Thursday, October 24, 2019

అందం - భౌతికం కాదు, భావుకత్వం.

వినీల గగనాన విరిసిన కుసుమమా!
విరుల‌ రేడువైన మా చందమామ!
విహరించుచూన్న నీ పయనమొక లిప్త ఆపుమా!!
విషాదమయమైన మా గాధనిటు వినుమా!
వివరించుచున్న నా గాయాల బాధ కనుమా!
విచారించుచున్న నన్ను ఒక్క మారు ఓదార్చుమా!!

అంటూ నైరాశ్యంతో  నేలకొరిగిన నీరజ చరవాణి "నిన్న లేని అందమేదో... నిదుర లేచెనెందుకో" అంటూ మ్రోగింది. ఉమ్.... ఎదురింటి పంకజం ఆంటీ ఎప్పుడూ ఇంతేగా! కొత్తగా ప్రయత్నం చేసిన వంటలూ తనమీదే ప్రయోగిస్తుంది, పిల్లల దగ్గర సెల్ ఫోన్లో నేర్చుకున్న "ఫీచర్సూ" తన మొబైల్ మీదే చూపిస్తుంది. ఇంకా నయం, ఆవిడ కూడా తనలాగా టెస్ట్ ఇంజనీర్ కాదు, అయ్యుంటే "డిస్ట్రక్షన్ టెస్టింగ్" పేరుతో దానిని మరింత... ఎందుకులే, మళ్లీ ఇప్పుడు అదంతా, అనుకుంటూ ఇంకా మ్రోగుతున్న ఫోన్ వంక చూసింది. తీయకపోతే ఇలాగే‌ ఆగకుండా మళ్లీ మళ్లీ చేసేట్టుగా ఉంది, అసలెవరో చూస్తే పోలా, అనుకుంటూ ఫోన్ తీసింది. చురుకైన తన చక్షువులు అంత నిర్వేదం లోనూ ఫోన్ ఆన్ చేస్తూనే కొత్త నంబరయినా ట్రూ కాలర్ యాప్ ద్వారా ఆ నెంబర్ ఎవరిదో పేరు చూసి మెదడుకు సంకేతాలు ఇచ్చినయి, చమత్కార మైన పేరు, "నెలవంక". భలే ఉందే అనుకుంటూ, ఫోన్ కాల్ ఆన్ చేసి తన తీయటి స్వరంతో, "ఉభయకుశలోపరి"అంటూ సంభాషణ మొదలు పెట్టింది.
అవును, మన భాషలో ఉన్న సౌకర్యాన్ని సౌందర్యాన్ని వదులుకోకుండా వాడుకుంటే బాగుంటుంది కదా! అందుకే ఈ అలవాటు.  అవతలి నుంచి ఒక్క లిప్త పాటు మౌనం, ఆ తర్వాత గాఢంగా ఊపిరి తీసుకుని వదిలిన సవ్వడి. ఇంకా ఎవరూ మాట్లాడకపోవడంతో ఫోన్ కట్ చేయబోయేసరికి‌ ఒక చిన్న చిరునవ్వు వినిపించింది. దాంతో ఎవరూ అంటూ మళ్లీ అడిగింది. ఆ ఒక్క చిరునవ్వు తప్ప ఎంత సేపటికీ ఏమీ వినపడట్లేదు. అందరిలాంటిదైతే ఫోన్ కట్ చేసేసేదే. కానీ ఆమె అలా కాదు, అలా వింటూండిపోయింది. అవును మరి, ఇంతవరకూ ఆమెతో అలా నవ్వినవారే లేరే! కారణం, ఆమె అందవికారం! అవును, సంపన్నుల ఇంట్లో పుట్టిన ఆమె, నిజానికి ఎంతో ఆనందంగా ఉండవలసిన ఆమె, ప్రమాదవశాత్తూ తన మోము, చేతులూ, కాలిపోవడంతో, చూడటానికి ఇబ్బందిగా ఉండేలా తయారయ్యింది.  ఉదాసీనత అనేది దరి చేరనివ్వని నీరజ లాంటి వారికి అది సమస్య కాదు, ఉన్నతంగా ఆలోచించే ఆమెకది ఎదుగుదలకసలు ఏ మాత్రమూ అడ్డూ కాదు, నిజానికి అది కూడా ఒక అవకాశం, ఎదగటానికి, శక్తిగా కాదు, వ్యక్తిగా. అవును, మెడిసిన్ చదివే రోజుల్లో హౌస్ సర్జెన్సీ చేస్తుండగా కలిగిన ఆపద వల్ల తనో అనాకారిగా మారితే, ప్రశంస వస్తే స్వీకరించి, విమర్శలు వస్తే వదిలేసినంత సులభంగా, ప్రమోదం వచ్చినప్పుడు భుజాలు ఎగురవేస్తారు, ప్రమాదం వస్తే మాత్రం బంధాలని మనుష్యులని బయటకు ఎగురవేస్తాం, అన్నారు ఆమె కుటుంబ సభ్యులు. అందుకే, ఆమె ‌‌‌‌అటు జరుగుబాటూ, ఇటు తన ఆసక్తి రెండు కలగలిపి ఉండేలా నర్సు వృత్తి చేపట్టి, బ్రతుకు వెళ్ళదీస్తోంది. దురదృష్టం ఏంటంటే, ఆమె ఎంతో ఔదార్యంతో సేవ చేద్దామని వెళ్ళినా, సగం కాలిన ఆమె మోమును చూసి, పేషెంట్లు భయపడేవారు. చివరికి మొహం అంతా చున్నీ కప్పుకుని చేతులు సాచి పని ప్రారంభిస్తున్నా పసి వాళ్ళు కూడా భయపడి ఏడుస్తున్నారు. దాంతో ఆమె మంచితనం పట్ల గుర్తింపు, గౌరవము తోనూ, ఆమె పరిస్థితి పట్ల జాలి తోనూ హాస్పిటల్ వారు ఆమెకు ఇచ్చిన అవకాశాన్ని ఉంచటమా, ఉపసంసరించటమా అన్న సందిగ్ధంలో పడ్డారు. చేతులు చాచి అడగడం ఇష్టపడని ఆమె, తన ఆసక్తి కారణంగా అటు పేషెంట్లు, తన అవసరం దృష్ట్యా ఇటు హాస్పిటల్ సిబ్బంది బాధ పడటం ఇష్టం లేక, తాను ఉంటున్న హాస్పిటల్ దగ్గరలోని తన గదికి వచ్చి ఇలా చతికిలపడింది. అదుగో, అప్పుడు మ్రోగింది ఈ ఫోన్ కాల్, తీస్తే ఇదుగో, ఈ చిరునవ్వు. ఆ నవ్వులో ఎటువంటి ఎగతాళి, జాలీ కానరాలేదు ఆమెకు, ఆ స్థానే ఒక భరోసా, ఒక ప్రేమ పూరిత పలకరింపు కానవచ్చాయి. 

No comments: