులు మీఱక

సర్దుకొనుచు వారు సాగవలయు

పరులు జేరి తగవు పగలు పెంచెడి చోట్ల 

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


61.

గోప్యముంచెనేని కొంపలంటు కొనును

నైన భార్య భర్త యన్న నెపుడు

స్వచ్ఛ గుణము మేలు జారెనేని మొదలు

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


62.

భరత భూమి చరిత భార్య నెపుడు మెచ్చె

నాడు బిడ్డ యన్న యమిత ప్రేమ

కుటిల నీతి చేరి కూర్మి గాల్చెడి చోట 

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


63.

కోరినంత రాదు కోట్ల సంపదయైన

కష్ట పడిన దక్కు కనకమైన

నంత కన్న ఘనము నతివ యనని చోట 

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


64.


కొంగు ముడిని వేసి కొండంత అండగా

నిలుచు వాడు ఘనుడు! నిలచి పోవు

చరిత నందు! నట్లు చరియించకున్నచో

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


65.

వెలుగు దివ్వె తాను బేల కాదు ననుచు

మనసు నందు సతము మసలుకొనుచు

నాదరించకుండ నార్తి పంచని చోట 

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


66.


వెట్టి చాకిరీలు గట్టి మాటల మూట

వేచి యుండు చోట వెన్నెలేది

ఆలియన్న పదవి అంట్లకే ననుచోట

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


67.

విధుల నైన బయటి వీధుల నందైన

గెలువ లేని మగడు యలుక దాచి

భార్య పైన జూపు వాడైన మరిక యా

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


68.

ధనము జాలకున్న తాను త్యాగము సేయు

భార్య విలువ మరచి పతులు యరుచు

వారి పైన నెట్టి వైరము లేకున్న

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


69.

ఆడపిల్ల యనుచు అమ్మ అయ్య తనను

మగని చేత పెట్టి మైమరుతురు

అత్త వారి యింట ఆదరణలు లేక

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము

70.

రెండ్లు యిండ్ల తాను లెక్క లోనికి రాదు

నెంత వింత! తుదకు నింతి యెపుడు

నిలను మిగులు తాను ఏకాకి గావున

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము

71.

సాటి వారు గూడ సానుభూతియు లేక

పుల్ల విరుపు మాట విల్లు వోల

వేసి హర్ష మంది పిప్పి జేయును గాన

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


72.

కర్మ ఫలము యనుచు కబుర్లు చెపుతారు

గాని కష్టమెపుడు గాచరెవరు

వంటరైన వనిత వగచ వలయునన్న

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


73.

మేడ కూల వచ్చు నీడయు జారును

తోడగు సతి సతము కూడి యుండు

కష్ట నష్ట ములను కరము వీడదు ఐన

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


74.


పూజ లెన్ని సేసి పుణ్యము లను మోసి

బడసె నేని మంచి భర్త రాడు

వగచి లాభమేమి భరత సీమన నేడు

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము

75.


మంత్రి వోలె భార్య మాట లాడు నైన

వినరు నామె పలుకు! విలువ లేని

చోట నిలుచి యుండి వేదన లను పొందు

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


76.

త్యాగములను జేసి ధర్మ బాటను పట్టి

నడచి నంత రాదు నగవు తనకు

భర్త నవ్వకున్న భార్య నవ్వ వలదు

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


77.

నిజము దెలియకుండ నింద లన్నియు నమ్మి

బాధ పెట్టుఁ మగడు భార్య నెపుడు

మారదింక ధరణిఁ మగువ జీవితములు

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


78.

గెలుపు గుర్రమామె పలుకు పసిడి సాటి

గాని మగని ముందు కలహ కంఠి

యన్న పేరు నిలచు! యవహేళనల చోట

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


79.

తిమిరమందునామె దీపకాంతి ననుచు

స్వాగతింౘకుండ చావగొట్టు

జనుల తోడ నెపుడు జగడమాడక నుండు

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము

80.


సహన శీలి కైన సాధింపులే సదా!

మేలు చేయు సతిని మ్రింగి వేసి

మాట తోడ పొడుచు మనుజూల నడుమను

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


81.


పరుల బిడ్డ యైన పత్ని తనది గాదె

మనిషి పోయెననుచు మారకుండ

అల్ప ఆయువనుచు ఆరళ్ళు పెట్టిన 

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


82.


ఆడి పాడు వేళ నాట చాలుననుచు

పెండ్లి జేసి పంపి పిల్ల వారు

బరువు దీరెననును! భారము మొదలిక

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


83.

పాల వాడు గాని పూల బండియె రాని

కార్య స్థలము నందు గాని మహిళ

మాటలాడెనేని మరొక మగనితోడ

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


84.

కొలువు వీడ వలయు కోడలే తనవారి

కొఱకు మగడు తనదు పరువు ననుచు

వదలకుండ నుండు పదవులను మరి

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


85.

సూర్య చంద్ర సమము చూడగ ఇల్లాలు

చేయు పనులు! స్వార్థ చింత లేక

పనులు సేయు చున్న భర్తకు చేదన్న

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


86.

అమ్మ బిడ్డకోడలాలి వదిన యని

ఎన్ని వరుస లోమరెన్ని పదవి

బాధ్యతలు తరుణికి! బలము ఫలము లేని

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


87.

కాస్త పేర్మి తోడ కరగి పోవు ఫణిత

వేరు తలపు లేవి విలువ గావు

వట్టి త్యాగ శీలి! పట్టి బంధించిన

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము

88.

కడలి మించు నట్టి గాంభీర్యము గలదు

గాని తేలి పోవు గాలి వోలె

కలత పెట్టు బంధు గణము నడుమ సదా

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము

89.

వేల మైళ్ళు దాటి వెళ్ళగలరు గాని

ఇంటి గడప దాటి ఎగురరెపుడు!

నట్టి స్త్రీల పట్ల గట్టి పట్టు వలన

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము

90.

అంతరిక్ష మైన యణు శోధన యైన

యతివ చొరవ తోడ నలతి యగును

కాని ఇంటి లోన గట్టి తొక్కిన నింక

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


91.

ఇంటి స్త్రీల నణచి నితర స్త్రీలను మెచ్చు

తుచ్ఛమైన మగని తోడు నీడ

పడగ సమము గాదె వనిత బ్రతుకు లోన

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


92.


కోవెలందు జూచి గొల్తురు భక్తిగ

నింటి లోన జూచి నేడిపించు

వింత సంతసమ్ము వేడుకైన మరిక

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము 


93.

చిత్త శుద్ధి నెవరు చిత్తగింౘరిచట

నింద లే మిగులును నీడ గాదు

భావి తరమూలకిది బాట యైన మరిక

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము

94.

తరము దాటు కొలది తరుణి జీవితమున

మెఱుఁగు పడవలయును మెట్టినిల్లు

హీనమాయె నేమి హృదయ రోదన! సదా

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


95.

వేద భూమి లోన వేదనేల సతికి

లోకువాయె నంట లోకమునకు

శాంతిసౌఖ్య మన్న భ్రాంతి యేను యనిన

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


96.

తనదు స్వార్థ మంద ధర్మ పత్ని యనెడి

పాత్ర యేల లేదు పతికి! యనుచు

వగచుచుండు వనిత పాపము! హతవిథీ

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము




97.

అహము వీడడెపుడు నాలి వద్ద మగడు

అహము తోడ మెలగి నాలి నణచు

నన్యు లెవరి ముందు నహము లేదు మరిక

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము



98.

శీల గుణము శంక విషము కన్న

హీనమైన బాధ! హేయమేను

క్షమకు నందనంత శాప గుణము చోట 

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


99.

అత్త యన్న గూడ నాడకూతురు గాదె

కోడలనగ నేల కుళ్ళు కుట్ర

కుత్సిత గుణములును కురచ బుద్ధులు యున్న

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


100.


వేయి మాటలేల వినవలయు నరులు

తరుణి లేని బ్రతుకు ధర్మమవదు

వెలుగు పంచు రేఖ! వెతలు పెట్టు చోట 

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


101.


బ్రహ్మ వ్రాయలేదు బానిసంటి బ్రతుకు

వాణిఁ బెట్టు కొనెను పలుకు లోన

విషయమెఱుగకుండ వెతలు పెట్టుట వల్ల

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము

102.

హృదయ సీమ లోన ఆదిలక్ష్మిని యుంచె

విష్ణు మూర్తి తాను ప్రియము గాను

భార్య దాసి యనెడి భర్త యున్న మరిక

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


103.


అర్థ బాగమిచ్చె ననిల నయనుడేను

శక్తి స్థానమామె! సమము సతము

చరిత తరచి జూసి చదువని వానితోన్

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


104.


పూర్వ రాజులంత పుణ్యమూర్తులు స్త్రీల 

శక్తి నెఱిఁగి మనసు చదివి మసలె

చరిత తెలియకుండ సాధించు వానితో

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


105.


యుద్ధ రంగమందు సిద్ధమగును తాను

గరిట తోడ పట్టు కలము కత్తి

అహము తోడ వారి నణచు వారల చెంత 

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


106.


రాజ్యమేల గలరు రాణింౘ గలరని

తెలియకుండ నిద్ర దీయు వాడు

లేవడన్న యాశ రేఖ లేకున్న యా

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


107.


ధనము లడుగ బోరు ధాన్యంబు లడుగరు

మణులు మాణ్యములకు గణన లేదు

కోరి నట్టి పేర్మి కొదవ యైన మరిక

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము


108.

మార్పు చెందకుండ మంకు పట్టును పట్టి

పత్ని బాధ పెట్టు పతుల చెంత

నోర్పు తోడ యున్న నుపయోగముండదే

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము

109.

అడవి జాతికన్న నధమమయ్యెను నేడు

నతివ బ్రతుకులిటుల యవనినందు!

ఇంట బయట నైన యిడుములే యెదురయ్యె!

పడతి బ్రతుకు జూడ పాట్ల మయము

No comments: