Thursday, December 12, 2024

కథకు పద్యం Swami Vivekananda Railway Station Bhojanam

 ఒకసారి స్వామి వివేకానంద మండు వేసవిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక రైల్వేస్టేషన్‌లో ఉండగా ఒక సంఘటన చోటుచేసుకుంది.

వివేకానందుడు సన్యసించారు, కనుక వారికి భగవత్ ప్రసాదంగా లభించినదే భుజిస్తుండేవారు.

భిక్షగా ముడి సామాన్లు లభిస్తే వండుకుని భుజించేవారు లేదా భిక్షాటన చేస్తుండేవారు. వివేకానందుడికి ఒకరోజు తినటానికి ఏమీ దొరకలేదు. ఆయన వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. ఆకలి బడలికలతో దాహార్తితో నేలపై కూర్చొని ఉన్న స్వామీజీని గమనించి ఒక ధనవంతుడు చులకనగా మాట్లాడనారంభించాడు.

అతని ఆలోచన ప్రకారం సన్యాసులు అంటే ఏ పనీ చేయకుండా , సోమరిలా తిరుగుతూ, ఊరిలో వారిపై భోజనానికై ఆధారపడుతూ , ప్రజలను మభ్యపెట్టి ధనం అపహరిస్తూ ఉంటారని. ఇటువంటి భావం కలిగి స్వామీజీతో అతడిలా అన్నాడు.

ఓ స్వామీ ... చూడు ... చూడు ... నేనెంత మంచి భోజనం చేస్తున్నానో.. నా వద్ద త్రాగటానికి చల్లని నీళ్లు ఉన్నాయి కూడా. నేను డబ్బులు సంపాదిస్తాను. కాబట్టి నాకు మంచి మంచి వంటకాలు, వగైరాలు అన్నీ సమకూరాయి. ఇటువంటి భోజనం నువ్వు కనీసం కలలో అయినా పొందగలవా ... ఏ సంపాదనా లేకుండా దేవుడు ... దేవుడూ... అంటూ తిరిగేవాడివి. అందుకే నీకు ఈ బాధలు. అయినా నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీకు ఏమి ఇచ్చాడయ్యా... ఆకలి బడలిక తప్ప అని దెప్పి పొడవటం మెుదలుపెట్టాడు.

స్వామీజీ ముఖంలోని ఒక్క కండరం కూడా కదలలేదు. విగ్రహంలా కూర్చొని భగవంతుని పాదపద్మాలనే తలచుకుంటున్నారు.

అప్పుడు ఒక అద్బుతం జరిగింది ...


ప్రక్క ఊరి జమీందారు ఒక వ్యక్తి వెతుక్కుంటూ వచ్చి స్వామీజీ పాదాలపై వాలిపోయాడు.

అతను స్వామితో ఇలా అన్నాడు," మీ పాదాలను సేవించి స్పృశించే భాగ్యం కలగడం నా పట్ల శ్రీ రామ చంద్రమూర్తి అనుగ్రహం.దయచేసి మీరు ఈ భోజనం స్వీకరించండి" అని ప్రాధేయపడ్డాడు.

స్వామీజీ ఎవరు నాయనా నీవు.. నేను నిన్ను ఎరుగనే... పొరబడుతున్నట్లున్నావు. నీవు వెతుకుతున్న వ్యక్తిని నేను కాదు అని అంటూ ఉంటే ఆ వ్యక్తి స్వామీజీ ముందు వెండి పీట వేసి భోజనం ఒక బంగారు అరటి ఆకు మీదకు మారుస్తూ... లేదు స్వామీ నేను కలలో చూసింది మిమ్మల్నే.

శ్రీరామచంద్రమూర్తి స్వయంగా నా కలలో కనిపించి మిమ్మల్ని చూపించి నా బిడ్డ ఆకలితో ఉంటే నీవు హాయిగా తిని నిద్రిస్తున్నావా.. లే.. లేచి అతనికి భోజనం పెట్టు అని ఆజ్ఞాపించారండి. ఆహా.. ఏమి నాభాగ్యం మీ వలన నాకు రామదర్శనం కలిగింది. ఏమి గాంభీర్యం, ఏమి సౌందర్యం ఒక్కసారి చూస్తే చాలు ఎవరూ మరచిపోలేరు.

నేను పొరబడటం లేదు స్వామీ.. దయచేసి వేడి చల్లారక ముందే ఆరగించండి. చల్లటి నీరు కూడా తెచ్చాను అన్నాడు.


స్వామీజీ కనుల వెంబడి జలజల నీరు కారింది.

ఏ అభయ హస్తమైతే తన జీవితమంతా ఆయనను కాపాడుతూ వస్తుందో... అదే అభయ హస్తమిది.

ఎదురుగా నోరు వెళ్లబెట్టి ఇదంతా చూస్తున్న ఆ ధనవంతుడు ఉన్నపళంగా స్వామి వారి పాదాలపై పడి,కన్నీటి ధారాలతో స్వామి పాదాలను అభిషేకిస్తూ క్షమాపణ కోరాడు.

సన్యాస జీవితమంటే భగవంతుని వడిలో నివసించటం అని అర్థమయింది.

నిజమైన సన్యాసిని దూషించటం అంటే భగవంతుని దూషించినట్లే అని తెలుసుకున్నాడు.

తనని నమ్ముకున్న వారిని కంటికి రెప్పలా ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు భగవంతుడు. యోగులు హృదయాలలో సదా నివసిస్తుంటాడు ఆ పరమాత్మ.

ఇది కేవలం స్వామి వివేకానంద జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన మాత్రమే ,

ఇంతకు మించినవి , ఎంతో ఆశ్చర్యం కలుగజేసేవి , భగవంతుని పట్ల , యోగుల పట్ల సడలని విశ్వాసం కలుగజేసేవి మరెన్నో ..!



సన్యసించినట్టి స్వామి వివేకుడు

ధూమశకటములు విరామమొందు

స్థలిని నిలిచిళయుండె! సంపద గలిగిన

ధనికుడౘట చేరె! తనదు పనికి.


ఆకలైన వేళ అన్నము వౘ్చునా

కష్టపడక యనుౘు కఠిన వాక్కు

నతడు పల్కె స్వామి యవతారమును గాంచి!

సోమరిగ దలంచి! చులకనగను.


నిశ్చలముగ నుండె నిండు కుండ వలెను

స్మరణ చేసినంత ౙరిగె వింత

ప్రక్క యూరినుండి పరుగున యిటు చేరి

స్వామి పాదములన పడుౘు వేడె.


భోజనమ్ము గొనుమ! నా జన్మ ధన్యంబు

మీకు పెట్టినంత నాకు తృప్తి

యనగ వినిన స్వామి యారగింౘననెను

యపుడు నాతడేడ్చె నార్తి తోడ.


తండ్రి రాముడాజ్ఞ! దర్శనమాయె నా

స్వప్నమందు నేడు! పలికెనిటుల

"నాదు భక్తుడౘట యాకలి తోనుండ

నిదుఱ వచ్చెనెట్లు నీకు?", యనెను.


గనుఁక దెచ్చినాను కలవరపాటును

దాటి వెదకుౘు మిము! ధన్యునైతి!

మీదు రక్ష నెపము! నా దైవముయె నాకు

దర్శనంబునొసగె! దయను ౘూపె!


వేళ మింౘనీక వేడి ౘల్లగ నీక

గైకొనండి దయను! కమ్మనైన

భోజనంబు యంటు రాజ ఠీవిని నింపి

వెండి పీట పైన దండి గాను.


స్వర్ణమయమగు పళ్ళెము పైన వడ్డన చేసె

యధరువులను భక్తిసుధను నింపి!

నిదియు గాంచి మనసు యదిరి పడగ లేచి

కంట నీరు గార్చె! కాళ్ళు పట్టె


భక్తి విలువ తెలిసి బాగుగా మసలిన

దైవమాదరించి తగిన రీతి

బ్రతుకు నడుపుననెడి పాఠము సత్యము

నేర్వవలయుననెను! నీతి గాను.



No comments: