Thursday, October 24, 2019

Malluru Narasinha

మల్లూరు యందు వెలసిన నరసింహా
మమ్మేలుకోవయ్య భక్త వరదా
మంగళాలు కలిగించు ముక్తి కారకా
హేమాద్రి వాసా భక్త హృదయ నివాసా

నీ అద్రి ఇపుడు హేమాద్రి
నీదు నీడన మేము శరణార్ధులం
నిన్ను నిత్యమూ కొలిచెదము
హేమాద్రి వాసా భక్త హృదయ నివాసా

శిశువును మ్రోయు మాతృ హృదయము వోలే
సరోజాక్షి కూర్చుండు పద్మమ్ము వోలె
మెత్తగానుండు ఉదరమ్ము నీది
హేమాద్రి వాసా భక్త హృదయ నివాసా

శిల కాదది చెక్కని విగ్రహమ్ము
శ్రీ ఆంజనేయుని చక్కనైన రూపమ్ము
నీదు తోడుగ నిలిచి నిత్యమూ నీ వెంట నుండు
హేమాద్రి వాసా భక్త హృదయ నివాసా

నీదు చందనంబు మమ్ము చల్లగుంచు
నీదు దరహాసంబు మాకు ధైర్యమ్మునిచ్చు
నీదు నామస్మరణమ్ము మాకు రక్షణనిచ్చు
హేమాద్రి వాసా భక్త హృదయ నివాసా

దుష్టులను దునుమాడితివి దైత్యులను సంహరించితివి
శిష్టులను రక్షించితివి శిశువులు సైతం నిను తలచితిరి
పితృడవు నీవు లోకలకెల్ల పేర్మి పంచగా
హేమాద్రి వాసా భక్త హృదయ నివాసా

అన్నింటా నిండి వుంటివి నీవు సర్వవ్యాపకుడైతివి
అందరినీ కరుణతొ జూచితివి నీవు శుభాలు కూర్చుంది
అమ్మతో నీవు కూడి ఉంటివి అమృతమంటి ఆదరణనిచ్చితివి
హేమాద్రి వాసా భక్త హృదయ నివాసా


స్వాతి నక్షత్రాన ఉద్భవించిన సారంగపాణీ
సరస్వతి నిను అర్చించి ఆయెను శార్వాణి
సకల సంపదల లక్ష్మి నీ రాణీ
స్త్రీ అవతారమున నీవు నారాయణీ
సాత్త్విక గుణముతో మము దయ చూడుమ
సతతము ఆపదల నుండి కాపాడుమా
సదా నీ స్మరణకు అనుగ్రహించుమా మా
యందేమైన దోషములున్న మన్నించుమా


చింతామణి నీదు చెంత కొలువయ్యుంది
ఇక మాదు కోర్కెలు దీర కొదువేముందీ
కోరిన వారికెల్ల కొంగు బంగారమె కదా
హేమాద్రి వాసా భక్త హృదయ నివాసా

నీదు విగ్రహమ్ము దశ అడుగులు
నీదు ధ్వజస్తంభమ్ము అరవై అడుగులు
నీదు హృదయపు విశాలమ్ము కొల్వలేనంత
హేమాద్రి వాసా భక్త హృదయ నివాసా

నిన్ను దర్శించగ దూరాలు తరలి రాలేను
నిన్ను చూచిన పిమ్మట మరలిపోలేను
అందుచేత మా అంతరంగముననే వుండవయ్యా
హేమాద్రి వాసా భక్త హృదయ నివాసా

No comments: